Pages

Mahalaya Amavasya

పితృదేవతల ‘పక్షం' -  మహాలయ పక్షాలు


అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞ కర్మ సముద్భవః

అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలని గీతలో ఉంది.

మరణించిన వ్యక్తి తిథి నాడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకొని యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతేమిటి? వారి కోసం శాస్త్రం ఓ మార్గాన్ని నిర్దేశించింది. కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరిలు మరణించి ఉండవచ్చు. పెళ్లయినా.. సంతానం లేక మరణించిన దంపతులూ ఉండవచ్చు. ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు, యుద్ధాలలో ప్రాణాలు వదిలిన వాళ్లు, ఆత్మహత్య చేసుకున్నవాళ్లు, ప్రకృతి వైపరీత్యాల్లో గుర్తుతెలియక కన్నుమూసిన వాళ్లు ఉండవచ్చు. అటువంటి వారికి తిలోదకాలు ఇచ్చి.. వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం నిర్దేశించినవే మహాలయపక్షాలు.


భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షాలు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని వారి వారసులు శ్రాద్ధ విధులు నిర్వర్తించడానికి వీటిని నిర్దేశించారు. వీటినే పితృపక్షాలు అనీ, అపరపక్షాలు అనీ పిలుస్తారు. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షాల ముఖ్యోద్దేశం.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుందని మనశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమి మీదికి జీవాత్మగా రావాల్సి ఉంటుంది. మరణించిన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే.. పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అలా అందించే అధికారం వారి కడుపున పుట్టిన పుత్రులకే ఉంటుందని చెబుతోంది శాస్త్రం. అప్పుడే వారి పితృరుణం తీరుతుంది. ఆ రుణం తీరడమే మోక్షం.


కాలం చేసిన వంశస్థులతో పాటు పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా మహాలయ పక్షాల్లో తిలోదకాలతో పిండప్రదానం చేసే అర్హత, అధికారం కర్తకు ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణంతోనైనా.. తద్దినం పెట్టకపోతే.. ఆ దోషం మహాలయ పక్షాల్లో పితృవిధి నిర్వర్తిస్తే తొలగిపోతుందంటారు. ఈ పక్షాలº్ల పితృదేవతలు ఆశతో తమ వారసుని ఇంటిని ఆవహించి ఉంటారని నమ్ముతారు.పితృవిధి నిర్వర్తించిన వారసుడిని మనసారా ఆశీర్వదించి, పిల్లాపాపలతో సంతోషంగా జీవించమని దీవిస్తారట .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online