Pages

విష్వక్సేనులవారు ఎవరు?........story about visvaksena

 జై శ్రీరామ్.....!

ఎవరైతే విష్ణు సైన్యాదిపతియైన విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ విఘ్నాదిపతులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడి దగ్గర గజ ముఖులు ఎంతో మందికి ఈయన అధిపతి. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు.శైవ ఆలయాలలో విగ్గనేశ్వరుని పూజిస్తారు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో... పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోందని, ఇంత వరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి, అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అన్నారు

అనంతరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు, ఆయనతో ద్వారపాలకులు చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. అతని మాటలతను విని సంతోషపడిన నారదుడు తాను వైంకుఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైకుంఠంలో సంచరించగలిగేది విష్వక్సేనుడనని, అంతటి అదృష్టం తనకు దక్కలేదని చెబుతాడు. ఆ మరుక్షణమే భక్తుడు, విష్వక్సేనుని ముందుకెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగడుతాడు. అది విన్న విష్వక్సేనుడు, తన కంటే గరుత్మంతునిదే అదృష్టమని అనగా, ఆ గరుత్మంతుడు, తనకంటే స్వామి పాదాలను ఒత్తుతూ, తరిస్తోన్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటారు. మరి, ఆ లక్ష్మీదేవేమో, తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెబు తుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నంత సేవను తాను చేయలేకపోతున్నానని అంటుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయన అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, ‘మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడివి. మేమందరం ఆయన కోసం పరుగులు పెడుతోంటే, ఆ పరంధాముడు మీ వంటి భక్తుల కోసం పరుగులు పెడుతు న్నాడు. అదృష్టమంటే మీదేగా!’ అని అన్నాడు. 

అ(సలు విశ్వక్సేనులు ఎవరు?ఒకసారి రాక్షసులు పెట్టే బాధలను ఓర్చుకోలేకపోయిన దేవతలు, వైకుంఠానికి వచ్చి, తమను రాక్షసుల బారి నుండి కాపాడవలసిందంటూ శ్రీమన్నారాయ ణుని ప్రార్తించారు. అప్పుడు విష్ణుమూర్తి చంద్ర అనే వానిని పిలిచి, రాక్షసుల పని పట్ట మని చెప్పాడు. స్వామి వారి ఆజ్ఞతో ఆ రాక్షసులను తరిమి తరిమి కొట్టిన చంద్ర యొక్క శౌర్యప్రతాపాలను మెచ్చుకున్న నారాయణుడు, అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విష్వక్సేనుడు. శ్రీవైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు రూపమే విష్వక్సేనుడని అంటారు. ఆయన సర్వమంగళనాయకుడు. విఘ్ననివారకుడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని పాంచరాత్ర ఆగమం వైఖానస ఆగమం చెబుతోంది.మేఘశ్యాముడు, సుమణిమకుటధారి అయిన విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. విష్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి. శ్రీమన్నారాయణునికి సేనాపతి. ‘విశ్వ’ అంటే ఈ సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడని  అర్థం. ఈ సృష్టిలో ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలకు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే పధ్నాలుగు భువన ఖండాలకు అధిపతి. శైవాగమం గణపతిని ప్రతిశుభకార్యంలో ముందుగా పూజించి, అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లు, శ్రీ పాంచరాత్రాగమం వైఖానసాగమం విష్వక్సేనుని ప్రతి కార్యక్రమంలోను పూజిస్తారు. శైవాగమం గణపతిని పసుపు ముద్దగా చేసి పూజిస్తే, శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది

బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. వినాయకునికి సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే, బుద్ధి కలిగినపుడే కార్యక్రమం తలపెడతాము. సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుందని శైవాగమం చెబుతుంది. శ్రీవైష్ణవ ఆగమాలు కూడ చెబుతున్నది అదే. శ్రీ పాంచరాత్ర ఆగమం శ్రీ వైఖానస ఆగమం ప్రకారంగా నిత్యకైంకర్యాలు నిర్వహించే  శ్రీ వైష్ణవ ఆలయంలో స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలలో విష్వక్సేనులవారు ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీవేష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి.

విష్వక్సేనుల వారు నాలుగు భుజాలతో గోచరిస్తూ, శంఖ, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.యస్య ద్విరద వక్త్రాద్యాఃపారిషద్యాః పరశ్శతమ్‌విఘ్నం నిఘ్నంతి సతతంవిష్వక్సేనం తమాశ్రయే అని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాము. ఆ స్వామి సేవలో తరించిపోదాము .......రంగాచార్యుల వారు చెప్పిన విధముగా..........




0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online