Pages

నీలమతపురాణం...కాశ్మి ర్ కు సంబంధించినది by కె.మురళీ కృష్ణ

 [8/10, 7:52 PM] Murali: _*నీలమత పురాణం – 1*_చదవండి దీనిలో ఆనాటి చరిత్ర ...సంస్కృతి ..ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది ..కల్హణుడి.....రాజతరంగిణి రచన లోని విషయాలు కొన్ని కలుస్తాయి



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




కశ్మీరుకు చెందిన అత్యంత ప్రాచీన పురాణం , *నీలమత పురాణం* తెలుగు అనువాదం.  Part1


*శ్రీనివాసం హరిం దేవం వరదం పరమేశ్వరమ్|*

*త్రైలోక్యనాథం గోవిన్దం ప్రణమ్యాక్షరమవ్యయమ్||*


*పరీక్షిద్వంశభృచ్ఛ్రీమాన్ నృపతిర్జనమేజయః|*

*పప్రచ్ఛ శిష్యం వ్యాసస్య వైశంపాయ నమన్తికాత్||*


దైవ ప్రార్థన తరువాత రాజు జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు.


మహాభారతం కథను జనమేజయుడికి వినిపించినది వైశంపాయనుడు. వైశంపాయనుడు వ్యాసమహర్షి శిష్యుడు. జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు. సర్పయాగం తలపెట్టి నిర్వహించి సర్పాలను నాశనం చేస్తున్న జనమేజయుడిని మహర్షులు సర్పయాగం నిర్వహణ నుంచి విరమింపజేస్తారు. ఆ తరువాత వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత గాథ వినిపిస్తాడు.


*‘నీలమత పురాణమ్’* ఆరంభం ఇది. ఇది జనమేయజుడికి వైశంపాయనుడు వినిపించిన పురాణం.


*అమరకోశం ప్రకారం పురాణానికి నిర్వచనం:*


*”సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశోమన్వంతరాణిచ*

*వంశాను చరితమ్ చేతి పురాణం పంచ లక్షణమ్‌”*


*‘సర్గ’* అంటే సృష్టి ఆవిర్భావం గురించి వివరించేది. *‘ప్రతి సర్గ’* అంటే ప్రపంచాలు నాశనం అయి తిరిగి సృష్టి సంభవించటం గురించి చెప్పేది. వంశ – వంశావళిని వివరించేది. మన్వంతరం – మను జీవితకాలం మన్వంతరం. వంశానుచరిత అంటే సూర్య , చంద్ర వంశాల వారి వంశవృక్షాలను , వారి చరిత్రను వివరించేది. ఈ అయిదు లక్షణాలు ఉన్నదాన్ని *‘పురాణం’* అంటారు. అయితే , విష్ణు , వాయు , మత్స్య , *భాగవత పురాణాలు* మినహా మిగతా ఏ పురాణం కూడా ఈ నిర్వచనంలో ఒదగదు. నీలమత పురాణం కూడా !


భారతీయ ప్రాచీన వాఙ్మయంతో ఒక సమస్య ఉంది. ఏ రచన కూడా ఈ కాలానికి చెందినది అని ఖచ్చితంగా చెప్పటం కష్టం. *‘కల్హణ రాజతరంగిణి’* ఏ కాలంలో రాసిందో నిర్ణయించడం సులభం. ఎందుకంటే కల్హణుడి జీవితకాలం గురించి అంచనా వేసే వీలుంది. రాజతరంగిణిలో కూడా కల్హణుడు తన జీవితకాలంలో తాను చూసిన విషయాలను ప్రస్తావించాడు. ఆనాటి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో రాజతరంగిణి రచన కాల నిర్ణయంలో కష్టం లేదు. కానీ *‘నీలమత పురాణం’* గురించిన ప్రస్తావన రాజతరంగిణిలో ఉంది. కాబట్టి రాజతరంగిణి కన్నా ముందరిది *‘నీలమత పురాణం’* అనడంలో ఎలాంటి సంశయం లేదు. సమస్యల్లా *‘ఎంత ముందరిది ?’*  అన్న విషయం దగ్గరే వస్తుంది.


రాజతరంగిణిలో నీలమత పురాణం ప్రస్తావన స్పష్టంగా *‘మూడవ గోవిందుడి’* కాలంలో వస్తుంది. బౌద్ధులు విజృంభించటం వల్ల ప్రాచీన సంప్రదాయాలు , సంస్కారాలు అదృశ్యం అవుతూండటంతో కోపించిన నాగులు కశ్మీరులో మంచు తుఫానులను కురిపిస్తుంటారు. వాటినుంచి ప్రజలను కాపాడేందుకు *‘చంద్రదేవుడు’* అనే వ్యక్తి నాగులను శాంతింపజేస్తాడు. మంచు తుఫానుల బారి నుంచి ప్రజలను రక్షిస్తాడు. అయితే అతడు ఒక నియమం విధింపజేస్తాడు. అదేమిటంటే దేశమంతా నీలమత పురాణాన్ని వ్యాపింపజేయాలి (చూ. ; *‘రాజతరంగిణి’* లో మొదటిభాగం 55 వ అధ్యాయం , శ్లో:182-186: *‘కల్హణ రాజతరంగిణి కథలు’* లో *‘ప్రజా పుణ్యైః సంభవంతి మహీభుజః’* కథ , పేజీ 58-64).  దాంతో కశ్మీరులో మళ్ళీ శాంతి నెలకొంటుంది.


*‘రాజతరంగిణి’*  ప్రకారం ఈ కథ మూడవ గోవిందుడి కాలంలో జరిగింది. *‘రాజతరంగిణి’* ప్రకారం నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడు. కానీ అంతకు ముందే అమలులో ఉండేది నీలమత పురాణం.  ప్రజలు విస్మరించిన సంప్రదాయాలు , సంస్కారాలు , పూజా విధానాలను క్రోడీకరించి చంద్రదేవుడు గ్రంథస్తం చేశాడు. *‘రాజతరంగిణి’* ప్రకారం ఈ కథ లౌకికాబ్దం 1894 లో జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం ఈ లౌకికాబ్దాల లెక్కలు తీస్తే ఇది క్రీ.పూ. 1182 వ సంవత్సరం అవుతుంది. ఇక్కడే వస్తుంది సమస్య !


కల్హణుడు ఇచ్చిన తేదీ సరైనదిగా భావిస్తే మొత్తం మనం ఏర్పాటు చేసుకుని , నమ్ముతున్న చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకున్న చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు పుట్టింది క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో. అది నిజమైతే కల్హణుడు ఇచ్చిన తేదీని ఆమోదించలేము. ఎందుకంటే క్రీ.పూ. 1182 సంవత్సరం నాటికల్లా బుద్ధుడు మరణించి , బౌద్ధం వ్రేళ్ళూనుకుని దేశమంతా విస్తరిస్తోంది. బౌద్ధులు దేశమంతా విస్తరించి సనాతన సంప్రదాయాలపై ఆధిక్యం సాధిస్తున్నారు. *‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’* లాంటి పరిస్థితి ఇది.


కల్హణుడిది ప్రామాణికం అనుకుంటే నీలమత పురాణం క్రీ.పూ. 1182 నాటిది. బుద్ధుడు అంతకు కొన్ని వందల సంవత్సరాలకు ముందు పుట్టి ఉండాలి.  బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో పుట్టేడని , అదే నిజమని నమ్మితే *‘నీలమత పురాణం’*  క్రీ.పూ కాదు ,  క్రీ.శ. లోనిదై ఉండాలి. ఎప్పటిదై ఉంటుంది ?


పాశ్చాత్యుల ప్రకారం *‘నీలమత పురాణం’* లోనే బుద్ధుడి జన్మదినాన్ని సనాతన ధర్మానుయాయులు కూడా ఓ ఉత్సవంలా జరుపుకోవటం ఉంది కాబట్టి ,  క్షేమేంద్రుడు రాసిన *‘అవదాన కల్పలత’* లో కూడా ఈ ప్రస్తావన ఉంది కాబట్టి , క్షేమేంద్రుడి కాలం క్రీ.శ. 900 – 1165 గా తీర్మానించారు కాబట్టి , పాశ్చాత్య లెక్కల ప్రకారం బుద్ధుడు దశావతారాలలో ఒకటి అవడం క్రీ.శ. 1000 సంవత్సరం ప్రాంతంలో జరిగి ఉంటుంది కాబట్టి , నీలమత పురాణం క్రీ.శ. ఆరు , ఏడు శతాబ్దాలలో రచించి ఉంటారని తీర్మానించారు. ఒక దెబ్బతో క్రీ.పూ. 1182 నాటి రచన , క్రీ.శ. 6-7 శతాబ్దాలకు దూకిందన్నమాట.


ఈ లెక్కలలో ఏ లెక్కకూ ప్రామాణికం లేదు. ఏ లెక్కకూ ఆధారం లేదు. అంతా ఊహ. బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటి వాడని తీర్మానించారు కాబట్టి , దాన్ని కేంద్రంగా చేసుకుని మిగతా అన్నింటినీ దాని చుట్టూ తిప్పి ఊహించి నిర్ణయించుకున్నారన్న మాట. అంతే కాదు , క్షేమేంద్రుడి కన్నా నాలుగు , అయిదు వందల సంవత్సరాల క్రితం రాసినదనడానికే ఆధారమూ లేదు. కానీ అలా ఓ తేదీని ఊహించారు , నిర్ణయించారు , ప్రకటించారు. ప్రచారం చేశారు. పదే పదే అంటుంటడంతో అది స్థిరపడింది. ప్రామాణికం అయింది , అంతే తప్ప క్రీ.శ. ఆరు , ఏడు శతాబ్దాల కాలంలో నీలమత పురాణం రచించారనడానికి ఋజువులు లేవు. ఉన్నది కేవలం ఊహ. అంటే మన పూర్వీకులు తమ పుస్తకాలలో పొందుపరిచిన నిజాల కన్నా పాశ్చాత్యుల ఊహలే మనకు ప్రామాణికాలయ్యాయన్నమాటా.


కల్హణుడు చెప్పిన మూడో గోవిందుడిని ఆమోదిస్తాం. నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడన్న దాన్ని ఆమోదిస్తాం. కానీ కల్హణుడు చెప్పిన క్రీ.పూ. 1182 ని మాత్రం ఆమోదించమట. ఎందుకంటే,  అది ఆమోదిస్తే పాశ్చాత్యుల తేదీలు , సిద్ధాంతాలు తలక్రిందులు అవుతాయి. అదీ కథ. ఇదెలా ఉంటుందంటే , ఒక రాజు , ఒక పండితుడు దారిలో పోతున్నారట. వారికి మేకలు కాస్తున్నవాడు కనిపించాడు. రాజు ‘వీడేమిటి , గాడిదలు కాస్తున్నాడు?’ అని అడిగాడట. ఇప్పుడు , అవి గాడిదలు కావు , మేకలు అంటే పండితుడి మెడ పోతుంది. అందుకని ‘అవును రాజా… గాడిదలు కాస్తున్నాడేంటి వీడు’ అన్నాడట పండితుడు. దాంతో రాజు అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరు ఎంత చెప్పినా , చివరికి మేకల యజమాని అవి మేకలు అని అన్నా రాజు ఒప్పుకోలేదు. ఆ పండితుడు ఒప్పుకోలేదు , సైనికులు ఒప్పుకోలేదు. దాంతో ఆ రాజ్యంలో మేకలను గాడిదలనడం ఆనవాయితీ అయ్యిందట. మన చరిత్ర నిర్ణయంలోనూ , తేదీల నిర్ణయంలోనూ ఇదే జరిగింది. ‘ఇది నిజం’ అని నిరూపణ ఉన్న దానిని నమ్మక , *‘నా ఊహ నిజం’* అన్న బలమున్న వాడి ఊహే నిజం అయిందన్న మాట.


వచ్చిన చిక్కు ఏమిటంటే మన వాళ్ళు లెక్కలలో దిట్టలు. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలతో చూసి తెలుసుకుంటున్న విషయాలను వారు తమ మేధ ద్వారా దర్శించి ప్రకటించారు. *‘సమయ గణన’* అందులో ఒకటి. *‘కాల గణన’* లో సెకనులో లక్షవ వంతు వరకూ గణించి నామకరణం చేశారు. ఆకును ఒక సూదితో గుచ్చేందుకు అవసరమయ్యే సమయాన్ని *‘అల్పకాల’* అంటారు.


30 అల్పకాలాలు = 1 తృటి

30 తృటులు = 1 కాలా

30 కాలాలు =  1 కాస్థా

30 కాస్థాలు =  1 నిముష (ఒక మాత్ర)

4 నిముషాలు =1 గణిత

10 గణితాలు = 1 కాతువిర్పు (అంటే నిట్టూర్చే సమయం)


ఇలా ఒక పురాణంలోని *‘కాలమానాన్ని’* చూస్తూ పోతే వారు ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా , ఎంతో తీవ్రంగా , ఎంత లోతుగా విశ్లేషించేవారో తెలుస్తుంది. పైగా వారు ప్రతీ విషయంలోనూ ఖచ్చితంగా ఉండేవారు. ఒక పదాన్ని ఉచ్ఛరించడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించి , ఏ కార్యక్రమం ఎంత సమయంలో కావాలో నిర్ణయించేవారు. గ్రహగతుల విషయంలోనూ ఇంతే. దేన్నీ తేలికగా , అల్లాటప్పాగా వదలలేదు. పాయింటు తరువాత పది సున్నాల తరువాత ఒకటి (0.00000000001) కదా అని వదిలేయలేదు. అలాంటి వారు ఇచ్చిన లెక్కలను నమ్ముతామా ?


‘అప్పుడయింది  అది అన్నాము కాబట్టి , ఇది ఇంతలో అయిపోవాలి’ అని ఊహ ప్రకారం నిర్ణయించి నిర్ధారించేవారిని నమ్ముతామా ? అంటే మనం ‘ఊహాత్మాక నిర్ధరాణనే నమ్ముతాం’ అంటున్నాం. మన పూర్వీకుల కన్నా మనల్ని బానిసలు చేసినవారిపైనే విశ్వాసం ఉంచుతాం అంటున్నాం.


కాబట్టి *‘నీలమత పురాణం’* ఎప్పటిది , అన్న మీమాంసను పక్కనబెట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. కల్హణుడి ప్రకారం క్రీ.పూ. 1182 అనుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. *‘రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‍లా ఉండాలి’* అంటారు. కాబట్టి పురాణాలను పఠించేడప్పుడు పురాణాలను ‘నమ్మి’ ముందుకు సాగాలి. నమ్మకం లేకపోతే ముందుకు సాగినా లాభం లేదు.  నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పురాణాలు చదివితే పురాణం అర్థం కాదు , పైగా అపార్థం అవుతుంది. కాబట్టి *‘నీలమత పురాణం’* అత్యంత ప్రాచీనమైనది. క్రీ.పూ. 1182 కన్నా పాతది అని నమ్ముతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. నమ్మనివారు ఇక్కడే ఆగాల్సి ఉంటుంది. ముందుకు వస్తే అది వారి ఇష్టం ! పూర్వీకులపై విశ్వాసం , గౌరవాలతో ముందుకు సాగుదాం.


కస్తూరి మురళీకృష్ణ గారి నుంచి సేకరణ


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


Part2


“ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజులు పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ , అసందర్భం కానీ ఏమీ లేదు” అంటున్నారు అనువాద రచన లో.

జనమేజయ ఉవాచ !


మహాభారత సంగ్రామే నానా దేశ్య నరాధిపాః ।

మహాశూరాః సమాయాతాః పిత్రూణాం మహాత్మనామ్ ॥ 

కథం కాశ్మీరికో రాజా నాయాతస్త్రత్ర కీర్తయ్ । 

పాండవైర్ధార్త రాష్ట్రేశ్వ నా వృతః స కథం నృపః ॥


జనమేజయుడు అడుగుతున్నాడు:


“నా పూర్వీకుల నడుమ జరిగిన భారత యుద్ధంలో పాల్గొనేందుకు పలు విభిన్నమైన దేశాల నుండి , గొప్ప వీరులు వచ్చారు. పాల్గొన్నారు. కానీ కశ్మీర రాజులు ఆ యుద్ధంలో పాల్గొన్న సూచనలు లేవు. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం వహించే కశ్మీరుకు చెందిన రాజులను పాండుపుత్రులు కానీ , ధృతరాష్ట్ర సంతానం కాని ఎందుకని ఎంచుకోలేదు ? ఎందుకని యుద్ధంలో తమవైపు పాల్గొనమని ఈ రెండు పక్షాల వారు కశ్మీర రాజును అడగలేదు ?”


ఇదీ ప్రశ్న !


ఈ ప్రశ్నతో ‘నీలమత పురాణం’ ప్రారంభమవుతుంది.


గమనిస్తే ఈ ప్రశ్నలో ‘మహాభారత యుద్ధం నిజంగా జరిగిందా ? లేదా ?’ అన్న సందేహం లేదు. మహాభారత యుద్ధంలో వారు ఎలాంటి అస్త్రాలు , శస్త్రాలు వాడేరు ? అన్న మీమాంస లేదు. పలు ప్రాంతాల నుండి రాజులు ఆ యుద్ధంలో ఎవరో ఒకరి వైపు నుండి పాల్గొన్నారు. అంటే , భారత ఖండంలో ఆ యుద్ధం ప్రభావానికి గురవని రాజ్యం లేదన్న మాట. ప్రతి రాజ్యం లోనూ ఆ యుద్ధం గురించిన చర్చ జరిగిందన్న మాట. అందుకే జనమేజయుడు యుద్ధం నిజంగా జరిగిందా లేదా ? నిజంగా అక్షౌహిణుల సైన్యం పాల్గొందా ? లేక లేని గొప్పలు చెప్పుకున్నారా ? లాంటి ప్రశ్నలు అడగలేదు. సూటిగా ప్రశ్న అడిగాడు. “మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజుని పాండవులు కానీ , కౌరవులు కానీ తమవైపు పాల్గొనమని ఎందుకని అడగలేదు ?”


గమనిస్తే అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. అప్పుడూ , ఇప్పుడూ కూడా వివిధ పక్షాల వారు కలిసి కూటములు ఏర్పరచటం , మద్దతు సాధించటం , పోరాడటం ఏదో ఒక రూపాన జరుగుతూనే ఉంది. అప్పుడు రాజులు , ఇప్పుడు రాజకీయ పార్టీలు. అప్పుడూ ఇప్పుడూ దేశాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో కూటములుగా  ఏర్పడి మద్దతు ఆశించడం , “నువ్వు మా వైపు కాకపోతే మాకు వ్యతిరేకం” అన్నట్టు ప్రవర్తించడం ఉంది. అంటే ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది కానీ మారదు. అందుకే ఓ కవి ‘ఈ ప్రపంచం ముఖం పాతదే, కానీ ప్రపంచం కొత్తదిగా కనిపిస్తుంది’ అన్నాడు.


జనమేజయుడి మాటలలో గమనించదగ్గ మాట ఒకటుంది. ‘ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఆక్రమిస్తుంది కశ్మీరు’ అన్నది. ఈ మాట ప్రకారం కశ్మీరు ప్రాచీన భారతంలో ప్రపంచంలోనే ప్రాధాన్యం వహించిందన్నది స్పష్టమవుతోంది. అయితే కశ్మీర ప్రాధాన్యం పౌరాణికంగా ఏమిటన్నది వైశంపాయనుడు జనమేజయునికి ఇచ్చిన సమాధానంలో వస్తుంది. కానీ వైజ్ఞానికంగా చూసినా ప్రపంచంలో కశ్మీర్ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.


ఒక సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో తొలి మానవుడు ఉద్భవించింది కశ్మీరులోనే. పాశ్చాత్య చరిత్రకారులు , పరిశోధకులు ఆది మానవుడు ఆఫ్రికాలో ఉద్భవించి , యూరప్ ద్వారా ఆసియా వైపు ప్రయాణించాడని నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అలా అయితేనే వారి సిద్ధాంతాలు నిలుస్తాయి. కానీ కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన సెంట్రల్ ఏసియన్ స్టడీస్‌కు చెందిన పరిశోధకులు , ఆది మానవుడు ఉద్భవించింది కశ్మీర్‌లోనే అన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. దీనికి ప్రేరణ ‘బూర్జహామ్’ అన్న ప్రాంతంలో తవ్వకాలలో బయటపడ్డ అనేక అంశాలు. ఇక్కడి తవ్వకాలలో ఆది మానవుడు , ముఖ్యంగా , భూమిలో గుంటలు తవ్వి వాటిలో నివసించే మనుషుల అవశేషాలు కశ్మీరులో లభించడం శాస్త్రవేత్తలకీ ఆలోచనను ఇచ్చింది. అంతే కాదు , ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించే విషయం రామాపిథెకస్ ,  పంజాబికస్ విభాగాలకు చెందిన తొలి *‘హోమోఎరక్టస్’* మానవుడి ఛాయలు కశ్మీరులో లభించినవే అతి ప్రాచీనం అన్నది. అదీగాక భారతీయ ధర్మంలో అతి పవిత్రంగా భావించే అనేకం కశ్మీర్‌ ఒక్క ప్రాంతంలోనే దొరుకుతాయి. అన్ని ఒకే చోట లభిస్తాయి. శ్రీచక్ర చేప (మత్స్యవతారంగా భావిస్తారీ చేపను), పద్మం, భూర్జర పత్రం , దేవదారు వృక్షం , కేసరి , కస్తూరి , మంచు , శివుడు , నాగులు , మానవ రూపంలోని సర్పాలు వంటి వన్నీ కశ్మీరులో లభిస్తాయి. పౌరాణిక కథ ప్రకారం మానవ జీవుల బీజాలన్నింటినీ రక్షించి తెచ్చిన పడవ గమ్యం కశ్మీరు. అంటే ఏ రకంగా చూసినా , అటు పౌరాణికంగా , ఇటు విజ్ఞానశాస్త్రపరంగా అయినా కశ్మీరు అత్యంత ప్రాధాన్యం వహిస్తుందన్నమాట. ఇక సాంస్కృతికంగా కశ్మీరు ప్రాధాన్యం చెప్పనవసరం లేదు.


ఇంత ప్రాధాన్యం కల కశ్మీరు దేశం ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ , అసందర్భం కానీ ఏమీ లేదు. మహాభారత యుద్ధం జరిగిందా లేదా అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.


చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివిన తరువాత కీకరకాయ అన్నట్టు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం నీడలో వికృతమైన, మూర్ఖపుటాలోచనలకు విజ్ఞానశాస్త్రం ముసుగువేసి ,  అజ్ఞానాన్ని విజ్ఞానమని భ్రమపెట్టి ప్రజలకు అసలైన విజ్ఞానం సరైన రూపంలో అందకుండా జరుగుతున్న ప్రయత్నాల ప్రభావంతో ఈ రోజు మనల్ని మనమే నమ్మని పరిస్థితి సమాజంలో నెలకొంది


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


Part3


మహాభారత యుద్ధంలో పాల్గొనేందుకు కౌరవులు కానీ , పాండవులు కానీ కాశ్మీర రాజును ఎందుకని పిలవలేదన్న సందేహం జనమేజయుడికి వచ్చింది. దానికి వైశంపాయనుడు ఇచ్చిన సమాధానం తెలుసుకునే ముందు మనం అసలు మహాభారత యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది.


మహాభారత యుద్ధం సంభవిస్తుందని నిర్ధారణ కాకముందే కౌరవులు రాజులను తమవైపు కూడగట్టుకునే పని ప్రారంభించారు. పాండవుల వనవాసం ఆరంభం కాగానే కర్ణుడు దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు.  ఈ యాత్రలో కర్ణుడికి దాసోహం అన్న రాజులందరూ కౌరవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. తాము స్వయంగా యుద్ధంలో పాల్గొనలేని వారు సైన్యాన్ని పంపారు. ఇతర రూపంలో సహాయం అందించారు. వంగ , పౌండ్ర , సుషమ , సింధు , గాంధార , కళింగ వంటి దేశాల రాజులు కౌరవులతో బంధుత్వం ఉండడం వల్ల కౌరవుల తరఫున పోరాడారు. జయద్రధుడు దుస్సలను వివాహమాడడంతో *‘సింధు రాజ్యం’* , దుర్యోధనుడి మొదటి భార్య వల్ల త్రిగర్త , రెండవ భార్య వల్ల కళింగ , గాంధారి వల్ల గాంధారం వంటి దేశాలు కౌరవుల పక్షం వహించాయి.


పాండవుల తరఫున వారి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. ద్రౌపది వల్ల పాంచాల దేశం , అభిమన్యుడి భార్య ఉత్తర వల్ల మత్స్య దేశం , యుధిష్టరుడి భార్య వల్ల శివి దేశం , సహదేవుడి భార్య విజయ వల్ల మాద్ర దేశం , నలుడి భార్య కరేణుమతి వల్ల చేది దేశం , భీముడి భార్య బలాంధర వల్ల కాశి , మరో భార్య హిడింబి వల్ల ఘటోత్కచుడు, ఇతర రాక్షసులు ; అర్జునుడి భార్య ఉలూపి వల్ల నాగులు , కృష్ణుడు , సాత్యకి , పాండ్య రాజులు పాండవుల పక్షం వహించారు.


మహాభారతంలో కౌరవుల సైన్యం ఎంత , పాండవుల సైన్యం ఎంత , ఏయే సైన్యంలో ఎంతమంది సైనికులు ఉండేవారు వంటి విషయాలు విపులంగా ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఈనాడు ఒక పరిశోధకుడు ప్రపంచంలోని అన్ని దేశాల సైనికులను లెక్కించి ప్రకటిస్తే ఎంత సవివరంగా చెప్తాడో , అంత వివరంగా ప్రతీ చిన్న విషయాన్నీ మహాభారతంలో చెప్పటం గమనించవచ్చు. అంటే మన పురాణాలపై పలువురు విమర్శించేట్టు కాకి లెక్కలు , గాలి లెక్కలు చెప్తున్నట్టు  కాదన్నమాట.


పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు కాగా కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 గజదళం, 21,870 రథ దళం, 65,610 అశ్వదళం , 109,350 పదాతిదళం.


ఈ లెక్కలు చూస్తే కళ్ళు తిరుగుతాయి.


ఒక అక్షౌహిణి సంఖ్య ఇంత అయితే ఏడు అక్షౌహిణిలు , పదకొండు అక్షౌహిణిల సంఖ్యను లెక్కించడం సులభం.


అసలు అంత సంఖ్యలో ఆ కాలంలో ప్రజలు ఎక్కడున్నారు ? అని వాదిస్తారు కొందరు.


ఇంకో రెండు మూడు వందల ఏళ్ళ తరువాత 21వ శతాబ్దంలో మిలియన్ల సంఖ్యలో ప్రజలుండేవారంటే నమ్మని పరిస్థితులు రావచ్చు. ఇప్పటికే బ్రిటీషు కాలంలో వారు లేబర్ పనికి ఉపయోగించిన భారతీయుల సంఖ్య చూస్తే నమ్మబుద్ధి కాదు. ఇంకా బ్రిటీష్ పాలిత దేశాలకు (కామన్‍వెల్త్) వలసవెళ్ళి అక్కడే స్థిరపడిన భారతీయుల లెక్క చూస్తే నమ్మటం కష్టం. వంద , రెండు వందల ఏళ్ళ క్రితం లెక్కలే నమ్మ వీలుగా లేకపోతే , క్రీ.పూ. కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటి సంఖ్యలు నమ్మశక్యంగా లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కాస్త ఊహాశక్తిని ఉపయోగిస్తే , భూమి ఆవిర్భావాన్ని , కల్పాలను కోట్ల సంఖ్యలలో లెక్కించిన వారి మేధాశక్తిని నిష్పక్షపాతంగా గమనిస్తే , సెకన్లలో వెయ్యోవంతు కూడా ఖచ్చితంగా లెక్కించి పాటించే వారి పట్టుదల , నిజాయితీలను అర్థం చేసుకుంటే ఈ లెక్కలపై అనుమానాలు జనించవు.


ఇక సైన్యంలో ఒక వీరుడిని అతను ఎంతమందిని మట్టి కరిపించగల శక్తి కలవాడో అన్నదాని ఆధారంగా వర్గీకరించడం కనిపిస్తుంది.


మహారథి అంటే 12 మంది అర్ధరథులతో పోరాడే శక్తి కలవాడు. అతిరథి అంటే 9 మంది రథులతో పోరాడేవాడు. అతిరథ , మహారథులని మనం చాలా తేలికగా వాడతాం. మహారథి కన్నా గొప్ప వీరుడు లేడు. అతడి తరువాత అతిరథి. మహాభారతంలో అశ్వత్థామ , అభిమన్యుడు , లక్ష్మణ కుమారుడు (మాయాబజార్‍లో జోకర్), ఘటోత్కచుడు లాంటివారు అతిరథులు.


ఇంకా ఏకరథి (8 రథులతో పోరాడేవాడు), రథి (ఇద్దరు అర్ధ రథులతో పోరాడేవాడు), అర్ధరథి (2500 మందితో పోరాడేవాడు) , అతి మహారథి (12 మహారథులతో పోరాడేవాడు) , మహా మహారథి (24 అతి మహారథులతో పోరాడేవాడు) అనే వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణ ప్రకారం పాండవ సేనలో కృష్ణుడు *‘అతి మహారథి’*. అర్జునుడు ఇద్దరు మహారథులతో సమానం. భీముడు (ఏకరథి), ధర్మరాజు , నకులుడు , సహదేవుడు , ఉత్తర కుమారుడు (మరో జోకర్) వంటి వారు రథులు.



కౌరవ సేనలో భీష్ముడు , కర్ణుడు , ద్రోణాచార్యుడు , అశ్వత్థామలు మహారథులు. కృతవర్మ, శల్య , కృపాచార్య వంటివారు అతిరథులు. ధుర్యోధనుడు ఏకరథి. శకుని , లక్ష్మణ కుమారుడు , జయద్రధుడు , నీల వంటి వారు రథులు. పాండవుల వైపు వ్యూహ రచయిత శ్రీకృష్ణుడు. కౌరవుల వైపు శకుని. అంటే ఆ కాలం లోని అతిరథ , మహారథులు , వీరులు , రాజ్యాలు అన్నీ దాదాపుగా యుద్ధంలో పాల్గొన్నాయి. రుక్మి, విదురుడు , బలరాముడు మాత్రమే యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయినవారు. ఇలాంటి పరిస్థితిలో కాశ్మీర రాజును కౌరవులు కానీ , పాండవులు కానీ తమ వైపు పాల్గొనమని ఎందుకని అడగలేదన్న ప్రశ్న జనించడం స్వాభావికం.


దీనికి సమాధానం అత్యంత కీలకమైనది. భారతీయ చరిత్రలో , సాంఘికంగా , మానసికంగా , భౌగోళికంగా , ధార్మికంగా కాశ్మీరు ప్రాధాన్యతని స్పష్టం చేస్తుందీ సమాధానం.


*కశ్మీర మండలం చైవ ప్రధానం జగతి స్థితం।*

*కథం నాసౌ సమూహృత స్తత్ర పౌండవకౌరవైః ॥*


*కిం నామాభూత స రాజా చ కాశ్మీరాణాం మహాశయః ।*

*కథం వాసౌ నిశమ్యౌతన్నాయాత శ్చాత్మనా తథా॥*


ఎంతో ప్రాధాన్యం కల కశ్మీరుకి ప్రపంచంలోని దేశాలన్నీ పాల్గొన్న భారతయుద్ధంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానంగా గతంలో జరిగిన సంఘటనలు చెప్పడం ఆరంభిస్తాడు. ఇక్కడి నుంచి 30వ శ్లోకం వరకూ కశ్మీర చరిత్ర వివరణ ఉంటుంది. ఈ కథను రాజతరంగిణిలో కల్హణుడు నీలమత పురాణం నుండి  దాదాపుగా యథాతథంగా వాడినారు.


కశ్మీరును కలియుగారంభంలో మొదటి గోనందుడు అనే రాజు పాలిస్తూండేవాడు. ఈయన యుధిష్టరుడికి సమకాలీనుడు. జరాసంధుడికి సన్నిహితుడు. మధురపై దాడి చేస్తూ జరాసంధుడు , తమకు సహాయంగా రమ్మని గోనందుడిని ఆహ్వానిస్తాడు. మిత్రుడి ఆహ్వానాన్ని మన్నించిన గోనందుడు జరాసంధుడికి సహాయంగా మధురపై దాడికి వెళ్తాడు.


జరాసంధుడు దాడికి వస్తున్నాడని తెలియగానే కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ యుద్ధంలో ఓడిపోతాడు. ఒక కథ ప్రకారం కృష్ణుడు నగరం వదిలిపోతాడు. చాలా కాలం యుద్ధం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితిలో బలరాముడు యుద్ధరంగంలోకి దూకుతాడు. చాలాకాలం యుద్ధం సాగుతుంది. చివరికి యుద్ధంలో గోనందుడు తీవ్రంగా గాయపడతాడు. మరణిస్తాడు. దాంతో జరాసంధుడు ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతాడు. కశ్మీర సైన్యం కశ్మీరు చేరుతుంది.


తండ్రి మరణించడంతో *‘దామోదరుడు’* కశ్మీరు రాజవుతాడు. అతడు చక్కగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ అతడికి ఆనందం ఉండదు. యుద్ధంలో తండ్రి మరణం అతడిని బాధిస్తూంటుంది. ఇలాంటి పరిస్థితులలో గాంధార రాజు కృష్ణుడిని , అతడి బంధువులను స్వయంవరానికి పిలిచాడని తెలుస్తుంది. ఆ స్వయంవరానికి పెద్ద సైన్యం తీసుకుని దామోదరుడు వెళ్తాడు. అక్కడ కృష్ణుడితో తలపడాల్సి వస్తుంది. కృష్ణుడు అతనిని సంహరిస్తాడు.


ఆ సమయంలో దామోదరుడి భార్య యశోవతి గర్భవతి. కృష్ణుడు యుద్ధంలో విజయం సాధించినా కశ్మీరును ఆక్రమించాలని ప్రయత్నించడు. కశ్మీరుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టడు. కశ్మీరు శత్రువుకు మిత్రదేశం. అంటే పరోక్షంగా శత్రుదేశం. అయినా సరే , కృష్ణుడు కశ్మీరును ఆక్రమించాలన్న ఆలోచనను కూడా ప్రదర్శించడు. గర్భవతిగా ఉన్న యశోవతిని కశ్మీరుకు రాణిగా నియమిస్తాడు. తాను గెలిచి సైతం ఓడిన రాజు బార్యకు సింహాసనం అప్పగించిన అతి అపురూపమైన సన్నివేశం ఇది.


ఓడిన శత్రువులను అవమానించి , వాడి భార్యలను తన రాణివాసానికి సేవకులుగా తరలించడమో , వారి సేనలకు భార్యలుగా చేయటమో మాత్రమే తెలిసిన ‘జాతుల’కు కృష్ణుడి ఈ చర్యలోని ఔన్నత్యం అర్థం కాదు. భారతీయ ధర్మంలోని గొప్పతనం బోధపడదు. ఎందుకంటే వారి బుద్ధికి అందని ఔన్నత్యం ఇది. శత్రువును చంపటం , అతడి స్త్రీలను అవమానించటమే ఆధిక్యత అనుకునే ఆత్మన్యూనతా భావంలో మగ్గుతూ , అభద్రతా బావానికి గురయ్యే ఆత్మవిశ్వాసం లేని జాతులకు ఇలాంటి గాథలు కల్పితాలుగా , కట్టుకథలుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ భారతీయులకు ఇలాంటి ఔన్నత్యం , ఔదార్యం , ఉత్కృష్ట వ్యక్తిత్వ ప్రదర్శన సర్వసాధారణం.


ఇంతవరకు *‘నీలమత పురాణం’* లో ఉన్న కథను గ్రహించిన కల్హుణుడు కృష్ణుడు ఎందుకని కశ్మీరును ఆక్రమించలేదో వివరిస్తూ కృష్ణుడితో అద్భుతమైన శ్లోకం చెప్పిస్తాడు.


*కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్ఞేయో హరాంశజః ।*

*వా వజ్ఞేయస్య దుష్టోపి విదుషా భూతి మిచ్ఛతా ॥*


కశ్మీర భూభాగం పార్వతీమాత. రాజు శివాంశజుడు. అతడు దుష్టుడైనా పరలోక శ్రేయస్సు కోరి రాజును అవమానించరాదు.


ఇదీ భారతీయ ధర్మం. ఇదీ భారతీయాత్మ స్వచ్ఛమైన స్వరూపం.


కశ్మీరు రాజు తనపై కోపంతో ససైన్యంగా వచ్చి స్వయంవరంలో ఉన్న తనతో తలపడి ఓడినా కృష్ణుడికి ఆ రాజుపై ద్వేషం లేదు. రాజ్యంపై కోపం లేదు. రాజు చేసిన నేరానికి ప్రజలను ద్వేషించి వారిని హింసించాలని లేదు.


కశ్మీరు పార్వతితో సమానం. రాజు శివాంశజుడు. ఇంతే కావల్సింది ఆ రాజ్యాన్ని అతని భార్యకు అప్పగించేందుకు.


ప్రపంచంలో ఏ నాగరికతలో కూడా ఇలాంటి అత్యద్భుతమైన ఔన్నత్యం కంచుకాగడా పెట్టి వెతికినా లభించదు.




*‘నీలమత పురాణం’* లో ఈ ఘట్టంలో కేవలం కృష్ణుడికి కశ్మీరుపై ఉన్న పవిత్ర భావన వల్ల రాజ్యాన్ని యశోవతికి అప్పగించాడని ఉంటుంది. ఆ పవిత్ర భావన ఏమిటన్నది కల్హణుడు వివరించాడు రాజతరంగిణిలో (చూ. రాజతరంగిణి కథలు , కశ్మీరాః పార్వతీ కథ).


*తతః స వాసుదేవేన యుద్ధే తస్మిన్నిపాతిత్ః ।*

*అన్తర్వత్నీం తస్య పత్నీం వాసుదేవో అభ్యషేచయత్ ॥*


*భవిష్యత్పుత్ర రాజ్యార్థే తస్య దేశస్య గౌరవాత్ ।*

*తతః సా సుషేవే పుత్రం బాల గోనన్ద సంజ్ఞితమ్ ॥*


ఇదీ నీలమత పురాణంలో ఉంది. నరకుడికి వాసుదేవుడికి జరిగిన యుద్ధంలా దామోదరుడికి , వాసుదేవుడికి నడుమ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాసుదేవుడు దామోదరుడిని సంహరించాడు. కానీ కశ్మీరుపై గౌరవంతో ఆ గర్భవతి అయిన అతని భార్యను రాణిగా నియమించాదు భవిష్యత్తులో ఆ పుత్రుడు రాజవుతాడు. అతడి పేరు గోనందుడు.


ఇక్కడ గమనించాల్సిందేమిటంటే – *‘తనది కాని దాని కోసం ఆశ పడకపోవడం’* అన్న ఆధ్యాత్మికత , ధర్మంగా అమలు అవటం. అంతేకాదు , గెలిచిన వాడిది కాదు రాజ్యం. ఓడినా రాజ్యం వారిదే. గెలుపు ఓటములు దైవాధీనాలు. దాన్లో గొప్ప లేదు , కక్ష లేదు. క్రోధం లేదు. ద్వేషం లేదు. ఓడినవాడిపై చులకన భావం లేనే లేదు.


సాధారణంగా , ఆధునిక చరిత్రకారులు , చరిత్ర విశ్లేషకులు భారతదేశంలో రాజులను నీచులుగా , దుష్టులుగా చూపుతారు. భారతీయ మహిళలు వంటింట్లో బందీలయి , సంకెళ్ళలో మ్రగ్గుతూ వ్యక్తిత్వం అన్నది లేనివారని ప్రచారం చేస్తారు. దీనికి తోడు భారత దేశానికి ‘దేశం’ అన్న భావన స్వాతంత్ర్యం తరువాత సంస్థానల విలీనం తరువాతనే వచ్చిందని తీర్మానిస్తారు.


‘నీలమత పురాణం’లో దామోదరుడి మరణం తరువాత శ్రీకృష్ణుడు రాజ్యాన్ని గర్భవతి అయిన యశోవతికి కట్టబెట్టడం చూస్తే పై వాదనలన్ని శుష్క వాదాలనీ , పై పైన చూసేసి , పాశ్చాత్య దేశాల సామాజిక , రాజకీయ , మానసిక వికృతులను భారతదేశానికి ఆపాదించి , మనల్ని మనం తక్కువ చేసుకోవటం తప్పించి మరొకటి కాదని స్పష్టమవుతోంది. ఇది పులి , పిల్లిని చూసి తనని తాను మరచి పిల్లిలా కావడం లాంటిది (చూ. దేశభక్తి కథలు – ‘మన బెబ్బులి’ కథ).


ప్రాచీన కాలం నుంచి భారతీయులకు దేశానికి , ధర్మానికి అభేద ప్రతిపత్తి అనీ ; రాజులు , రాజ్యాలు పోయినా ప్రజల దేశభక్తి అంటే ధర్మభక్తి తప్ప రాజభక్తి , రాజ్య భక్తి కాదని నిరూపించే సంఘటన ఇది. మానవ చరిత్రలో మరపురాని మహత్తరమైన ఘటన ఇది. అలాంటి పార్వతి లాంటి కశ్మీరు ఈనాడు రాక్షసుల్లాంటి తీవ్రవాదుల చేతిలో చిక్కి విలవిలలాడుతోంది.





🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



Part4


“కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది?” అన్న ప్రశ్నకు సమాధానం ‘నీలమత పురాణం – 4’లో లభిస్తుంది.


*బాలభావాత్ పాండుసునైర్నానీతః కౌరవైర్న వా॥* (27)


గోనందుడు బాలుడవడం వల్ల కౌరవులు కానీ పాండవులు కానీ కాశ్మీరరాజును కురుక్షేత్ర యుద్ధంలో తమవైపు పోరాడమని కోరలేదు.


ఇదీ కాశ్మీర రాజ్యం కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాల్గొనపోకపోవటానికి కారణం.


*జనమేజయ ఉవాచ:*


*దేశస్య గౌరవం చక్రే కిమర్థం ద్విజసత్తమ।*

*వాసుదేవో మహాత్మా యదభ్యాషిశ్చత్స్యయం ప్రియమ్॥* (30)


అప్పుడు జనమేజయుడు అడిగాడు:


*“ఓ విప్రోత్తమా ! వాసుదేవుడు ఎందుకని కాశ్మీరాన్ని అంతగా గౌరవించాడు ? తాను ఆక్రమించకుండా ఒక స్త్రీని రాజ్యాధికారిని నియమించేటంతగా ఎందుకని గౌరవించాడీ దేశాన్ని ?”*


*ఇది కూడా అడగవలసిన ప్రశ్ననే.*


అందరూ కృష్ణుడిని ద్వేషిస్తారు. అతడిని అవమానించాలని ప్రయత్నిస్తారు. కృష్ణుడితో వైరం పూనుతారు. కానీ ద్వేషించేవారికి పది రెట్లు ఎక్కువమంది కృష్ణుడిని ఆరాధిస్తారు , గౌరవిస్తారు. కాబట్టి కృష్ణుడి ప్రతి చర్యకు కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ ప్రశ్నవల్ల కశ్మీరు ప్రాశస్త్యం , పవిత్రతలకు కారణాలు తెలుసుకోవచ్చు.


*ఈ ప్రశ్నకు సమాధానం జనమేజయుడు ఆశించినట్టే వస్తుంది.*


*యేషా దేవి ఉమా సైవ కశ్మీరా నృపసత్తమ।*

*అశీత సరః పూర్ణజలం సురమ్యం సుమనోహరమ్॥*


ఉమాదేవిదీ కశ్మీరానిదీ అభేద ప్రతిపత్తి. ఇక్కడ అనేక సుందరమైన సరస్సులు , నదులు ఉండేవి. నిజానికి కాశ్మీరం అంతా ఒకప్పుడు సరస్సుగా ఉండేది.


ఇక్కడి నుంచి కాశ్మీరాన్ని అతి సుందరంగా వర్ణిస్తాడు వైశంపాయనుడు. కాశ్మీరు ప్రజలు ధర్మబద్ధులై యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. సత్యాన్వేషణలో , సాధనలో సమయం గడిపేవారు. వేద వేదాంగాలను అభ్యసించేవారు. క్షత్రియులు వీరులు. వైశ్యులు వ్యాపారదక్షులు. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. ఇతరులు కూడా తమ కర్తవ్యాలను సక్రమంగా చిత్తశుద్ధితో నిర్వహించేవారు. అడుగడుగునా మందిరాలతో , పవిత్ర స్థలాలతో కశ్మీరు సర్వాగ సుందరంగా అలరాలేది.


*పృథివ్యాం యాని తీర్థాని తాని తత్ర నరాధిప।*

*ఋష్యాశ్రమ సంసంబాంధం శీతాతాప శుభం సుఖమ్॥*


భూమిపై ఎన్ని తీర్థాలున్నాయో అన్నీ కాశ్మీరులో ఉన్నాయి. ఋష్యాశ్రమాలతో సుందరమైన కశ్మీరు వేసవిలో చల్లగా ఉండి సుఖాన్నిస్తుంది.


శత్రువులతో పరాజయం ఎరుగనిదై , పరాజితమవటం అన్న మాట తెలియకపోవటం వల్ల అందువల్ల కలిగే భయం తెలియనిదై , కరువు కాటకాలు లేకుండా సుఖమయంగా ఉండేది కాశ్మీరు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా పండుగలతో కళకళలాడుతుండేది కాశ్మీరు. దౌష్ట్యం అన్నది లేకుండా పాములు , పులులు , ఎలుగుల వంటి దుష్ట జీవుల జాడ లేకుండా ఉండేది. కాశ్మీరులో  మనుషులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఆనందంతో సంబరాలు చేసుకునేవారు. అడుగడుగునా అందమైన వనాలతో , పూదోటలతో , ఆటపాటలతో స్వర్గంలా ఉండేది కశ్మీరు.


*తత్ర నద్యస్తథా పుణ్యాః పుణ్యాన్యపి సరాంసి చ।*

*దేవాలయాః సంపుణ్యాశ్చ తేషాం చైవ తథాశ్రమాః॥*

*కశ్మీర మండలం పుణ్యం సర్వతీర్థమరిందం।*

*తత్ర నాగా హృదాః పుణ్యాస్తత్ర పుణ్యా శిలోశ్చయా॥*


కాశ్మీర మండలం పుణ్యతీర్థాలతో నిండి ఉంది.  నాగుల పవిత్ర సరస్సులు , అతి పవిత్రమైన పర్వతాల కాలవాలం కాశ్మీరం. అతి పవిత్రమైన మందిరాలు , వాటి వెంటే ఋష్యాశ్రమాలు ఉంటాయి.


*తన్మధ్యేన చ నిర్యాతా సీమన్తమివ కుర్వతీ।*

*వితస్తా పరమా దేవీ సాక్షాద్విమనగోద్భవా॥*


ఇంత పవిత్రమైన కశ్మీరంలో , తలపై కేశాలను రెండు భాగాలుగా చేస్తూ పాపిట వేసినట్టు , రెండు భాగాలు చేస్తూ హిమాలయాలలో జన్మించిన దేవీ సమానమైన వితస్త నది ప్రవహిస్తోంది.


ఇది విన్న జనమేజయుడికి మరో సందేహం వచ్చింది.


*“కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది ?”* ఇదీ జనమేజయుడి సందేహం. ఇది కూడా అడగాల్సిన ప్రశ్ననే.


ఇప్పుడు భూగర్భశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఎదిగి భూమి ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు , కదలికలు పరిశోధించి , విశ్లేషించి తెలుపుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా సముద్రంలో మునిగి ఉండేది అని అందుకు నిదర్శనంగా ఆ ప్రాంతంలో కొండలలో ఉన్న రాళ్ళలో శిలాజాలు (fossils), నీటిలో మాత్రమే ఉండగలిగే జీవుల ఆనవాళ్ళను చూపి తీర్మానిస్తున్నది. లేకపోతే గతంలో ఓ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండేదని రాళ్ళపై ఉన్న ఆనవాళ్ళ ద్వారా తేల్చి చెప్తోంది. ఇంకొన్ని ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ఉండెవనీ , అక్కడి రాళ్ళన్నీ లావా ఘనీభవించడం వల్ల ఏర్పడినవేననీ చెప్తోంది. ఇలా భూగర్భశాస్త్రం అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఆవిష్కరిస్తుంది.


నీలమత పురాణం రాసిన కాలంలో *‘భూగర్భశాస్త్రం’* ఇప్పుడున్న రూపంలో లేదు. అప్పటి శాస్త్రం వేరు. కానీ ఇన్ని పరిశోధనల తర్వాత భూగర్భశాస్త్రం చెప్పిన విషయాలు ఆనాటి పురాణాలలో కనిపిస్తాయి. అయితే టెర్మినాలజీ వేరు.


ప్రాచీన కాలం నాటి వాఙ్మయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని విశ్లేషించేందుకు ప్రధాన ప్రతిబంధకం సాంకేతిక పదాలు.


ఇప్పుడు మనం పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఏర్పాటు చేసిన పేర్లకు అలవాటు పడిపోయాం.


ప్రాచీన కాలంలో పురాణాలు రాసేవారికి భవిష్యత్తులో తాము చెప్పిన అంశాలు భూగర్భ శాస్త్రం పరిధిలోకి వస్తాయని , వాటికి వేర్వేరు పేర్లుంటాయని తెలియదు. భవిష్యత్తు తరాల వారు తమకు తెలిసిన టెర్మినాలజీతో పురాణాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారని వారు ఊహించలేదు. దాంతో పురాణాలలో ఆనాటి ప్రతీకలతో ఆనాటి టెర్మినాలజీతో ఆనాటి పద్ధతి ప్రకారం విజ్ఞానాన్ని పొందుపరిచారు.


జనమేజయుడి ప్రశ్నకు వైశంపాయనుడు చెప్పిన సమాధానం ఆధునిక భూగర్భశాస్త్రం ఆవిష్కరణలతో సరిపోతుంది.


భూగర్భశాస్త్రం ప్రకారం ఒకప్పుడు హిమాలయ ప్రాంతమంతా టెథిస్ అనే సముద్రంతో నిండి ఉండేది. ఇది 70 మిలియన్ సంవత్సరాల నాటి పరిస్థితి. అప్పటికి భూమి ప్లేట్ల (ఫలకల) రూపంలో సముద్రంలో కదులుతూండేది. అలా కదులుతున్న ఇండో – ఆస్ట్రేలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్లు ఢీకొన్నాయి. ఈ ఇండో - ఆస్ట్రేలియన్ ప్లేట్ విడివడి ఆస్ట్రేలియా ఇండియాగా ఏర్పడ్డాయి. మ్యాన్మార్ లోని అరకన్ యోమా , అండమాన్ నికోబార్ ద్వీపాలు , బంగాళాఖాతం ఈ రెండు ప్లేట్లు ‘ఢీ’ కొనడం వల్ల ఏర్పడ్డాయి. టెథిస్ సముద్రాన్ని ఇండో - ఆస్ట్రేలియన్ ప్లేట్ కప్పేయడం వల్ల యూరేషియన్ ప్లేట్‌తో ఢీ కొన్నప్పుడు అక్కడున్నవన్నీ మడతలు పడి పైకి తోయబడ్డాయి. అలా ఏర్పడ్డ ముడత పర్వతాలు మంచుతో కప్పబడడం వల్ల హిమాలయ పర్వతాలు అన్నారు. అందుకే హిమాలయాలు పర్వతశిఖరాలపై సముద్రంలో ఉండవలసిన జీవజాలాల ఆనవాళ్ళున్నాయి. దాన్నిబట్టి ఒకప్పుడివన్నీ సముద్రంలో భాగమనీ , రెండు ప్లేట్లు ఢీ వల్ల కలిగిన ఘర్షణ వల్ల పర్వతాలుగా ఏర్పడ్డాయని ఊహిస్తున్నారు. ఈ కదలిక ఇంకా సాగుతోంది. అందుకే ఈ ప్లేట్లు ఢీకొన్న ప్రాంతాలలో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. భూకంపాలు వస్తూంటాయి. ఈ సమయంలో ఏర్పడినవే యూరప్ లోని ఆల్ఫ్స్ పర్వతాలు. ఈ ప్లేట్ల కదలికల శాస్త్రాన్ని *‘ప్లేట్ టెక్నానిక్స్’* అంటారు. పై నుంచి చూస్తే ఆల్ప్స్ పర్వతాలనూ , హిమాలయ పర్వతాలను ఒకే రేఖతో కలపవచ్చని తెలుస్తుంది. అంటే ప్లేట్లు తాకిన అంచువెంబడి పర్వతాలు ఏర్పడ్డాయన్నమాట. ఇప్పటికే ఇండియా ప్లేటు సంవత్సరానికి 67 మి.మీ. చొప్పున కదులుతూ ఆసియా ప్లేట్ వైపు దూసుకుపోతోంది. మరో పది మిలియన్ సంవత్సరాలలో ఇండియా ప్లేట్ ఆసియా ప్లేట్‌తో ఢీకొంటుంది. ఇప్పటికే జరుగుతున్న కదలికల వల్ల హిమాలయాలు సంవత్సరానికి 5 మి.మీ. ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అందుకే భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. హిమాలయాలలో హిమనీనదాలు ఉండడం వల్ల , వాటి కదలికల వల్ల కూడా భౌగోళిక స్వరూపం రూపాంతరం చెందుతోంది. ఇంత మంచు కరగడం వల్ల నదులు ఏర్పడ్డాయి , సరస్సులు ఏర్పడ్డాయి.


ఇలాంటి ఒక సరస్సు ప్రస్తుతం కశ్మీరు ఉన్న ప్రాంతంలో ఉండేది. దాన్ని సతీసరోవరం అని అంటూంటారని చెప్తున్నాడు వైశంపాయనుడు. దాని కన్నా ముందు ఆయన చెప్పిన వివరాలు , మనం పైన తెలుసుకున్న భూగర్భశాస్త్రం వివరాలితో పోలిస్తే ‘అద్భుతం’ అనిపిస్తుంది.


*“ఒకప్పుడు సరోవరంగా ఉన్న ఈ ప్రాంతం కశ్మీరంగా ఎలా రూపాంతరం చెందింది?”* అన్న జనమేజయుడికి తిన్నగా సమాధానం ఇవ్వడు.


ఇదే ప్రశ్నని గోనందుడు తీర్థయాత్ర సమయంలో బృహదీశ్వరుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు అని సమాధానం చెబుతాడు.


బృహదీశ్వరుడు – ముందు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళటానికి ఒక నెల పడుతుందని , ఇలాంటి రెండు నెలలు కలిస్తే ఒక ఋతువు అవుతుందనీ , మూడు ఋతువులు ఒక అయనం అవుతుందనీ , రెండు అయనాలు ఒక సంవత్సరం అవుతుందని చెప్తాడు. తరువాత ఇలాంటి నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు కలియుగం అవుతుందని చెప్తాడు. ఇంతకు రెట్టింపు ద్వాపర , మూడు రెట్లు త్రేతా యుగం , నాలుగు రెట్లు కృతయుగం అని చెప్తాడు. ఇలాంటి 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. మన్వంతరం సమాప్తి కాగానే ప్రళయం వస్తుంది , చరాచర సృష్టి అంతా నశిస్తుంది.


*భూర్లోకమాశ్రితాః సర్వా నాశమాయాంతి సర్వథా।*

*ఏకార్ణవం జగత్సర్వం తదా భవతి భూపతే ॥*


సృష్టి లోని సర్వం నశించడంతో , జగత్తంతా ఒక మహాసముద్రం అనిపిస్తుంది.


*శేషం చినశ్యతే సర్వ జంబూద్వీపం విశేషతః।*

*తదా వినష్టె లోకేఽస్మిన్మహాదేవః స్వయం ప్రభు॥*


జంబూద్వీపం పూర్తిగా నాశనమైపోతుంది. అలా నాశనమయ్యే విశ్వాన్ని కాపాడేందుకు సముద్రం నీటిలోకి మహా విష్ణువు స్వయంగా ప్రవేశిస్తాడు.


ఇలాంటి స్థితిలో సతీదేవి నౌక రూపం ధరిస్తుంది. మనువు జీవజాలాలను , బీజాలను ఆ పడవలో ఉంచుతారు. చేప రూపంలో విష్ణువు పడవను తీసుకువెళ్ళి పర్వతాలలో కట్టేస్తాడు. ఆ పర్వతం పేరు నౌబంధనా. ఈ పర్వత దర్శనం అన్ని పాపాలను , భయాలను నశింపజేస్తుంది. అలా ఒక కృతయుగం కాలం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది.




*విదధాతి ప్రజావర్గే యథాపూర్వమరిందమ్।*

*నౌదేహేన సతీ దేవీ భూమిర్భవతి పార్థివ॥*

*తస్యాం తు భూమై భవతి సరస్తు విమలోదకమ్।*

*షడ్యోజనాయతం రమ్యం తదర్ధేన చ విస్తృతమ్ ॥*


మళ్ళీ సృష్టి ఆరంభమైన తరువాత , నౌక రూపంలో ఉన్న సతీదేవి భూమిగా మారుతుంది. ఆ భూమిపై నిర్మలమైన నీరు గల *‘సతీదేశమ’* నే సరస్సు ఏర్పడుతుంది. ఆరు యోజనాల పొడవు , అందులో సగం వెడల్పు గల అత్యద్భుతమైన ఈ సరస్సులో దేవతలు జలకాలాడతారు.


*ఇలా ఏర్పడిందన్నమాట ‘సతీ సరోవరం’.*


ఈ లెక్కలు , యుగాలు , మన్వంతరాలు , సతీదేవి  నౌకా రూపం ధరించడం , నీరు భూమిగా మారటం ఇవన్నీ ఈనాటి వైజ్ఞానిక దృష్టితో చూస్తే హాస్యంగా , అవహేళనార్హంగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ప్రతీకలు , ఆ కాలం నాటి టెర్మినాలజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పురాణాలు , పౌరాణిక గాథలు ఎంత కట్టుకథలుగా అనిపించినా అవి కట్టుకథలు కావు , గట్టి కథలు అనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకునేందుకు మనం *‘విజ్ఞానం’* గా భావిస్తున్న విజ్ఞానాన్ని దాటి చూడాలనిపిస్తుంది.


భూగర్భశాస్త్రం , 70 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ‘అద్భుతం’గా భావిస్తాం , అదే కలియుగం నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు , ఇందుకు నాలుగు రెట్లు కృతయుగం అని , 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం అని అంటే *‘పుక్కిటి పురాణ లెక్కలు చెప్పకు’,* పొమ్మంటారు. ఇదీ మన దృష్టి.




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


Part5


నీలమత పురాణంలో కాశ్మీరు ఆవిర్భావానికి సంబంధించిన కథలాంటి కథనే రాజతరంగిణి లోను ఉంది. కొద్ది మార్పులతో ఇలాంటి ఉదంతం ‘మహావంశ’లోనూ , మూల సర్వస్తివాదానికి చెందిన చైనీయుల ‘వినయం’ లోను , హుయాన్‌త్సాంగ్ ప్రయాణ కథనాలలోనూ ఉంది. వీటన్నిటిలో కాశ్మీరును ఆధునిక భూగర్బ శాస్త్రం ప్రకారం బేసిన్ వంటి ఆకారంలో వర్ణించటం కనిపిస్తుంది.


కాశ్మీరు భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే , కాశ్మీరు నలువైపులా ఎత్తయిన కొండలతో ఒక బేసిన్ లానే అనిపిస్తుంది. ఈ లోయలోని కనిష్ట ఎత్తు సముద్రమట్టం కన్నా 5700 అడుగుల ఎక్కువ. పర్వతాలలోని అతి తక్కువ ఎత్తు పీర్‌పంజాల్ రేంజ్‌లో 3000 అడుగులు. ఒకవేళ కాశ్మీరుని ఓ బేసిన్‌గా ఊహిస్తే , ఈ బేసిన్‌లో చేరిన నీళ్ళు బయటకు పోయేందుకు *‘బారాముల్లా’* దగ్గర ఉన్న కొండరాళ్ళలోని పగుళ్ళు దారి కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని లోయలో సగభాగం ‘కరెవా’లనబడే చిన్న మట్టి గుట్టలతో నిండి ఉంది. ఈ మట్టి గుట్టల పై భాగం బల్లపరుపుగా ఉంటుంది. ఈ కరెవాలు భూగర్భ శాస్త్రం ప్రకారం ‘ప్లీస్టోసీన్ కాలం’లో ఏర్పడ్దాయి. ఇందులోని మట్టి అంతా ఒక సరస్సులోకి చేరే పదార్థాలతో నిండి ఉంది. అంటే నీటి జీవజాలాల శిలాజాలతో ఈ మట్టిగుట్టలు నిండి ఉన్నాయి. ‘ప్లీస్టోసీన్ కాలం’ అంటే ఒక మిలియన్ సంవత్సరాల నాటి కాలం. భూగర్బ శాస్త్రం పరిశోధన ఫలితాల ప్రకారం ఆ కాలంలో కశ్మీరు ప్రాంతమంతా నీటితో నిండి ఉండేదనీ , పీర్‌పంజాల్ పర్వతపంక్తుల ఆవిర్భావం వల్ల 5000 చ.కిమీ. ప్రాంతంలొ ఒక సరస్సు ఏర్పడిందని తేలింది. ఈ సరస్సులోని నీరు బారాముల్లా వద్ద ఉన్న రాళ్ళల్లోంచి బయటకు పారిందనీ , నీరు వెళ్ళిపొగా సరస్సు అడుగున మిగిలిన మట్టి గుట్టలే ‘కరెవా’లనీ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.


*కరెవాలు రెండు రకాలు*


సాధారణంగా భూగర్భ శాస్త్రం ప్రకారం సెడిమెంట్లు , అంటే ఒకచోట నిక్షిప్తపరచిన మట్టి , రాళ్ళు , ఇతర పదార్థాల ద్వారా ఏర్పడిన సెడిమెంటరీ శిలలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. వాతిలో కరెవాలు – arenaceous, argillaceous rocks వర్గీకరణలోకి వస్తాయి. అరెనేషియస్ అంటే క్వార్ట్‌జ్ అధికంగా ఉంటుంది. అర్జిలేషియస్ అంటే బురదమట్టి అధికంగా ఉంటుంది. రెండూ నీటిలోనే ఏర్పడే రాళ్ళు. కెరవాలలో పైన భాగంలో బురదమట్టి , క్రింది భాగంలో అరెనేసియస్ రాళ్ళు ఉన్నాయి. కేశవ్ , రెంబిరా , రోముషు , దూధ్ గంగా , శాలిగంగ , బోన్నాగ్ నాథ్ , నిన్గ్లీ వంటి నదులు ఇక్కడకు తమతో పాటు బోలెడంత సెడిమెంట్లను తెచ్చి వేశాయి. కరెవాలను కోస్తూ వాటి ముక్కలను మోసుకుపోతున్నాయి.


ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే , నీలమత పురాణం అమలులోకి వచ్చినప్పుడు భూగర్భ శాస్త్రం , పాశ్చాత్య దేశాలలోనూ ఒక శాస్త్రంగా ఎదగలేదు. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన పద్ధతులు , సూత్రాలు ఏర్పడలేదు. పైగా , ఆధునిక ‘విజ్ఞాన’ శాస్త్ర పరిశోధకులలా ఆనాటి ఋషులు ‘ఫీల్డ్ ట్రిప్’లకు వెళ్ళినవారు కాదు. వారికి ఆధునిక పరికరాలు , యంత్రాలు అందుబాటులో లేవు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా కనుగొన్న విషయాలను వారు తమ పురాణాలలో పొందుపరిచి భావి తరాల వారికి అందించారు. అయితెే వారి కాలంలో భాష వేరు , విషయాన్ని చెప్పే విధానం వేరు.  అంశాలను సూచించేందుకు వారు వాడిన పదాలు వేరు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా చెప్పినదీ , ఋషులు పురాణాల్లో కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్పినదీ దాదాపుగా ఒకటే.


కశ్మీరు మొత్తం నీటిలో మునిగి ఉండేది. పీర్‌పంజాల్ పర్వతాల ఆవిర్భావంతో కశ్మీరులో సరస్సు ఏర్పడింది. సరస్సులోని నీరు విడుదలవటం వల్ల కశ్మీర భూమి ఏర్పడింది. ఇక్కడ సరస్సు ఉండిందనేందుకు నిదర్శనాలు కరెవా మట్టి గుట్టలు.


పురాణం ప్రకారం కశ్మీరు అంతా సతీసరోవరమనే సరస్సు ఉండేది. ఆ సరస్సులో జలోద్భవుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడి వల్ల అందరు బాధలు పడుతుండేవారు. కానీ నీటిలో ఉన్నంత కాలం ఆ రాక్షసుడి బలం అధికంగా ఉంటుంది. కాబట్టి కశ్యపుడు నీరు బయటకు వెళ్ళేందుకు మార్గం ఏర్పరిచాడు. దేవతలు రాక్షసుడిని సంహరించారు. కశ్యపుడు ఏర్పరిచిన భూమి కాబట్టి కశ్మీరు అయిందీ ప్రాంతం.


టూకీగా పురాణాలు చెప్పే కశ్మీరు ఆవిర్భావం కథ ఇది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే , కశ్మీరు మొత్తం సరస్సు ఉండేదనీ , నీరు విడుదలవడం వల్ల కశ్మీరు ఏర్పడిందన్నది. టెథిస్ సరస్సు , పీర్ పంజాల్ రేంజ్ , కరెవాలు , అరెనేషియస్ , అర్జిలేషియస్ రాళ్ళు ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర టెర్మినాలజీ. జలోద్భవుడు , రాక్షసుడు , కశ్యపుడు , కశ్యపమేరు – కాశ్మీరు పురాణాల పదాలు.


అయితే నీలమత పురాణం ఎంతో వివరంగా కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్తుంది. ఆధునిక ఆర్కియాలజీ పరిశోధనలతో పోలిస్తే , ఈ విషయాలు అత్యంత ఆశ్చర్యకరమైనవిగా అనిపిస్తాయి.

                                                                                                   ( To be continued.......................)



0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online