[8/10, 7:59 PM] Murali: _*నీలమత పురాణం – 6*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*సముద్యుక్తై ర్యథా పూర్వం సముద్భుతా మహీస్థితిః।*
*తత్ర దక్షో దదౌ కన్యాః కశ్యపాయ త్రయోదశ॥* (69)
వైవస్వత మన్వంతరం ఆరంభమవుతుండగా దక్షడు తన పదముగ్గురు పుత్రికలను కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు.
నీలమత పురాణాన్ని పురాణంగా పలువురు పరిగణించకపోవడానికి కారణం , పురాణంగా వర్గీకరణకు గురికావాలంటే సర్గ , ప్రతిసర్గ , వంశ , మన్వంతర , వంశానుచరిత అన్న అయిదు లక్షణాలు ఉండాలి. నీలమత పురాణంలో సృష్టి గురించి ఉంది. మొత్తం విశ్వం నీటిలో మునిగి ఉండడం , మనువు జీవులను కాపాడడం ఉంది. ఆ తరువాత తిన్నగా వైవస్వత మన్వంతర ఆరంభం , దక్ష ప్రజాపతి పుత్రికలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేయడంతో కథ ముందుకు సాగుతుంది. అంటే సృష్ట్యారంభం , జీవుల ఉత్పత్తి వంటి వివరాలు లేకుండా తిన్నగా *‘వైవస్వత మన్వంతరంలో దక్ష ప్రజాపతి’* అంటూ కొనసాగడంతో , ఈ దక్ష ప్రజాపతి ఎవరు ? అతనికి పదముగ్గురు కూతుర్లు ఎలా కలిగారు ? కశ్యపుడు ఎవరు ? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అంటే , నీలమత పురాణం చలామణీలోకి వచ్చేనాటికి ఇందులో వివరించని అంశాలు అనేకం ప్రజలలో ప్రచారంలో ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి నీలమత పురాణం దృష్టి ప్రధానంగా *‘నీలుడు’* చెప్పిన అంశాలపైనే ఉండడంతో అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకని అనుకొని ఉండవచ్చు. ఇదెలాగంటే , ఒక రచన చేసే సమయంలో రచయిత తన రచనలోని ప్రధానాంశం మీద నుండి దృష్టి మళ్ళకుండా ఉండేందుకు , ఇతర విషయాలు.. అవి ప్రధానమైనా , అందరికీ తెలుసని వదిలేస్తాడు. అదీగాక నీలమత పురాణం కశ్మీరుకు ప్రత్యేకమైన స్థానిక పురాణం , ఇతర ప్రాంతాలకు అంతగా వర్తించదు. కాబట్టి , విశ్వ సృష్టి ఆవిర్భావం , జీవుల ఆవిర్భావం వంటి విషయాలన్నీ చెప్పే బదులు (ఇతర జాతీయ పురాణాలలో ఉన్నాయి కాబట్టి) తిన్నగా ప్రళయం, ప్రజాపతి దగ్గరకు వచ్చేసింది *‘నీలమత పురాణం’*. ఎందుకంటే నీలుడు ప్రవచించిన విషయాలు కశ్మీరుకే ప్రత్యేకం కాబట్టి తిన్నగా అసలు విషయానికి వచ్చేసింది.
పురాణాలలో గమనిస్తే *‘దక్షుడు’* ఒకడే అయినా అతని కథ రెండు భిన్న దశలలో కనిపిస్తుంది. ఒక కథలో *‘దక్షయజ్ఞం’* సమయంలో దక్షుడు శివుడి ఆగ్రహానికి గురయి మరణిస్తాడు. అప్పుడు దేవతలు గొర్రె తలను అతికించి దక్షుడిని బ్రతికిస్తారు. ఆ తరువాత దక్షుడు ఏమయ్యాడనేది ఏ పురాణం ప్రస్తావించదు. దేవీ పురాణంలో దక్షుడి తలను తెంపేందుకు భద్రకాళి వస్తుంది. పని పూర్తి చేస్తుంది. దక్షుడి జీవితంలో పురాణాలు ప్రస్తావించిన మరొక కథ సృష్టి ఆరంభం నుంచి ఉంటుంది.
బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి , అంగీరస , అత్రి , పౌలస్త్యుడు , వశిష్ఠుడు , పుహాహ , క్రతులను సృష్టించాడు. బ్రహ్మ ఆగ్రహం నుంచి రుద్రుడు రూపు దిద్దుకున్నాడు. అతని తొడ నుండి నారదుడు ఉద్భవించాడు. కుడి బొటనవేలి నుంచి దక్షుడు జన్మించాడు. బ్రహ్మ మెదడు నుంచి శౌనకుడు , ఎడమ బొటనవేలి నుంచి వీరణి అనే కూతురు జన్మించారు. వింధ్య పర్వతాలలో దక్షుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఫలితంగా మహావిష్ణు అతనికి దర్శనమిచ్చాడు. *‘అశిక్ని’* ని అతనిని భార్యగా ఇచ్చాడు.
కాళికా పురాణంలో *‘వీరణీ నామ తస్యస్తు అశిక్నిత్యాపి సత్తమా’* అని ఉండడంతో అశిక్ని , వీరణిలు ఒకే వ్యక్తి రెండు పేర్లుగా భావించే వీలు చిక్కుతోంది. అశిక్ని వల్ల దక్షుడికి సంతానం కలిగింది. వారిలో సతిని శివుడు వివాహం చేసుకున్నాడు. దక్షయజ్ఞం జరిగింది.
అయితే దక్షుడి జననం గురించి పురాణాలలో మరో కథ ఉంది. ‘బర్హి’ పదిమంది కుమారులను ప్రాచేతసులంటారు. వీరు దీర్ఘకాలం తపస్సు చేశారు. వారు తపస్సు ముగించుకుని వచ్చేసరికి , భూమిపై వృక్షాలు విపరీతంగా పెరిగి భూమి అడవిలా తయారయింది. అది చూసి ఆ పది మంది ఆగ్రహంతో అడవులను దగ్ధం చేయడం ఆరంభించారు. అప్పుడు ఔషధీ దేవత అయిన చంద్రుడు (సోమదేవుడు) అడవులను సంపూర్ణంగా దగ్ధం చేయవద్దని వారించాడు. చెట్లతో వారికి సంధి చేశాడు. ఒప్పందం చేశాడు. ఫలితంగా సర్వవృక్షాల సారంగా జన్మించిన మారిశను వారికి భార్యగా అందించాడు. తన తెలివిలో అర్ధభాగం , ప్రాచేతసుల తెలివిలో అర్ధభాగం గ్రహించి అత్యంత తెలివిగల దక్షుడు వారికి జన్మిస్తాడని వాగ్దానం చేస్తాడు. ఫలితంగా వారికి దక్షుడు జన్మించాడు.
అలాంటి దక్షుడిని పిలిచి బ్రహ్మ ప్రజలను సృజించమన్నాడు. ఫలితంగా , దక్షుడు దేవతలను , మునులను , ఋషులను , గంధర్వులను , అసురులను , నాగులను సృష్టించాడు. వీరి పునరుత్పత్తి కోసం స్త్రీ పురుషు జీవుల నడుమ లైంగిక చర్యను ప్రవేశపెట్టాడు. అశిక్ని ద్వారా అయిదువేలమంది సంతానాన్ని కన్నాడు. వారు మళ్ళీ పునరుత్పత్తి జరిపే సమయానికి నారదుడు అడ్డుపడి వాళ్ళని భూమి అంచులను దర్శించి రమ్మన్నాడు. అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. వారిని హర్యశ్వులంటారు. దాంతో దక్షుడు మళ్ళీ వెయ్యి మంది సంతానాన్ని సృష్టించాడు. వీళ్ళని శబలాశ్వులంటారు. వీరినీ నారదుడు ప్రపంచం నలుమూలలా విస్తరింపజేశాడు. దాంతో దక్షుడికి కోపం వచ్చి నారదుడిని దేశద్రిమ్మరి కమ్మని శపించాడు. అప్పుడు దక్షుడు అరవైమంది పుత్రికలను కన్నాడు. వారిలో పదిమందిని ధర్మదేవుడికి , 13 మందిని కశ్యపుడికి , 27 మందిని సోముడికి , నలుగురిని అరిష్టనేమికి , ఇద్దరిని బహుపుత్రునికి , ఇద్దరిని అంగిరసుడికి , ఇద్దరిని కృశాశ్వునికి ఇచ్చి వివాహం చేశాడు.
పురాణాలలో దక్ష ప్రజాపతి 60మంది పుత్రికల పేర్లు కూడా ఉన్నాయి.
*కశ్యపుడి భార్యలు:* అదితి , దితి , దను , అరిష్ట , కద్రువ , సురస , ఖస , సురభి , వినత , తామ్ర , క్రోధనక , ఇడ , ముని.
*ధర్మదేవుడి భార్యలు:* అరుంధతి , వాసు , యమి , లంబ , భాను , మరుద్వతి , సంకల్ప , ముహూర్త , సంధ్య , విశ్వ.
*సోముడి భార్యలు:* అశ్విని , భరణి , కృత్తిక , రోహిణి , మృగశిర , తారకం (ఆర్ద్ర) , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , ఫాల్గుణి , ఉత్తర ఫాల్గుణి , హస్త , చిత్త , స్వాతి , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రోణ , శ్రవిష్ట , ప్రాచేతస , పూర్వప్రోష్ఠపాదమ్ , ఉత్తర ప్రోష్ఠపాదమ్ , రేవతి
అయితే దక్షుడికి మరో భార్య ప్రసూతి (ఉత్తానపాదుడి సోదరి) ద్వారా 24గురు పుత్రికలు కలిగారు. వీరిలో పదముగ్గురిని ధర్మదేవుడు , ఒకరిని భృగు , సతిని శివుడు , మరీచి , అంగీరసుడు , పౌలస్త్యుడు , పులహుడు , క్రమ ఒక్కొక్కరిని – అనసూయకు అత్రిని , ఊర్జకు వశిష్ఠుడికి , స్వాహాను అగ్నిదేవుడికి ఇచ్చి చేశాడు.
అయితే ఈ విషయాలన్నీ చెప్పకుండా నీలమత పురాణం తిన్నగా కశ్యపుడికి 13 మంది పుత్రికలను ఇచ్చి వివాహం చేయడంతో చెప్తుంది. నీలమత పురాణంలో ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక నిముషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.
మన పురాణాల్లో ఉన్న అనేక విషయాలు మన బుద్ధికి విరుద్ధంగా తోస్తాయి. ప్రాచేతసులు చెట్లను కూల్చడం , చెట్ల పుత్రికను వివాహమాడటం , పదిమందికి ఒకడే పుత్రుడుదయించడం , దక్ష ప్రజాపతికి వేల కొద్దీ కొడుకులు కలగడం , వారు దేశాలు పట్టిపోవడం , మళ్ళీ 60 మంది కూతుళ్ళను కనటం , వారిని గంపగుత్తగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం , మళ్ళీ ఇంకో భార్యకు 13 మంది కలగటం – ఇదంతా అభూత కల్పనలుగా , అనౌచిత్యంగా , పుక్కిట కథలుగా అనిపించవచ్చు. దాన్లో ఎవరి దోషం లేదు. కాని ఒక విషయం – మనం దాన్ని ఏ దృష్టితో చూస్తామో… అలా కనిపిస్తుంది. దోషం విషయంలో ఉండదు , చూసే దృష్టిలో ఉంటుంది.
మన పురాణాలన్నీ పనికిరానివి , అర్థం పర్థం లేనివి , ఏదో ఉబుసుపోక అల్లిన కట్టుకథలని అనుకుంటే అవి అలాగే కనిపిస్తాయి. ముఖ్యంగా వాటిని విదేశీయుల దృష్టితో చూస్తే ఇంకా ఘోరంగా కనిపిస్తాయి. సాధారణంగా ఇరుగుపొరుగువారిలో కూడా ఒకరి పద్ధతులు మరొకరికి వింతగా , అసహ్యంగా తోస్తాయి. ఉదయం నాలుగు గంటలకు లేచేవాడికి , ఏడయినా లేవని వాడిని చూస్తే అసహ్యం కలుగుతుంది. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచేవాడికి , క్రమశిక్షణగా ఉంటూ , శౌచ్యం పాటించే వాడిని చూస్తే జాలి , ద్వేషం. లంచం తీసుకునేవాడికి తీసుకోని వాడిని చూస్తే భయం , ద్వేషం. ఇలాంటి పరిస్థితి ఇద్దరు వ్యక్తుల నడుమనే ఉంటే , ఒక జాతి మరొక జాతిపై ఆధిపత్యం సాధించినప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కాబట్టి ఎలాగయితే , గ్రీకు పురాణాలను , ఇతర విదేశీ పురాణాలను సానుభూతితో , అవగాహనతో , వాటిలోని ఆంతర్యాలను , ప్రతీకలను , అంతర్గతపుటాలోచనలను విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయో , అలాగే భారతీయ పురాణ గాథలను కూడా భారతీయ దృక్పథంతో అవగాహన చేసుకొని , సానుభూతితో , ప్రతీకలను గుర్తించి అవగతం చేసుకుని ఆలోచించాల్సి ఉంటుంది. అంతే తప్ప , బొటన వేలి నుంచి పుట్టడం ఏమిటి ? తొడ నుంచి పుట్టడం ఏమిటి ? అని ఈసడిస్తే ఎవరికీ ఒరిగేది ఏమీ లేదు.
పౌరాణిక గాథలను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఒక పద్ధతి కనిపిస్తుంది , ఒక ప్రణాళిక కనిపిస్తుంది. దేశం నలుమూలలో ఉద్భవించిన విభిన్న పురాణ గాథలు , విస్తరించిన విభిన్న పురాణాలలోనూ ఒక ఏక సూత్రత కనిపిస్తుంది. దేశమంతా ఒకే భావన , ఒక *‘ఐక్య’* భావన కనిపిస్తుంది. ఇది అత్యద్భుతమైన విషయం. ప్రతి అయిదడుగులకూ భాష , దృక్పథం , జీవన విధానం మారిపోయే పరిస్థితులలో అనాది కాలం నుంచీ అంతర్గతంగా అత్యద్భుతమైన *‘ఐక్యత’* ను సాధించటం ఏ నాగరికతలోనూ , ఎక్కడా కనిపించదు. భారతదేశంలోని ఒక రాష్ట్రమంత చిన్న చిన్న దేశాలున్న *‘యూరప్’* లోనే భిన్న భాషలు , భిన్న సంస్కృతులు , భిన్న పౌరాణిక గాథలు కనిపిస్తాయి. అలాంటిది కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కశ్యపుడు కనిపిస్తాడు. దక్షుడు కనిపిస్తాడు. దక్షుడి పదముగ్గురు పుత్రికలను కశ్యపుడు వివాహమాడుతాడు. ఇదెలా సాధ్యమైంది ? *ఆనాడు టెలివిజన్లు లేవు. సెల్‌ఫోన్లు లేవు. ఇంటర్‍నెట్‍లు లేవు.* క్షణంలో సమాచారం ప్రపంచం నలుమూలల విస్తరించే వ్యవస్థ లేదు. అయినా ఈ ఐక్యత , ఏక సూత్రత ఎలా సాధ్యమైంది ? దాన్ని సాధ్యం చేసిన వ్యవస్థ , ఆనాటి వ్యక్తులు ఎంత అద్భుతం ! కాబట్టి ఆయా గాథలను తేలికగా కొట్టేసి , చులకన చేసి , కాలర్లెగరేసి *‘ఇంటలెక్చువల్స్’,* *‘ప్రోగ్రెస్సివ్’* అయిపోవటం కన్నా ఆగి , ఆలోచించి , విశ్లేషించుకోవటంలోనే *‘విజ్ఞత’* ఉంటుంది.
[8/10, 7:59 PM] Murali: _*నీలమత పురాణం – 7*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*మారీచాయ సమాధత్స్య శ్రోతుం నామాని భూపతే।*
*తాసాం యస్థాశ్చ యే జాతాస్తేషాం నామాని మే శృంగు॥*
*అదితేస్తనయా దేవా దితేర్దైత్యాస్తథైవ చ।*
*గాంధర్వ్యా వాజినః పుత్రా భద్రాశ్చ సురభే సుతాః॥*
*“రాజోత్తమా కశ్యపుడి సంతానం నామాలు చెప్తాను విను. అదితి సంతానం దేవతలు. దితి సంతానం దైత్యులు. సురభి సంతానం భద్రులు.”*
ఇక్కడి నుండి కశ్యపుడి పుత్రుల పేర్లను వివరించడం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పేరు సరిగ్గా తెలిసీ తెలియనివారు కూడా భారతీయ ధర్మం , భారతీయ తత్వం , పురాణాల విషయంలో మహా పండితులుగా పురాణ విజ్ఞాన సర్వస్వాలుగా తమని తాము భావించుకుంటూ తమ బుద్ధికి (ఉందన్నది అనుమానమే) తోచినట్టు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. తమ అజ్ఞానంతో , అదీ ద్వేషపూరితమూ , కుట్రపూరితమైన దౌర్జన్యంతో , లేని పోని దుష్ట భావనలు సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం వల్ల , ద్వేష భావనలు విస్తరింపజేయడం వల్ల కలిగే తాత్కాలిక లాభాలను ఆశించి వందిమాగధ భట్రాజ గణం ఆ ద్వేషాన్నీ , పొరపాటునీ ‘సవ్యం’గా భావించి చిందులు తొక్కుతున్నారు. అకాండతాండవం చేస్తున్నారు. వారు చేస్తున్న విద్వేషపూరితమైన ప్రచారాలలో భాగమే దేవతలు అగ్రవర్ణాల వారని , దైత్యులు అల్పవర్ణాల వారని , దేవతలు రాక్షసులను సంహరించడం తరతరాలుగా అల్పవర్ణాల వారిపై జరుగుతున్న దౌష్ట్యానికి నిదర్శనం అని వాదించి ప్రచారం చేయడం. మరి కొందరు – దేవతలు ఆర్యులు , దైత్యులు స్థానికులు ; బయట నుంచి వచ్చి ఆర్యులు స్థానికులపై జరిపిన యుద్ధాలే ఈ దేవతల , దానవుల యుద్ధాలు అనడం. ఏ మాత్రం కనీసం పురాణ పరిజ్ఞానం ఉన్నవారు కూడా అంగీకరించని ఈ దుష్ట వ్యాఖ్యలు సమాజంలో ఆమోదం పొందడం భారతీయ సమాజంలో పురాణాల పట్ల ఉన్న ఉదాసీనతను , తమ గురించి కాస్తయినా తెలుసుకోవాలన్న ఉత్సాహ రాహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. తెలియనివాడిని మోసం చేయటం , మూర్ఖుడిని చేయటం , వాడిని తప్పుద్రోవ పట్టించి తనని తాను నాశనం చేసుకునేట్టు చేయటం చాలా సులభం. ప్రస్తుతం భారతీయ సమాజం అలాంటి స్వీయ నాశనకారి మూర్ఖుడి కన్నా అథమ స్థాయిలో ఉన్నవాడిలా ప్రవర్తిస్తోంది.
కశ్యపుడికి అదితికి జన్మించిన వారు దేవతలు. దితికి జన్మించిన వారు దైత్యులు అని దాదాపుగా ప్రతీ పురాణం స్పష్టం చేస్తోంది. ఆధునిక ప్రజాస్వామ్య విలువల ఆధారంగా లెక్కించినా , మెజారిటీ పురాణాలు ఇదే విషయాన్ని ప్రతీసారీ స్పష్టంగా నొక్కి చెప్తున్నాయి. అంటే , దేవతలు , దైత్యులకు తండ్రి ఒక్కడే. తల్లులు సోదరీమణులు. అంటే , వారి సంతానం కూడా వారి వంశానికి… ఆధునికంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒకే కులానికి చెందినవారు అవుతారు. ‘అదితి’ దక్ష ప్రజాపతి కూతురు. ఆమెకున్న పన్నెండుమంది సోదరీమణుల్లో దితి ఒకర్తె. బ్రహ్మ కాలి బొటనవేలి నుండి దక్షుడు ఉద్భవించాడు. బ్రహ్మ కులం ఏమిటి ? బ్రహ్మ బొటనవేలి కులం ఏమిటి ? దక్షుడి కులం ఏమిటి ? బ్రహ్మ ఆర్యుడా ?. దక్షుడు ఆర్యుడా ? ఒక వేళ బ్రహ్మ అర్యుడయితే , దక్షుడు ఆర్యుడు కావాలి. దక్షుడు ఆర్యుడయితే అతని పుత్రులూ ఆర్యులు కావాలి. పోనీ అతని ఇద్దరు భార్యలలో ఒకరు ‘అగ్రవర్ణం’ , మరొకకరు ‘అల్పవర్ణం’ అయితే ఒకరికి పుట్టిన సంతానం ఆర్యులు , అగ్రవర్ణం వారు. మరొకరికి పుట్టిన సంతానం అనార్యులు , అల్పవర్ణాల వారు అనుకోవాలి. కానీ ఇలాంటి అవకాశం లేకుండా ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టినవారు. అక్కచెల్లెళ్ళు. ఏ రకంగా చూసినా ఇక్కడ అగ్రవర్ణం , అల్పవర్ణం , ఆర్యులు , అనార్యులు ఎక్కడి నుంచో వచ్చారు , ఇక్కడ వారిని అణచివేశారు అన్న ఆలోచనలకు తావు లేదు. అసలు అలాంటి ఊహ తలంపు లోకి వచ్చేందుకు ఆస్కారం కూడా లేదు. అయినా అలాంటి వెర్రి మొర్రి కుళ్ళు ఆలోచనలు రావడమే కాదు , అవి ప్రచారం పొంది చలామణీలోకి వచ్చి ప్రజల నడుమ అడ్డుగోడలు నిర్మించగలుగుతున్నాయంటే అవి తమ గురించి తమకు తెలియని అజ్ఞానం తప్ప మరొకరి గొప్పతనం కాదు. గమనిస్తే అసలు ఆ కాలంలో ఇప్పటిలాంటి కుల , జాతి భావనలు లేవని అర్థమవుతుంది.
కశ్యపుడిని కొన్ని పురాణాలు బ్రహ్మ మనవడిగా ప్రకటిస్తాయి , మరికొన్ని పురాణాల ప్రకారం కశ్యపుడు బ్రహ్మ సంతానం. ఏ రకంగా చూసినా ఆర్యుడు కానీ అగ్రవర్ణాలకు చెందిన వాడు కానీ అయ్యే అవకాశం లేదు. మహాభారతం ప్రకారం బ్రహ్మ మానసపుత్రుడయిన మారీచి సంతానం కశ్యపుడు. కాబట్టి బ్రహ్మ మనుమడు. వాల్మీకి రామాయణం ప్రకారం మారీచి , అత్రి , పులస్త్యుల తమ్ముడు కశ్యపుడు. అంటే బ్రహ్మ సంతానం. కొన్ని పురాణాలు కశ్యపుడు , కాశ్యపుడు వేర్వేరుగా చూపితే , ఇంకొన్ని ఇద్దరినీ ఒకరిగా చూపుతాయి. దీన్ని పక్కనబెట్టి చూస్తే , కశ్యపుడు బ్రహ్మల నడుమ సంబంధం విషయంలో మాత్రం ఇలాంటి సందేహం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు మన పురాణ అజ్ఞాన సర్వస్వాలు దేవతలు , దైత్యులు , ఆర్యులు , అనార్యులు , అగ్రవర్నలు , అల్పవర్ణాలు అని భావించటానికి వారి ‘అజ్ఞానం’, ‘చిలిపితనం’ తప్ప మరొక ఆధారం లేదని స్పష్టం అవుతుంది.
కశ్యపుడి ఇతర జన్మల గురించి కూడా కొన్ని పురాణాలలో కథలున్నాయి. సుతపసుడు భార్య ప్రశ్నతో కలిసి 12000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడికి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వారు విష్ణువు తమకు సంతానంలా పుట్టాలని కోరుకున్నారు. తరువాత మన్వంతరంలో వారికి విష్ణువు *‘వామనుడి’* లా జన్మించాడు. కశ్యపుడు తరువాత వసుదేవుడి తండ్రిలా జన్మించాడు. అదితి దేవకిలా జన్మించింది.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే , పురాణాలలో ఇలా వ్యక్తులు , వారి సంతానం , వారి సంతానం ఇలా వివరాలు ఉండడం ఒక సామాజిక కార్యం నిర్వహిస్తుంది. సాధారణంగా మనిషి తాను క్షణికుడిని అనుకుంటాడు. రేపు అన్నది ఉందో లేదో తెలియని తన జీవితంలో ఉన్న ఈ క్షణాన్ని అనుభవించాలని భావిస్తాడు. తదనుగుణంగా సిద్ధాంతాలు సృష్టిస్తాడు. తనకు భవిష్యత్తు లేదనుకున్నవాడు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తాడు. ఇందుకు భిన్నంగా వ్యక్తికి తన గతం తెలిసి , తన పూర్వీకుల గొప్పతనం , తన వారసత్వపు ఔన్నత్యం తెలిసి , తన ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని , తన వారసులపై ప్రభావం చూపుతుందని గ్రహిస్తూ ఉంటే , ఆ వ్యక్తి తాను క్షణికుడు అనుకోడు. తాను కేవలం గతానికి భవిష్యత్తుకు నడుమ వారధి మాత్రమే అనుకుంటాడు. తన బాధ్యతను తెలుసుకుంటాడు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. ఇది గమనించిన ప్రాచీన సమాజాలన్నీ , ప్రతి వ్యక్తికీ తన గతం గురించి , తన వారసత్వం గురించి వివరించి , తమ జీవితం క్షణికం కాదు , ఇదొక నిరంతరం తరంతరం నుంచి తరానికి అందించే ప్రయాణం లాంటిదని తెలిపే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాయి. కొందరి పని ఇదే. ఊళ్ళు తిరుగుతూ ఊళ్ళోని వారందరికీ వారి పూర్వీకుల గురించి , పూర్వీకుల ఔన్నత్యం గురించి , వారసత్వం గురించి చెప్తుండేవారు. అందరి గురించి సమాచారం సేకరించేవారు. కొద్ది సంవత్సరాల క్రితం వరకు వ్యక్తులను వారి అసలు పేరుతో కాక , వారి పూర్వీకుల పేర్ల ఆధారంగా గుర్తు పట్టేవారు. *‘ఫలానా వారి మనవడు’* గా గుర్తించేవారు.
అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్’ రచన ద్వారా ఆఫ్రికాలోనూ ఇలాంటి వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది. ఇలా ఊరూరు తిరిగే వ్యక్తులకు తమ వారసత్వాన్ని గుర్తు చేసే ‘గ్రియోట్’ ద్వారా హేలీ తనవారిని కలుస్తాడు. ‘రూట్స్’ రచన మొత్తం ఈ సంఘటన వైపుకే పరుగెడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరమాద్భుతమైన ‘పతాక’ సన్నివేశం లాంటిది ఆ సంఘటన. తనవారిని కలుసుకున్న హేలీ న్యూనతా భావంతో కుంచించుకుపోతాడు. ఎందుకంటే తన నలుపు స్వచ్ఛం కాదు. తెల్లవారి సంగమంతో కలుషితమైన నలుపు అది. కానీ ఆఫ్రికాలో ఉన్న అతనివారిది స్వచ్ఛమైన నలుపు. దాన్ని చూసి తనని తాను కలుషితుడిగా భావించి న్యూనతా భావానికి గురవుతాడు హేలీ. అమెరికాలో పెరిగినవాడు , విద్యావంతుడు , ఆధునిక సౌకర్యాలను , సౌఖ్యాలను అనుభవిస్తున్నవాడు , ఆఫ్రికాలో ఓ మారుమూల ఎలాంటి ఆధునిక విజ్ఞాన గంధం లేనివారు , ఇంకా ఆదిమానవుల స్థాయిలో జీవిస్తున్నవారితో తనను తాను పోల్చుకుని సిగ్గుపడతాడు. న్యూనతా భావాన్ని అనుభవిస్తాడు. ఇది ‘రూట్స్’ రచన ఆత్మను స్పష్టం చేసే సంఘటన. తనవారికి , తన దేశానికి , తన వారసత్వానికి దూరమైన వ్యక్తి తన సంస్కృతి , సంప్రదాయాలను నిలుపుకోవటం కోసం , తనని తనకు దూరం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జరిపిన పరమాద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది ‘రూట్స్’. అతని పోరాటం ఏడుతరాల తరువాత విజయం సాధిస్తుంది. ఈ రచన తెలుగు అనువాదంలో ఈ సంఘటన కనబడదు. ఒక వ్యక్తి తన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకోవటం కోసం చేసే పోరాటం కనబడదు. కేవలం అణచివేత కనిపిస్తుంది. తెల్లవారి దౌష్ట్యం మాత్రం కనిపిస్తుంది. తెలుగులో సంక్షిప్త అనువాదం ముసుగులో దాగి , అనువాదకుడు తన సిద్ధాంతపు రంగుటద్దాలలో మూలంలోని జీవాన్ని , ఆత్మను చంపి ‘రూట్స్’ను ఏడు తరాలుగా అందించాడు. మూలం చదవని వారంతా రంగుటద్దాలతోనే ‘రూట్స్’ను అర్థం చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనే ఒక రచన ప్రచురితమైన కొద్ది సంవత్సరాలలోనే ఇంతగా దుర్వాఖ్యానానికి గురయి , అసలు అర్థానికి భిన్నంగా ప్రచారంలోకి వచ్చి ఆమోదం పొందుతుంటే , ఎప్పుడో రచించిన పురాణాల గురించిన దుర్వాఖ్యానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంగ్లంలోని రచనను తెలుగులోకి తప్పుగా అనువదిస్తే , ఆంగ్లం తెలిసినవారూ చెప్పలేదు. తెలియనివారి గురించి చెప్పనవసరం లేదు. పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. అది తెలిసిన వారు చెప్తున్నా వినే స్థితిలో సమాజం లేకపోవటం మన సమాజంలోని వైచిత్రిని స్పష్టం చేస్తోంది.
ఇక ‘నీలమత పురాణం’ విషయానికి వస్తే , దితి అదితిల సంతానం పేర్లు చెప్పిన తరువాత వరుసగా ఎవరెవరు ఎవరెవరికి జన్మించారో ఓ జాబితా ఇవ్వటం ఉంటుంది. ఇది ఆవశ్యకమైన అంశం. ఇలా పూర్వీకుల గురించి తెలియటం వల్ల సమాజంలో వ్యక్తులకు తమ జీవితం బుద్భుద ప్రాయమైనా సృష్టి అవిచ్ఛిన్న ధారలో భాగమని తెలుస్తుంది. అనంతమైన ఈ మాలలో తాను ఒక పుష్పమన్న భావన కలుగుతుంది. ఇది మానవ జీవిత పరిణామ క్రమము , సామాజిక అభివృద్ధి గురించి అవగాహన కలిగిస్తుంది. నీటి అణువులు దేనికదే ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉన్నా అనంతమైన పాథోరాశితో కలిపి చూస్తే దాని అస్తిత్వం లేదన్న గ్రహింపు కలుగుతుంది. కుటుంబం కోసం వ్యక్తి , సమాజం కోసం కుటుంబం , ధర్మం కోసం సర్వం త్యాగం చేయాలన్న సిద్ధాంతమ్ అర్థమవుతుంది. అందుకని ఈ జన్మల పరంపరను పురాణాలు ప్రకటిస్తూ , వ్యక్తులకు వారి వారసత్వాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకే భారతదేశంలోని ప్రతి వ్యక్తీ , ఆ వ్యక్తిని ఇతరులు ఎంత తక్కువవడిగా భావించి , చులకనగా చూసినా , తన ఉనికిని ఏ ఋషికో , ఇంకో మహానుభావుడికో ముడిపెట్టి అటునుంచి తిన్నగా సృష్టికారుడి నుంచి తన పరంపరను వివరిస్తాడు. ఆత్మవిశ్వాసంతో , ఆత్మగౌరవంతో వ్యవహరిస్తాడు. ఎవరెంత ప్రయత్నించినా అచంచలమైన విశ్వాసంతో నిలుస్తాడు. కానీ ఎప్పుడయితే అతని ఈ పరంపర గొలుసు తెగిపోతుందో , అప్పుడీ విశ్వాసం దెబ్బతింటుంది. దాంతో ఆత్మాభిమానరాహిత్యం , ఆత్మవిశ్వాస రాహిత్యం అతని మనస్సులో చోటు చేసుకుంటాయి. వ్యక్తి బానిస మనస్తత్వంలోకి దిగజారుతాడు. తనని తాను మరచిపోతాడు. అందుకే *‘గతం లేనివాడికి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు’* అంటారు. అందుకే ప్రపంచంలో ప్రజలను ఉత్తేజిత పరిచి , కార్యసాధనకు ఉన్ముఖులను చేసేందుకు ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం రగిలించేందుకు ‘గతం’ను ఒక ఆయుధంలా వాడతారు. లేని గతచరిత్రను సృష్టిస్తారు , వీరులను వెతుకుతారు. ప్రతీకలను సృష్టిస్తారు. అయితే ఇలా కృత్రిమంగా వెతికి , పద్ధతి ప్రకారం సృష్టించిన వాటి వల్ల ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం దురభిమానంగా , అహంకారంగా ముదిరితే తద్వారా చెలరేగే ద్వేషభావాల వల్ల కలిగే ప్రమాదాలు కూడా చరిత్రలో సాక్ష్యాలుగా దొరుకుతాయి. ఇందుకు భిన్నంగా ఎలాంటి ద్వేష భావనలు , ఉచ్చ నీచ భావనలు లేకుండా అత్యద్భుతమైన చరిత్రను , పరంపరను మన పూర్వీకులు మనకు పురాణాల రూపంలో అందించారు. తద్వారా ప్రజలందరి నడుమ ఐక్యత ఏర్పడి , ఉచ్చ నీచ భావనలు తగ్గి , స్నేహ సౌభ్రాతృత్వ భావనలు నెలకొంటాయి. ఎవరు తమ గతాన్ని ఎవరెవరి ద్వారా నిర్మించుకున్నా చివరకు అన్నీ సృష్టికారుడి దగ్గరకు చేరాల్సిందే. అలాంటి అద్భుతమైన ఏర్పాటును అపార్థం చేసుకోవటం వల్ల , తృణీకరించి , తూష్ణీంభావం వహించడం వల్ల అంతులేని సంపద ఉండి కూడా బికారుల్లా నిలవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఏ ప్రాంతీయ పురాణం రాసినా , ఎంతగా ఆ పురాణం స్థానికమైనదైనా దానిలో ఈ పరంపరను పొందుపరిచారు. దానివల్ల కశ్మీరులో ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నవాడు కూడా కన్యాకుమారిలో ఓ మూల ఉన్నవాడితోనూ సంబంధం గుర్తించగలడు. వాడితో స్నేహం నెరపగలడు. తాము ‘ఒకటి’గా భావించగలడు. కాబట్టి ఎంతగా విసుగు అనిపించినా , అప్రస్తుతం అనిపించినా పురాణాలలోని ఈ వంశావళిని , పరంపరను తప్పనిసరిగా పరామర్శించాల్సి ఉంటుంది. గమనించి , గ్రహించి , విశ్లేషించాల్సి ఉంటుంది.
[8/10, 8:00 PM] Murali: _*నీలమత పురాణం – 8*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*యక్షాశ్చ రాక్షసాశ్చైవ ఖసాయాస్తనథాః స్మృతాః ।*
*ఐరావణస్త్విలాపుత్రః పులవాయా దశ గాయనాః॥*
*ముని ప్రసవ ఉత్కశ్చ దివ్యో ప్యరసాం గణః।*
*కాలాయూ కాల కల్పాశ్చ కాలకేయా మతాః సుతాః॥*
‘ఖస’ తనయులు యక్షులు. ఐరావణుడు ఇలా పుత్రుడు. దశ గాయనులు పులవుడి పుత్రులు. మునికి అప్సరలు జన్మించారు. ‘కాలుడి’ కొడుకులు కాలకల్పులు, కాలకేయులు.
పురాణముల ప్రకారం స్వర్గంలో మూడు రకాల దేవతలుంటారు. దేవతలు , గణదేవతలు , ఉపదేవతలు.
గణ దేవతలు అంటే
12 మంది ఆదిత్యులు ,
10 విశ్వదేవులు ,
8 వసువులు ,
36 తుషితలు ,
64 ఆభాస్వరులు ,
49 అవిలులు ,
220 మహారాజికులు ,
12 సాధ్యులు ,
11 రుద్రులు. ఉపదేవతలు 10 రకాలు – విద్యాధరులు, అప్సరసలు , యక్షులు , రాక్షసులు , గంధర్వులు , పిశాచాలు , గుష్యకులు , సిద్ధులు , భూతాలు. నీలమత పురాణంలో ఖస తనయులు యక్షులు అని ఉంది. కానీ ఈ ‘ఖస’ ఎవరో ఎక్కడా లేదు. పురాణాలలో ‘ఖస’ విష్ణు పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య. మహాభారతం ప్రకారం ‘ఖస’ అన్నది ప్రాచీన భారతంలో ఒక దేశం. మహాభారతంలో ఆదిపర్వంలో బ్రహ్మ జననం తర్వాత విరాట్ పురుషుడి ‘అండం’ నుంచి యక్షులు జన్మించారని ఉంది. అగ్నిపురాణం ప్రకారం యక్షులు , రాక్షసులు ‘ముని’కి జన్మించారని ఉంది. ఈ ముని కశ్యప ప్రజాపతి భార్య. రాక్షసులు , గంధర్వులు ఈమె సంతానం. అగ్నిపురాణంలో ‘ముని’కి 16 మంది గంధర్వులు జన్మించారని , వారిలో పెద్దవాడి పేరు భీమసేనుడు అని ఉంది. పురాణాలలో ఈ ‘ముని’ కాక , ఇంకా ముగ్గురు ‘ముని’లు ఉన్నారు. ఒకరు ‘వసు’ సంతానం. మరొకరు ‘పురు’ వంశానికి చెందిన ‘కురు’ సంతానం. మరో ‘ముని’ ద్యుతిమంతుడి సంతానం. అయితే నీలమత పురాణంలో యక్షులు , రాక్షసులు ‘ఖస’ తనయులు అని ఉండడంతో ఒక చోట ‘ముని’ తనయులు , మరో చోట ‘ఖస’ తనయులు అని ఉంది కాబట్టి , పురాణానికి పురాణానికి తేడా ఉంది కాబట్టి , ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పడేస్తే నష్టం పురాణాలకు కాదు. భారతీయ వాఙ్మయము కొన్ని వేల సంవత్సరాలు మౌఖికంగా చలామణిలో ఉంది. రాతప్రతులు తయారు చేయడం వచ్చిన తరువాత , పురాణాలు రాతగాళ్ళ రాతపై ఆధారపడింది. అందుకే ప్రాచీన పురాణాలకు పలు విభిన్నమైన ప్రతులు లభిస్తున్నాయి. వాటన్నింటిని పోల్చి పరిష్కరించడం ఒక పెద్ద పని. కాబట్టి *‘నీలమత పురాణం’* లో ఉన్న దాన్ని ఉన్నట్టు చదువుకుని ముందుకు పోవడం మంచిది.
ఐరావతము ఐరావణ అన్న పదాలను సమానార్థాలుగా వాడడం కనిపిస్తోంది. నీలమత పురాణం ప్రకారం ఐరావణ ‘ఇలా’ పుత్రుడు. కాని ‘ఐరావతం’ పురాణాల ప్రకారం ఏనుగు. విష్ణువు నుండి బ్రహ్మ , బ్రహ్మ నుండి కశ్యపుడు , తరువాత భద్రమాత , ఐరావతి , ఐరావతు. ఇదీ ఐరావతం జననం. కశ్యపుడు దక్షుడి కూతురు క్రోధవశను వివాహామాడాడు. ఆమె ద్వారా 10 మంది కూతుర్లను కన్నాడు. వారిలో భద్రమాత ఒఅక్రు. ఆమె కొడుకు ఐరావత. ఇంద్రుడు కశ్యపుడికి అదితి వల్ల జన్మించాడు కాబట్టి ఐరావతాన్ని తన వాహనంగా చేసుకున్నాడు. దుర్వాసుడి శాపం వల్ల దేవతలు ముసలివాళ్లవడం మొదలయ్యింది. సాగర మథనం వల్ల జనించే అమృత సేవనమ్ వారిని యవ్వనవంతులను చేస్తుంది. దుర్వాసుడి శాపానికి కారణమైన ఐరావతం పాలసముద్రంలో మునిగి విష్ణువు నామ జపం చేసింది. దేవతలు రాక్షసుల సహాయంతో సాగర మథనం జరిపినప్పుడు ఐరావతం శాప విమోచనం పొందింది. ఇది ఐరావతం పురాణ గాథ. అయితే నీలమత పురాణంలోని ఐరావణ , ఇతర పురాణాలలోని ఐరావతం ఒకటేనా అన్నది ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది.
కశ్యప ప్రజాపతికి ‘కాలా’కి జన్మించిన వారు కాలకేయులు. కాలకేయులు 60,000 మంది. వీరు వృతాసురుడి నేతృత్వంలో పోరాడుతారు. పురాణ కథనం ప్రకారం కాలకేయులు బ్రాహ్మణులపై పగబట్టి వారిని హింసించడం ప్రారంభించారు. అప్పుడు బ్రాహ్మణులు అగస్త్యుడిని ప్రార్థించారు. అగస్త్యుడికి భయపడిన కాలకేయులు సముద్రంలో దాగారు. అప్పుడు అగస్త్యుడు సముద్రం నీటిని తాగేశాడు. అక్కడ దాగిన కాలకేయులను సంహరించాడు. కొందరు పాతాళానికి పారిపొతారు. మరో సందర్భంలో కాలకేయులు దేవలోకంపైకి దాడి చేసినప్పుడు ఇంద్రుడు అర్జునుడి సహాయం కోరతాడు. ఇది కాలకేయుల కథ.
అప్సరసలు దేవతాస్త్రీలు. వీరు కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. సాగర మథనం సమయంలో అప్సరసలు జన్మించారని పురాణాలలో ఉంది. మరో కథ ప్రకారం కశ్యపుడికి, అరిష్టకు 13 మంది అప్సరసలు జన్మించారు. అలంబస , మిత్రకేశి , తిలోత్తమ , రక్షితా , రంభ , మనోరమా , కేశిని , సుబాహు , సురభా , సురతా , సుసియా. అరిష్ట నలుగురు గంధర్వులకు కూడా జన్మనిచ్చింది. వారు హాహా , హుహు , అవి , బాహు.
అయితే నీలమత పురాణంలోని దశగాయనిలు ‘పుల’కు జన్మించడం గురించి ఇతర పురాణాలలో కనబడదు. ఒకవేళ ‘పుల’ను ‘పులస్త్య’ అనుకుంటే, పులస్త్యుడికి రాక్షసులు , వానరులు , కిన్నెరలు , గంధర్వ్యులు , యక్షులు జన్మించారన్న ‘ఆదిపర్వం’ లోని శ్లోకాన్ని పరిగణనలోకి తీసుకుంటే దశగాయనులు కిన్నెరులుగా భావించవచ్చు. కాని కిన్నెరులు పురుషులు. వారందరూ వీణాధరులు. కాబట్టి ‘దశగాయని’ల గురించి తెలియడం లేదు (తెలిసిన వారెవరైనా తెలియజేస్తే ఆ సమాచారాన్ని ఈ వ్యాఖ్యానంలో పొందుపరిచే వీలుంటుంది).
ఇక్కడి నుండి నీలమత పురాణంలోని అంశాలు అందరికి పరిచయమైనవే ఉంటాయి.
‘దను’కు దానవులు జన్మించారు. క్రోధకు పదిమంది పుత్రికలు కలిగారు. ఒకరిపట్ల ఒకరు మాత్సర్యం వహించారు వినత కద్రువలు. జలం నుంచి జన్మించిన అశ్వం ‘ఉచ్ఛైశ్రవం’ను చూసి వినత అది తెల్లగా ఉందన్నది. కాని కద్రువ నల్లగా ఉందన్నది. ఇద్దరు వాదించుకున్నారు. ఓడిపోయినవారు గెలిచిన వారికి ‘బానిస’ అవ్వాలని నిశ్చయించుకున్నారు. నాగులు తల్లికి సహాయపడ్డారు. దాంతో అశ్వం నల్లగా కనబడింది. వినత కద్రువకు బానిసయ్యింది. కానీ శక్తిమంతుడైన వినత తనయుడు గరుడుడు ఇంద్రుడి నుంచి అమృతం తెచ్చాడు. నాగులను భక్షించే వరం పొందాడు. గరుడుడు నాగులను భక్షిస్తున్న తరుణంలొ వాసుకి జనార్ధనుడి రక్షణ కోరాడు. జనార్ధనుడిని ప్రార్ధించాడు. ప్ర్రసన్నుడైన భగవంతుడు వాసుకికి వరమిచ్చాడు. ఆ వరం నీలమత పురాణానికి నాందీ ప్రస్తావన లాంటిది.
ఇక్కడి నుండి అసలు నీలమత పురాణం ఆరంభమవుతుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళేకన్నా ముందు వాసుకి జనార్ధనుడిని స్తుతించిన శ్లోకాలను స్మరించాల్సి ఉంటుంది. అత్యద్భుతమైన శ్లోకాలు ఇవి.
*నమోస్తు తె దేవవరాప్రమేయ నమోస్తు తె శంఖ గదాసిపాణే।*
*నమోస్తు తె దానవనాశనాయా నమోస్తు తె పద్మజసంస్థుతాయ॥*
*నమోస్తు తె లోకహితె రతాయ నమోస్తు తె వాసవనందనాయ।*
*నమస్తు తె భక్తవరప్రదాయ నమోస్తు తె సత్పథదర్శనాయ॥*
*ఉన్నిద్రనీలనళినధ్రుతిచారూవర్నమ్ సంతృప్తహాటకనిభే వసనే వసానమ్।*
*సద్రత్నచుంబితకిరీటవిరాజమానమ్ దామోదరమ్ సురగురుమ్ ప్రాణతోశ్చిమ నిత్యమ్॥*
*క్షీరోదకన్యార్పితపాదపద్మమ్ హరిమ్ ప్రపన్నోశ్స్యానంధమ్ వరేణ్యమ్।*
*పరమ్ పురణామ్ పరమ్ సనాతనమ్ తమాదిదేవమ్ ప్రణతోస్మి భక్త్యా॥*
*ఫణావళీరత్నాసహస్రార్చిత్ర శేషశ్య భోగే విమలే శయానమ్।*
*తమాదిదేవమ్ పురూవమ్ పురాణమ్ నమామి భక్త్యా పరయా రమేశమ్॥*
*భుమేః సముద్ధారణ బద్ధచిత్తౌ దైత్యేంద్రానర్ఘాత విధానదక్షః।*
*లోకస్య సర్వస్య తు చింతయానః శుభాశుభమ్ రక్ష మమాధ్యదేవ॥*
*ఖగపతిరాతిబీమచండవేగో మమ కులమాశు వినాశాయత్యనంత।*
*కురుమునివరసంస్థుతాధరక్షామ్ పవనబలమ్ వినివారయస్వ సాక్ష్య్రమ్॥*
ఇలా అత్యంత రమణీయమైన రీతిలో స్తుతిస్తాడు వాసుకి భగవంతుడిని. ఆ స్తుతికి ప్రసన్నుడైన భగవంతుడు గరుడుడి నుండి వాసుకికి రక్షణ కల్పిస్తాడు.
*తమాహా భగవాన్దేవో వాసుకిమ్ భయవిహ్వలమ్।*
*సతీదేశోత్ర పుణ్యోదె సరస్యమరభూషితె॥*
*ధర్మిష్టైః సహితొ నాగైర్వసస్వామితవిక్రమ।*
*తస్మిన్ సరసై యె స్థానమ్ కరిష్యాంతి భుజంగమాః॥*
*తస్య తస్యాహిశత్రువై న హానిష్యాంతి జీవితమ్।*
*సతీదేశె కృతస్థానమ్ తిష్టంతమకుతోభయమ్॥*
భయంతో వణుకుతున్న వాసుకికి అభయం ఇచ్చి “నువ్వు నీ ఇతర నాగులతో కలిసి సతీదేవి దేశమైన సతీ సరోవరమనే పవిత్ర నీటి సరస్సులో భయరహితంగా జీవించు. సతీసరోవరంలో ఉన్న నాగులను ఏ శత్రువూ ఏమీ చేయలేడు. నాగులకు రాజుగా నీలుడిని నియమించండి. నీకు శత్రుభయం ఉండదు” అంటాడు.
భగవంతుడి ఆజ్ఞను వాసుకి పాటిస్తాడు. ఎలాంటి భయం లేకుండా సతీసరోవరంలో సుఖంగా నాగులు జీవించడం ప్రారంభిస్తాయి.
సతీసరోవరం జలం ఎంతటి పవిత్రమైనదంటే , దేవతల రాజు ఇంద్రుడు సతీసమేతంగా ఆ సరోవరం ప్రాంతానికి వచ్చి క్రీడిస్తాడు. ఆనందిస్తాడు.
అలా ఇంద్రుడు శచీదేవితో క్రీడిస్తున్న సమయంలొ ‘సంగ్రహి’ అనే దైత్యుల రాజు అక్కడికి వస్తాడు. శచీదేవిని చూసి మోహిస్తాడు. అదుపులేని కాంక్ష వల్ల రేతస్సు పతనం అవుతుంది. అది సతీసరోవరం నీటిలో పడుతుంది. అయితే శచీదేవిని మోహించిన సంగ్రహుడితో ఇంద్రుడు పోరాడుతాడు. సంవత్సరం పాటు జరిగిన పోరాటంలో చివరికి ఇంద్రుడు విజయం సాధిస్తాడు. సంగ్రహుడు మరణిస్తాడు. శచీదేవితో ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు.
సతీసరోవరంలో పడిన సంగ్రహుడి రేతస్సును సరోవరంలోని నాగులు కాపాడుతాయి. కొన్నాళ్లకు పిల్లవాడు పుడతాడు. జలంలో ఉద్భవించడం వల్ల ఆ దైత్యుడి సంతానానికి నాగులు జలోద్భవుడని పేరు పెడతాయి. ఈ సంగ్రహుడి ప్రసక్తి కానీ , జలోద్భవుడి గురించి కానీ ఇతర పురాణాలలో కనబడదు. ఇది కశ్మీరుకే ప్రత్యేకమైన పురాణం.
నాగుల సాంగత్యంలో పెరుగుతాడు జలోద్భవుడు. అతడు ఘోరమైన తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటాడు. జలోద్భవుడు మూడు వరాలు కోరుతాడు. నీటిలో ఉన్నంత కాలం మరణం తన దరిదాపుల్లోకి రాకూడదు , తనకు మాయాశక్తులు ఉండాలి , ఇతరులెవరికీ లేనంత శక్తి తనది కావాలి. భగవంతుడి నుండి వరాలను పొందిన జలోద్భవుడు సతీసరోవరం పరిసర ప్రాంతాలలో ఉన్న మనుషులను తినడం ప్రారంభిస్తాడు. దార్వాభిసార , గాంధార , జుహుందర , శక , ఖాస , తంగణ , మండవ , మద్ర , అంతర్దితి , బహిర్దితి ప్రాంతాల ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు. జలోద్భవుడికి భయపడి ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోతుంటారు. దేశం శూన్యమైపోతుంది.
ఇది చదువుతుంటే ఆలోచనలు పలు భిన్నమైన దిశలలో పరుగిడతాయి. సాధారణంగా పురాణాలలో పలువురు తపస్సులు చేస్తుంటారు. తపస్సు ద్వారా శక్తులు సంపాదిస్తుంటారు. కానీ ఆ శక్తులను తమ స్వార్థం కోసమో , ఇతరులను హింసించడం కోసమో చేసేవారు రాక్షసులు. వారి బారి నుండి ప్రజలను రక్షించేందుకు భగవంతుడు అవతారం ఎత్తడమో , ఎవరో మహాపురుషుడు రావటమో జరుగుతుంది. అంటే , పురాణాలు స్వార్థం రాక్షసం , నిస్వార్థం దైవత్వం అని ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తున్నాయన్న మాట. ఎంత తపస్సు చేసినా అది స్వార్థం కోసమయితే వ్యర్థమే అన్న మాట.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 9*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*తే హన్యమానాః పాపేనా దేశాన్సం ప్రాధ్వన్ భయాత్ ।*
*శూన్యేషు తేషు దేశేషు విచచార స నిర్భయః॥*
దైత్యనాయకుడు సంగ్రహుడి రేతస్సు సతీసరోవరంలో పతనం అయిన తరువాత , సరోవరంలోని నాగులు దాన్ని సంవత్సరం పాటు కాపాడేరు. ఫలితంగా జలోద్భవుడు ఉద్భవించాడు. జలోద్భవుడు జలంలో ఉన్నంత వరకూ మరణం లేదన్న వరం పొంది ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఫలితంగా సరోవర పరిసర ప్రాంతాలే కాదు , దూర దూర ప్రాంతాలన్నీ జన శూన్యం అయిపోయాయి. ఆ శూన్య దేశంలో నిర్భీతిగా , విచ్చలవిడిగా సంచరిస్తూండేవాడు జలోద్భవుడు.
ఇది చదువుతుంటే కశ్మీరు చరిత్రలోని ఒక అంశం స్ఫురణకు వస్తుంది. కశ్మీరు ప్రజలు ఓ వైపు అత్యంత సౌఖ్యం అనుభవించారు. మరో వైపు వెంటనే అత్యంత బీభత్సానికి గురయ్యారు. కశ్మీరు వదిలి పారిపోయారు. శూన్యమైన కశ్మీరు పిశాచాల వశం అయింది. మళ్ళీ కశ్మీరు సంప్రదాయాలను పునరుజ్జీవితం చేయటంతో పిశాచాలు బలహీనమై పారిపోతాయి. మళ్ళీ జనులు వచ్చి కశ్మీరులో చేరుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది. శాంతిగా ఉన్న కాలంలో సకల దేశాలకి అన్ని రంగాలలో మార్గదర్శకంగా ఉంటుంది కశ్మీరు. ఆ తరువాత దేశం మొత్తం ఏకమై కశ్మీరును కాపాడుకుంటుంది. ‘కశ్మీరు’ అన్న పేరు రాకముందు నుంచీ కశ్మీరు చరిత్ర ఇంతే. నీలమత పురాణంతో పాటు కల్హణ విరచిత రాజతరంగిణి చదివితే కశ్మీరు పలుమార్లు నాశనం అవటం కనిపిస్తుంది. సర్వనాశనమైన కశ్మీరు నుంచి మళ్ళీ , బూడిద నుంచి జీవం పోసుకునే ‘పక్షి’లా కశ్మీరు కొత్త రూపు ధరించి పునరుజ్జీవమవటం తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు ‘శ్రీనగర్’గా చలామణీ అవుతున్న ప్రాంతం అసలు శ్రీనగర్ కాదు. ఆ శ్రీనగరం పలుమార్లు ధ్వంసం అయింది. అయినా శ్రీనగరం ఆ శకలాల నుండి తిరిగి తలఎత్తి నిలుస్తూనే ఉంది. తల ఎత్తినప్పుడల్లా ప్రపంచానికి విజ్ఞానపు వెలుగులను పంచుతూనే ఉంది. భారతీయ ధర్మం ప్రకారం వెలుగు విజ్ఞానం. విజ్ఞానం దైవం , చీకటి అజ్ఞానం. అజ్ఞానం రాక్షసత్వం. ప్రస్తుతం కశ్మీరులో మళ్ళీ రాక్షసత్వం రాజ్యం ఏలుతున్నట్లు కనిపిస్తోంది. పిశాచాలు కరాళ నృత్యం చేస్తున్నాయి. వాటిని తరిమి మళ్ళీ కశ్మీరు తల ఎత్తేట్టు చేయడం మన కర్తవ్యం.
కశ్మీరు జలోద్భవుడి అకృత్యాలలో అల్లకల్లోలమవుతున్న సమయంలో అక్కడికి కశ్యపుడు వచ్చాడు.
*ఏతాస్మిన్నేవ కాలే తు కశ్యపో భగవాన్ ఋషిః।*
*తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్॥*
*వర్షేస్మిన్ భారత పుశ్యే శుభాశుభ ఫలప్రదే।*
*పుష్కరం దుష్కరగమం బ్రహ్మలోకప్రదం శివమ్॥*
*ధర్మక్షేత్రం కురుక్షేత్రం నైమిషం పాపనాశనమ్।*
*పిత్రూణామాలయం పుణ్యం హయశీర్షం మహాత్మానమ్॥*
*సర్వపాపహరం దివ్యం తథా చామరుకంటకమ్।*
*వరాహ పర్వతం పుణ్యం పుణ్యం పంచనదం తథా॥*
*కాలాంజనం సగోకర్ణం కేదారం సమహాలయం।*
*నారాయణయస్య చ స్థానం సపుణ్యం బదిరాశ్రమమ్ ॥*
*సుగన్ధాం శతకుంభాం చ కాలికాశ్రమమేవచ।*
*శాకంబరీం నీలాంతికం శాలిగ్రామం పృథుదకమ్॥*
*సంవర్లాక్షం రుద్ర కోటిం ప్రభాసమ్ సాగరోదకమ్।*
*ఇంద్రమార్గం మతంగస్య వాపీం పాపప్రసూదినీమ్॥*
ఇలా దాదాపుగా 15 శ్లోకాలలో కశ్యపుడు దేశమంతా పర్యటించి దర్శించిన పుణ్యతీర్థాల జాబితా , వాటి ప్రాశస్థ్యం పొందుపరిచి ఉన్నాయి.
పుష్కరం , ప్రయాగ , కురుక్షేత్రం , నైమిశం , వరాహ పర్వతం , పంచనంద , కాలంజన , గోకర్ణ , కేదార , మహాలయ , లలితిక , శాలగ్రామ , పృథుదకం , సంవర్లాక్ష , రుద్రకోటి , ప్రభాస , సాగరోదక , ఇంద్రమార్గ , మాతంగ వాపి , అగస్త్యాశ్రమం , తండులికాశ్రమం , జంబూమార్గం , వారణాసి , జమున , శతధ్రు , సరయు , గోదావరి , వైతరణి , గోమతి , బహుద , వేదస్మృతి , అస , వర్ల , తామ్రపర్ణోత్పలావతి , శిప్ర , నర్మదా , గోన , పయోంష్ణీ , ఇక్షుమతి , సరట్టు , దుర్గ , కటశు , కావేరి , బ్రహ్మణి , గౌరి , కంపనాం , తమసాం , గంగాసాగర సంధి , సింధుసాగర సంగమం , భృగుతంగం , విశాలం , కుబ్జామ్రం , రైవతం , కుశావర్తం , బిల్వకం , నీలపర్వతం , కనఖలం వంటి తీర్థాలు , తీర్థస్థానాలు దర్శించి పునీతుడయ్యాడు కశ్యపుడు.
కశ్యపుడు దర్శించిన తీర్థాలు , తీర్థస్థానాల జాబితా చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. దేశం మొత్తాన్ని ఒక్క అంగుళం కూడా వదలకుండా దర్శించాడు కశ్యపుడు. అంటే ఈ దేశం మొత్తం అణువణువునా దైవ భావన , పవిత్ర భావన నర్తనమాడుతున్నదన్న మాట. అందుకే ఇది దైవభూమి అయ్యింది. వేదభూమి అయింది.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. కశ్యపుడు తిరిగిన ప్రదేశాలు ఏ ఒక్క రాజ్యానికో చెందినవి కావు. ఇవి ఎవరి సొత్తు కావు , ఇవి పవిత్ర స్థలాలు. సకల భారతీయులకు పవిత్ర ప్రదేశాలు. వీటికి మతంతో , రాజకీయంతో సంబంధం లేదు. గమనిస్తే , శ్లోకాలలో ఆయా తీర్థాల ప్రాశస్త్యం , అక్కడ కొలువైన దైవం గురించి చెప్పడం తప్ప *‘ఫలానా రాజ్యంలోని ఫలానా తీర్థం’* అంటూ చెప్పడం కనపడదు. కారణం , ఆ కాలంలో ఇప్పటిలా భౌగోళిక సరిహద్దుల భావన లేదు. రాజులెవరెవరో ఉండవచ్చు. రాజ్యాలు ఎన్నో వుండవచ్చు. కానీ ఈ దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఒకటే. ఈ దేశాన్ని పట్టి ఉంచేది ధర్మం. దాన్ని పాలించేది దైవం. అంతే తప్ప ‘ఫలానా రాజు పాలిస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యం నాది కాదు. నా రాజభక్తి నా భౌగోళిక సరిహద్దుల వరకే’ అన్న భావన ఆనాడు లేదు. అది ఆధునిక భావజాల జనిత వికృతి. *‘తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్’.* తీర్థయాత్ర ఉద్దేశంతో ‘సకలాం మహీమ్’ ప్రయాణించాడు. అంతే తప్ప పలు రాజ్యాలు దాటాడు అన్న ఆలోచన ఆనాడు లేదు. ఈనాటి దృష్టితో ఆనాటి కాలాన్ని దర్శించి , మనకు ‘దేశభక్తి’ భావన ‘బ్రిటీష్ వాడి వల్ల వచ్చింది’ అని తీర్మానించడం మూర్ఖత్వం. చీమ దృష్టితో ఏనుగును చూసి తీర్మానాలు చేయటం లాంటిది. భారతీయులకు దేశం , ధర్మం భావనల నడుమ అభేద ప్రతిపత్తి. దేశ భావనకు రాజుతో సంబంధం లేదు. ధర్మ భావనకు రాజుతో సంబంధం లేదు. భక్తి భావనకు ఎవరితో సంబంధం లేదు. సంబంధం అంతా ధర్మంతో , దైవంతో అంతే.
అంటే ధర్మ బావన అనే దారంతో ఈ దేశమనే భావనకు పూలమాలను అర్పించే వీలును కల్పించారన్నమాట. అందుకే రాజ్యాలపై విదేశీ దాడులు జరిగినప్పుడు లేని స్పందన మందిరాలపై , పవిత్ర స్థలాలపై దాడులు జరిగినప్పుడు కనిపిస్తుంది. కారణం ఇక్కడి ప్రజలను ఏకత్రితం చేసేది , వారిలో స్పందనలు కలిగించేది ధార్మిక భావన మాత్రమే. ఇక్కడి కథలో కూడా సతీసరోవరం పరిసర ప్రాంతాలలో జలోద్భవుడు పట్టు బిగించి ప్రజలను తరిమేస్తూంటే , తీర్థయాత్రలకు వచ్చిన కశ్యపుడిని కశ్మీరుకు ఆహ్వానిస్తాడు నీలుడు అనే నాగు.
*పూర్వదేశే త్వయా బ్రహ్మాన్ దాక్షిణే పశ్చిమే తథా।*
*దృష్టాని సర్వతీర్థాని యాస్యమోద్యోత్తరాం దిశమే॥*
నీలుడు కశ్యపుడిని పితృ సమానుడిగా భావించి సేవలు చేస్తాడు. తండ్రి కూర్చునేందుకు అనుమతినిచ్చిన తర్వాత కూర్చుంటాడు. తరువాత వినయంగా తండ్రి ముందు తన మనసులోని మాటను ప్రస్తావిస్తాడు. ‘ధర్మప్రేమికులయిన తమరు తీర్థయాత్రలు చేస్తున్నరని తెలిసింది. తమను సేవించుకోవాలన్న తపనతో మీ దగ్గరకు వచ్చాను. బ్రహ్మ సమానులైన తమరు దేశంలోని తూర్పు , దక్షిణ , పశ్చిమ ప్రాంతాలలోని పుణ్యస్థలాలు , తీర్థాలన్నింటినీ దర్శించారు. ఇక ఉత్తర ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించాల్సి ఉంది’ అని ఉత్తర ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తాడు.
ఇక్కడ గమనించాల్సినదేంటంటే నీలుడు , ‘దేశంలోని తూర్పు , పశ్చిమ , దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు దర్శించారు’ అనటం అంటే ‘నీలమత పురాణం’ నాటికే దేశం అన్న భావన ఉంది. మొత్తం భారతదేశంలోని తూర్పు , పశ్చిమ , దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు సందర్శించాడు. అంటే అప్పటి ‘దేశ’ భావనలో విభిన్న రాజ్యాలన్నీ మిళితమై ఉన్నాయి. రాజ్యం వేరు , దేశం వేరు. రాజ్యం రాజుకు సంబంధించినది. దేశం ధర్మానికి సంబంధించినది. ధర్మం అందరిది. ధర్మానికి ఎల్లలు లేవు. అంటే , ఆనాటి దేశ భావనకు ఎల్లలతో సంబంధం లేదు. ఎల్లలు రాజులకు , రాజ్యాలకు సంబంధించినవి. ఇంత స్పష్టంగా పురాణాలలో దేశ భావన ఉంటే , ఆధునికులు భారతీయులకు దేశమన్న భావన స్వాతంత్ర్యం తరువాత మాత్రమే వచ్చిందని అనడంలో అర్థం ఏమిటి ? వచ్చిన చిక్కు ఏమిటంటే , మనం ఇప్పటి సాంకేతిక పదాల నిర్వచనాన్ని అప్పటి పదాలకు అన్వయించి అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ అప్పటికీ , ఇప్పటికీ నడుమ కొన్ని వేల సంవత్సరాలున్నాయి. ఈనాడు ఒక అయిదారేళ్ళలోకి పదాల అర్థాలు విపరీతంగా మారిపోవటం గమనిస్తున్నామ్. ఒకప్పటి ‘సెల్’ ఇప్పటి ‘సెల్’ కాదు. ఒకప్పటి ‘మౌస్’ ఇప్పటి ‘మౌస్’ కాదు. అలాంటిది కొన్ని వేల సంవత్సరాలలో పదాలు , పదాల అర్థాలలో మార్పులు రావడంలో ఆశ్చర్యం లేదు. అప్పటి పదాల అర్థాలను వివరించడంలో ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి ‘దేశం’ అప్పటి ‘దేశం’ పదాలు ఒకే రకంగా ఉన్నా , అర్థాలలో తేడా ఉందని గ్రహించాలి. కశ్యపుడితో నీలుడు అన్న దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న భూభాగం. దాన్ని పశ్చిమ , తూర్పు , దక్షిణ అన్న ఖండాలుగా సూచించాడు. ఉత్తరం వైపున ఉన్న తీర్థాల గురించి వివరించాడు. ఇక్కడ ఎక్కడా రాజు , రాజ్యం ప్రసక్తి లేదు. ఆ కాలం వారు ఇలాంటి సంకుచిత భావాలను , ఎల్లలను గుర్తించలేదు. ఎల్లలు లేని ధర్మంపైనే వారి దృష్టి. ఆ తరువాత కశ్యపుడితో ‘మాద్ర దేశంలో , హిమాలయాలలో బోలెడన్ని తీర్థప్రదేశాలున్నాయ’ ని చెప్తాడు. దేశం అన్న పదం రెండు మార్లు రెండు విభిన్నమైన అర్థాలలో వాడటం గమనార్హం. ఒక దేశం సమస్త భారతదేశం. మరొకటి మాద్రదేశాన్ని సూచిస్తోంది. కాని మాద్రదేశం అనటంలో వేరు భావన లేదు. భారతదేశమనే మహాదేశంలో మాద్రదేశం ఒక ప్రాంతం మాత్రమే. ఆధునిక గణిత భాషలో చెప్పాలంటే భారతదేశమనే ‘సెట్’ (set) లో మాద్రదేశం ఒక ‘సబ్ సెట్’ (sub-set) లాంటిదన్న మాట. భారతవర్షం , భారత ఖండంలో ఒక దేశం అన్న మాట. ఉత్తర దేశంలోని పుణ్యక్షేత్రాలు కూడా చూడమని అభర్థిస్తూ నీలుడు ఒకటొకటిగా ఉత్తరంలోని పుణ్యక్షేత్రాలను ప్రస్తావిస్తాడు.
శుభప్రదమైన విపాస , పాపాలను కడిగివేసే దేవహృద , స్నానమాచరణతోనే స్వర్గ ప్రాప్తినిచ్చే కరవీరపుర సంగమం (దేవహృద , విపాసలు సంగమించే స్థలం), విపాసలోని కలికాశ్రమం , ఇరావతీ నది (ఈ ఒక్క ఇరావతీ నది వద్దనే 60,000 పుణ్యస్థలాలున్నాయి), ఇంకా కుంభవసుమ్ద , దేవిక నది , విశ్వామిత్ర నది, ఉద్ధనది వంటి పవిత్ర నదులు , ఇంద్రమార్గం , సోమతీర్థం , అంబుజాన , సువర్ణచారు , రుద్రతీర్థ , దుర్గద్వార , కోటితీర్థ , హంసపాద , ఋషిరూప , దేమీతీర్థం , పంచనది, అపాగ , తేశ నది , చంద్రభాగ , , శంఖమార్ణాల , గుహ్యేశ్వర , శతముఖ , ఇష్టకాపథ , వాదందేశ వంటి పవిత్ర స్థలాలు , నదులు ఉన్నాయి. శతముఖ నుండి గుహ్యేశ్వర వరకు ఉన్న పవిత్ర స్థలం , పవిత్రతలో వారణాసి కన్నా మిన్నా. వస్త్రపథ అత్యంత శ్రేష్టమైన పవిత్ర స్థలం. సతి అలోకల తీర్థం సతీసరోవరం. అన్ని పాపాలను హరిస్తుంది విష్ణుపాద సరస్సు. *“కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైన తీర్థస్థలాలను తమరు దర్శించి తీరాల్సిందే. ఈ దర్శనీయ స్థలాలను దర్శించడం వల్ల అక్కడ ఉండే దుష్టుల పాపాలను కూడా మీరు పక్షాళన చేసినట్లవుతుంది”* అని నీలుడు అభ్యర్థించాడు.
ఇవన్నీ వింటుంటే ఒక ఆలోచన వస్తుంది.
ఆ కాలంలో పవిత్ర స్థలాల గురించి ప్రతి ఒక్కరికీ ఎంత బాగా తెలుసో అనిపిస్తుంది. పవిత్ర స్థలాల పేర్లు చెప్పటమే కాదు , వాటి ప్రాశస్త్యం వివరించడంతో పాటు ఏయే తిథి , నక్షత్రాలలో అవి మరింత పవిత్రమో చెప్పటం కనిపిస్తుంది.
అలా నీలుడు ఒకటొకటిగా పవిత్ర స్థలాలను వర్ణించి చెప్తుంటే , కశ్యపుడికి కూడా ఆయా తీర్థాలను దర్శించాలనే ఉత్సాహం కలిగింది. నీలుడితో పాటు ఆయన పవిత్ర స్థలాలను దర్శించేందుకు ప్రయాణమయ్యాడు.
యమున , సరస్వతులను దాటి కురుక్షేత్ర దర్శించాడు. అక్కడి ‘సన్నీతి’ అత్యంత పవిత్రం. ప్రతి అమావాస్య నాడు అన్ని తీర్థాల జలాలు ఈ తీర్థంలో చేరుతాయి. రాహువు వల్ల సూర్యగ్రహణం ఏర్పడిన కాలంలో ఇక్కడ శ్రాద్ధకర్మలు జరిపిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు జరిపిన పుణ్యం వస్తుంది. సన్నితిని దర్శించిన తరువాత చక్రతీర్థ ప్రయాణమయ్యారు. ఈ చక్రతీర్థ ప్రాశస్త్యాన్ని నారదుడు సైతం పొగిడాడు. ఈ చక్రతీర్థ సందర్శనం వల్ల కలిగే పుణ్యం సూర్యగ్రహణం వల్ల కలిగే పుణ్యం కన్నా పదిరెట్లు ఎక్కువ. చక్ర , పృథుదకలను దర్శించిన తర్వాత విష్ణుపాద , అమర పర్వాతలను దర్శించారు. ఆ తరువాత శతధ్రు , గంగానదులను దాటి అర్జునుడి ఆశ్రమం ‘దేవసుందరం’ చేరుకున్నారు. ఆపై విపాసను దాటారు. అప్పుడు కశ్యపుడు మాద్రదేశం శూన్యంగా ఉండడం చూశాడు. ఆశ్చర్యపోయాడు.
*ఉత్తీర్థ చ మహాభాగాం విపాశాం పాపనాశినీమ్।*
*దృష్టవాన్ సకలం దేశం తదా శూన్యం స కశ్యపః॥*
సిరి సంపదలతో , ధన ధాన్యాలతో తులతూగే రమణీయమైన దేశం ఇంత శూన్యంగా ఎందుకు ఉందని నీలుడిని ప్రశ్నిమ్చాడు కశ్యపుడు.
*నీలుడికి కావలసింది ఇదే.*
తీర్థయాత్రలంటే కేవలం పుణ్య సంపాదన మాత్రమే కాదు , పాపుల పాపాలను హరించి వారికి మోక్షం ఇవ్వటం కూడా మహాపురుషుల తీర్థయాత్రలలో మర్మం.
కశ్యపుడికి ఉత్తర దేశంలోని తీర్థస్థలాలను వివరిస్తూ ‘మాద్ర’ దేశం అని నీలుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక మర్మం ఇదే.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 10*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్యపుడు భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దర్శించిన పుణ్యస్థలాలు , నీలుడు కశ్యపుడికి వినిపించిన పుణ్యక్షేత్రాలు చూస్తుంటే *‘అడుగడుగున గుడి ఉంది’* అన్నమాట ఎంత సత్యమో బోధపడుతుంది. అయితే , అడుగడుగునా ఇన్ని పవిత్ర స్థలాలున్న దైవభూమి పిశాచాల మయం అవటం , రాక్షసుల భయాలకి గురవటం ఆలోచించాల్సిన అంశం.
ఇంత పవిత్రమైన ప్రాంతాలు దుష్టుల బారిన పడటం ఎంతో విచారకరమైనదైనా గమనిస్తే , దానికీ ఏదో ఒక కారణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సృష్టితో పోలిస్తే మానవ జీవితకాలం చాలా చిన్నది. లక్షల , కోట్ల సంవత్సరాల లెక్కల ముందు ఒక వంద సంవత్సరాలు సముద్రంలో నీటి చుక్క లాంటివి. కానీ నీటి చుక్క లాంటి జీవితంలో మనిషి లక్షల కోట సంవత్సరాల చరిత్రను ఆవిష్కరించాలి. లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరాలలో దాగి ఉన్న రహస్యాలను గ్రహించాలి. ఇది సాధించాలంటే వంద సంవత్సరాల జీవిత కాలం కూడా సరిగ్గా లేని మనిషి దృష్టి విశాలమవ్వాలి. ఆలోచనలకు అవధి ఉండకూడదు. తన తరువాత కూడా దర్శించగలిగిన దృష్టి ఉన్నవారి తీర్మానాలకు ఉన్న సమగ్రత , తాత్కాలిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే వారికి ఉండదు. ఉదాహరణకు ఎవరో ఏదో పని చేశారనుకుందాం. ఆ పని మంచిది కాదు. *‘దాని ఫలితం చెడుగా ఉంటుంది’* అంటే దానికి ఎవరూ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ చెడు పని చేసిన వాడు సంతోషంగా , సుఖంగా ఉన్నట్టు కనబడుతాడు కాబట్టి. కానీ ఆ పని ఫలితం వెంటనే కనబడకపోవచ్చు. కాని కొన్ని తరాలలో ఆ దుష్ఫలితం అతడు కాకున్నా , అతని వారయినా అనుభవించక తప్పదు అంటుంది కర్మ సిద్ధాంతం. కొన్ని తరాల పాటు వర్తించే కర్మ సిద్ధాంతాన్ని కొన్ని రోజులలో , గంటలలో పరిశీలించి చూసి పనికిరాదని తేల్చడం అజ్ఞానానికి నిదర్శనం , హ్రస్వదృష్టికి తార్కాణం.
జలోద్భవుడు ఉద్భవించిన విధానమే ధర్మవిరుద్ధం. సతీదేవిని చూసి మోహించిన రాక్షసుడి వీర్యం సతీసరోవరంలో పతనమవడం , దాన్ని నాగులు భద్రపరచడం వల్ల ఉద్భవించినవాడు జలోద్భవుడు. పరసతిని మోహించడం , కామించడం , అదుపులేని మోహంతో కూడిన దురాలోచన ఫలితం జలోద్భవుడు. అలాంటి దుష్టపుటాలోచన ఫలితంగా జనించిన వీర్యాన్ని భద్రపరిచి జీవం పోయటం వల్ల ఉద్భవించిన దుష్టుడు జలోద్భవుడు దౌష్ట్యంగా కాక మరో రకంగా ప్రవర్తించడం ఊహ కందని విషయం. అలాంటి దుష్టపుటాలోచన బీజాన్ని భద్రపరిచి జీవం పోసిన కర్మఫలం ఆ ప్రాంతం , అక్కడి నాగులు , అక్కడి ప్రజలు అనుభవించక తప్పదు. కాని ఇదంతా ఒక రోజులో రెండు రోజులో జరిగేది కాదు. అదీగాక ఈ సృష్టిలో ఏ ఫలితానికీ ఏదో ఒకటి కారణం ఉండదు. పలు విభిన్నమైన కారణాల ఫలితం మనకు తెలుస్తుంది. కానీ మన హ్రస్వదృష్టి వల్ల మనం ఒకటో రెండో కారణాలను ఊహిస్తాం. అవీ మెదడుకు అందకపోతే అదీ లేదు. కారణ రహితమైన ప్రపంచం ఇది అని ప్రపంచాన్ని తిట్టిపోస్తాం. అందుకే ఏదైనా ఒక విషయం విశ్లేషించాలంటే ఎంతో అధ్యయనం , విశ్లేషణతో పాటు దార్శనికత అవసరం. వ్యక్తి ద్రష్టలా ఆలోచించడం ఆవశ్యకం.
సతీసరోవరం పరిసర ప్రాంతాలన్నీ జలోద్భవుడి కారణంగా నిర్మానుష్యం అయిపోయాయి. అనేక పవిత్ర స్థలాల సందర్శనంతో పవిత్ర మనస్కుడు , పవిత్ర శరీరి అయిన కశ్యపుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు మంచి చెడుల నడుమ ఘర్షణకు ప్రాతిపదిక ఏర్పడింది. మంచి ఆలోచనకు , దుష్టపుటాలోచనలకు నడుమ ఘర్షణ సందర్భం ఏర్పడింది. ఈ సంఘర్షణను ప్రస్తావించే కన్నా ముందు *‘నీలమత పురాణం’* ప్రస్తావించిన తీర్థ స్థలాలను స్మరించాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’లో ప్రస్తావించిన కొండలు , నదులు , పవిత్ర స్థలాల గురించి ‘వేద్‍కుమారి’ పరిశోధించి *“నీలమత పురాణ – ఎ కల్చరల్ అండ్ లిటరరీ స్టడీ ఆఫ్ కశ్మీర్”* లో అనేక అంశాలను పొందుపరిచింది. ఆ అంశాలను స్పృశిస్తూ , ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే , మన పురాణాలను పుక్కిట పురాణాలుగా కొట్టివేస్తారు. కానీ పరిశీలిస్తే ఆ పురాణాలలో అనేక భౌగోళిక అంశాలు లభిస్తాయి. చారిత్రక ఆధారాలు పొందుపరిచి దొరుకుతాయి.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 11*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*యత్తార్మ్యక్షభీత్యా ప్రాప్తానం నాగానాం గుప్తయేధృవమ్।*
*ప్రసారిత భుజాం పృష్ఠే శైల ప్రావార లీలయాం॥*
*విజేయతే పుణ్యబలెర్చతైర్యత్తు న శస్త్రిణామ్।*
నీలమత పురాణం తెలుసుకోవడంలో అడుగు ముందుకు వేసే ముందు ఒక్క నిమిషం ఆగి నీలమత పురాణంలో ప్రస్తావించిన పుణ్యక్షేత్రాలను ఆధునిక సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు కారణాలు. ఒకటి నీలమత పురాణం ఎప్పటిదయినా అప్పటికే దేశ భౌగోళిక స్థితిగతులు , విభిన్న ప్రాంతాల గురించిన విజ్ఞానం ఆ కాలంలోనే ఉండేదని అర్థం చేసుకునేందుకు. రెండవది ఇప్పటి ‘దేశం’ అన్న భావన అప్పుడు లేకున్నా ప్రజలంతా *‘ఒకటి’, ‘ఇదంతా మనది’* అన్న భావన ఉన్నదని గుర్తించేందుకు. ఈ రెండు కారణాల వల్ల మనం నీలమత పురాణంలో ప్రస్తావించిన స్థలాలు , నదులు , కొండల వంటి వాటిని గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన మాటలను స్మరించుకోవాల్సి ఉంటుంది. నీలమత పురాణం కశ్మీర్ నలువైపులా ఉన్న పర్వతాలను ప్రాకృతికమైన అడ్డుగోడలుగా వర్ణిస్తుంది. శత్రువులు కాశ్మీరంలో అడుగుపెట్టకుండా భగవంతుడు ప్రాకృతికంగా కట్టిన పవిత్రమైన కోటగా భావిస్తుంది. అయితే కల్హణుడి కాలం వచ్చేసరికి తురుష్కులు కశ్మీర్‌లో అడుగుపెట్టారు. కశ్మీర్‌ను రూపాంతరం చెందించడం ప్రారంభించారు. వారి ప్రభావం వల్ల కశ్మీర్ జన జీవితంలో మానసిక వ్యవస్థలో ప్రవేశించిన దిగజారుడుతనం , నైతిక విలువల పతనం , పెరుగుతున్న సంకుచితత్వం , తరుగుతున్న ధార్మికత్వం , ప్రవేశిస్తున్న దౌర్బల్యం , భీరుత్వం వంటి వాటిని ప్రత్యక్షంగా చూశాడు. తురుష్కుల సంపర్కం వలన భారతీయ సమాజం ఎలా చిన్నాభిన్నం అవుతుందో గమనించాడు , అవగాహన చేసుకున్నాడు. అయితే భారతీయ ‘ఆత్మ’ను ఎరిగినవాడు కల్హణుడు.
అందుకే నీలమత పురాణానికి భిన్నంగా కశ్మీరు వైపు శత్రువులు కన్నెత్తి చూడలేరు అనలేదు. *“కాశ్మీరును శత్రువులు భౌతిక బలంతో గెలవవచ్చు కానీ ధార్మికంగా , ఆధ్యాత్మికంగా ఎవరు గెలవలేరు”* అన్నాడు. ఒకసారి ఇప్పుడు కశ్మీర్‌లో జరుగుతున్నది గమనిస్తే కల్హణుడు భారతీయ ఆత్మను ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో స్పష్టం అవుతుంది.
కశ్మీరు తురకల వశం అయింది. అక్కడ పండితుల జీవనం దుర్భరం అయింది. కానీ కశ్మీర్ ప్రజల నడుమ ఉన్న బాంధవ్యం చెదరలేదు. కానీ ఆధునిక రాజకీయాలు అంతర్జాతీయ కుట్రలు కశ్మీర్లో సామాన్యుల నడుమ ఎల్లలు సృజించాయి. సామాన్యులను భీతిభ్రాంతులను చేస్తూ ఆయుధాలు ధరించిన విదేశీ తీవ్రవాదులు తాము ప్రజల స్వరం అయినట్టు ప్రచారం చేసుకున్నారు. పండితులను కశ్మీర్ నుంచి తరిమి వేసి తమ సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కశ్మీర్ ప్రజలకు భారత దేశంతో కలిసి ఉండడం ఇష్టం లేదంటూ ప్రచారం చేశారు. మన *‘మీడియా’* కూడా దాన్నే ప్రచారం చేసింది. భారతీయ సైన్యంపై రాళ్లు రువ్వుతున్న ప్రజలను పదేపదే చూపిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కాశ్మీరు ప్రజల పట్ల ద్వేషం కలిగేట్టు చేసింది. కశ్మీర్ ప్రజలు భారత్‌ను ద్వేషిస్తున్నారు వారిని పట్టి ఉంచడం కుదరదన్న భావనను కలుగ చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దృఢనిశ్చయం ప్రదర్శించిందో , సామాన్యుడికి తీవ్రవాదుల తుపాకుల నుండి రక్షణ కల్పించిందో అప్పుడు తల లోని పేలను ఏరి ఏరి చంపినట్టు తీవ్రవాదుల ఏరివేత జరిగింది. భారతదేశంతో ఆత్మిక సంబంధం అనుబంధం కలిగి మౌనంగా ఉన్న సామాన్య పౌరుల సహాయం లేకపోతే ఈనాడు *‘బారాముల్లా’* తీవ్రవాద రహితం అయ్యేది కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు కశ్మీర్‌లో శాంతి నెలకొనే వీలుంది. మళ్లీ పండితులు కశ్మీర్‌లో ప్రశాంత జీవనం సాగించే వీలు కలుగుతుంది. ఇది భారతీయ ఆత్మ స్వరూపం. తుఫాను వచ్చినప్పుడు క్రుంగదు , వంగుతుంది. తర్వాత మళ్ళీ తలెత్తుతుంది. కల్హణుడు చెపుతున్నది ఇదే. భౌతిక బలంతో తాత్కాలికంగా కశ్మీరును అణచవచ్చు కాని ఆధ్యాత్మిక బలంతో కశ్మీర్ తిరిగి తల ఎత్తుకొని నిలబడుతుంది. తుపాకి నీడ తొలగితే అసలు ప్రజల స్వరం వినిపిస్తుంది.
ఇది కాశ్మీర్‌కే కాదు , సమస్త భారతదేశానికి ఈ దేశానికి ఆత్మ అయిన భారతీయ ధర్మానికి వర్తిస్తుంది. ఇది ఒక సజీవనది. బండ రాళ్ళు అడ్డు వచ్చినప్పుడు వాటిని కోయలేనప్పుడు వంగి పక్కనుంచి ప్రవహిస్తుంది , కానీ దాన్ని కోస్తూ పోతుంది. కొన్నాళ్ళకి బండరాయి కరిగిపోతుంది. నీరు ప్రవహిస్తూనే ఉంటుంది!
నీల మత పురాణం *‘బాహిరిగిరి’ ‘అంతర గిరి’* అన్న రెండు హిమాలయ శ్రేణులను ప్రస్తావిస్తుంది. వీటిని లెస్సర్ హిమాలయాస్ , గ్రేటర్ సెంటర్ హిమాలయాస్ అని ప్రస్తుతం అంటున్నాము. ‘పాలి’ సాహిత్యంలో వీటిని ‘చుల్లా హిమవంత్’, ‘మహా హిమవంత్’ అంటారు. నీలమత పురాణంలో ‘ద్వార్వా’ దేశంలోని ‘ఉశీరక్’ పర్వతం ప్రస్తావన ఉంటుంది. దీన్ని కశ్మీరు దక్షిణాన ఉన్న ‘శివాలిక్’ పర్వత శ్రేణులలో ఒకటిగా భావిస్తున్నారు ఇప్పటికీ దీన్ని ‘ఉశీరగిరి’ అంటారు. పీర్ పంచాల్ పర్వత శ్రేణులని నీలమత పురాణం ‘బ్రహ్మ విష్ణు మహేశ్వర’గా ప్రస్తావిస్తుంది. వీటిల్లో పశ్చిమాన ఉన్న అత్యున్నత శ్రేణి ‘నౌబంధన’ అంటుంది. సకల జీవుల జీవం ఉన్న పడవను విష్ణువు ఈ పర్వతానికే బంధించాడని నమ్మకం.
నీల మత పురాణంలోని ‘హరముక్త్’ పర్వతం ప్రస్తుతం ‘హారముఖ్’ పర్వతం. ఉత్తర మానస సరస్సు , నంది క్షేత్ర , భూతేశ్వర తీర్థాలు ఈ పర్వతానికి ఈశాన్యంలో ఉన్నాయి. ‘మందకోల్- కాళోదర్’ సరస్సులకు నీరందించే హిమానీనదం , నంది పర్వతం , నంది క్షేత్రానికి వెళ్లే వారు దారిలో దర్శించే పర్వతం ‘భరతగిరి’, అమర్నాథ్ పర్వతంపై ఉన్న తీర్థం ‘అమరేశ్వర’. సింధూ లోయకు తూర్పు హిమాలయ శ్రేణుల నడుమ ఉన్న పర్వతం మహాదేవగిరి. నీలమత పురాణంలో ప్రస్తావించిన ఇంద్రకీల , గౌరీ శిఖరాలు , వాటిపై ఉన్న దుర్గ గుడి ప్రస్తుతం శారదాపీఠంకు దగ్గరగా ఉన్న పర్వతాలుగా భావిస్తున్నారు.
నీలమత పురాణంలో కశ్మీర్‌కు చెందిన 60 నదుల ప్రస్తావన ఉంది. ఇక పవిత్ర స్థలాలకు కొదువే లేదు. నీలమత పురాణంలో ప్రస్తావించిన పవిత్ర స్థలాలు వాటి ప్రస్తుత నామాలు కొన్ని.
సింధూ లోయ నుంచి శ్రీనగర్‌కు వెళ్లే దారిలో ఉన్న ‘విచార్ నాగ’ గ్రామం , నీలమత పురాణంలోని ‘ఇలాపత్ర నాగ’. ఇప్పటి ‘అచ్‌చల్’ అప్పటి ‘అక్షిపాల నాగ’. ఇప్పటి ఇస్లామాబాద్ అప్పటి ‘తంత్ నాగ’. ఇప్పటి ‘బీరు’ అప్పటి ‘బహురూప’. ఇప్పటి ‘బుదాబ్రార్’ అప్పటి ‘భేదాదేవి’. గంగోద్భేద తీర్థం ఉన్నది ఇక్కడే. ‘సావాధర్ ధూర్’ అప్పటి చక్రధర తీర్థం. ఇప్పటి ‘చందుల్ సార్’ అప్పటి ‘చంద్రసార’. ఇప్పటి ‘గణేశ బల్’ అప్పటి గణేశ తీర్థం. ఇప్పటి ‘వాగ హోమ్’ అప్పటి ‘హస్తికర్ణ నాగ’. ఇప్పటి ‘రామార దాన్’ అప్పటి ‘ఇష్టికా పథ్’. ఇప్పటి ‘కోథేర్’ గ్రామం అప్పటి ‘కపాలేశ్వర’. బారాముల్లా దగ్గరి ‘కోటీసర్’ అప్పటి ‘కోటి తీర్థం’. త్రాల్ లోయలోని ‘నారాస్తాన్’ అప్పటి ‘నారాయణ స్థానం’. ఇప్పటి ‘పంజా’ అప్పటి ‘పంచ హస్త’. ఇప్పటి ‘పాన్ చక్’ అప్పటి ‘పాండవ తీర్థం’. ఇప్పటి ‘రామూష్’ అప్పటి ‘రామతీర్థం’. ఇప్పటి ‘సూయమ్’ అప్పటి ‘స్వయం భూ’. ఇప్పటి ‘సుందర్ బాల్’ అప్పటి ‘సోదర నాగ’. ఇప్పటి ‘త్రిఫర్’ అప్పటి ‘తిప్రదేశ’. ఇప్పటి ‘విజబ్రూర్’ అప్పటి ‘విజయేశ్వర’.
ఈ రకంగా నీలమత పురాణంలో ప్రస్తావించిన పేర్లను ఇప్పటి స్థలాలుగా గుర్తించడం కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని నిరూపించడమే కాదు , కాశ్మీర్ భారతదేశంలో ప్రత్యేకంగా లేదని , దేశంలోని ఇతర భాగాలతో ధార్మికంగా , రాజకీయంగా , సాంస్కృతికంగా కలిసి ఉందని స్పష్టం అవుతోంది. కాశ్మీరు రాజులు ఇతర ప్రాంతాలపై రాజ్యం చేయడం , కశ్మీర్ కు సరైన రాజు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి రాజులను తీసుకువచ్చి కాశ్మీరు పాలనా బాధ్యతలను అప్పగించడం *‘రాజతరంగిణి’* ద్వారా తెలుస్తుంది. కాబట్టి కశ్మీరు చరిత్రను తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే.
నీలమత పురాణంలో కశ్మీరును కీలకమైన ఘట్టంలో విడిచి మనం పుణ్య స్థలాలను పర్యటించి కశ్మీర్ విహంగవీక్షణం చేశాం. ఇప్పుడు పిశాచాలతో సతమతమవుతున్న కాశ్మీరుకు నీలుడు ఆహ్వానించగా వచ్చిన కశ్యపుడి దగ్గరకు వెళ్దాం. ముందుకు సాగుదాం.
[8/10, 9:27 PM] Murali: *_నీలమత పురాణం – 12_*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*కర్తవ్యోత్ర ప్రతీకారో మయా తీర్థ సమాప్తితః।*
*తీర్థయాత్రామ్ సమాప్తైవ శీఘ్రమేతత్కరో మి తే॥*
నీలుడు కశ్యపుడికి కశ్మీర్ దుస్థితిని వివరించాడు. తాను సంగ్రాముడి పుత్రుడు జలోద్భవుడిని పెంచి పెద్ద చేయడం చెప్పాడు. బ్రహ్మదేవుడి వరాలతో జలోద్భవుడు ఉన్మత్తుడై , అంధుడై ప్రజలను పీక్కు తినడం వివరించాడు. దార్వాభిసార , గాంధార , జుహుందర , అంతరగిరి, బహిర్గిరి వంటి ప్రాంతాలు నిర్మానుష్యమైన విషయం వివరించాడు. విశ్వకళ్యాణం కోసం జలోద్భవుడిని అరికట్టమని ప్రార్థించాడు.
అది విన్న కశ్యపుడు ‘అలాగే’ అన్నాడు. తీర్థయాత్ర ముగించుకున్నాడు. పరిసర ప్రాంతాలలో ఉన్న తీర్థాలన్నింటిలోనూ స్నానం చేశాడు. సతీ సరోవరం చేరాడు. పవిత్ర జలంలో పరిశుద్ధుడయ్యాడు. సతీ సరోవరంలో స్నానం చేసిన తరువాత స్వశక్తితో బ్రహ్మలోకం చేరుకున్నాడు. తనతో పాటు నీలుడిని కూడా తీసుకువెళ్ళాడు.
బ్రహ్మలోకంలో వాసుదేవుడు , ఈశ్వరుడు , అనంతుడు వంటి దేవతలంతా ఆ సమయాన ఉన్నారు. బ్రహ్మతో పాటు అక్కడ ఉన్న దేవతలందరినీ గౌరవించాడు కశ్యపుడు. వారందరికీ జలోద్భవుడి క్రూర చర్యలను , పాశవిక ప్రవృత్తిని గురించి వివరించాడు.
అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలందరి వైపు చూసి *“మనందరం సౌబంధనకు వెళ్ళాలి. హరి జలోద్భవుడిని సంహరిస్తాడు”* అన్నాడు.
ఆ మాట వింటూనే హరి తన వాహనాన్ని అధిరోహించాడు. హరుడు నంది వైపు వెళ్ళాడు. బ్రహ్మ హంసను పిలిచాడు. నీలుడు మేఘం ఎక్కాడు. కశ్యపుడు తన అతీంద్రియ శక్తితో ప్రయాణమయ్యాడు.
ఇది విన్న ఇంద్రుడు తనతో ఉన్న దేవతలతో సహా ప్రయాణమయ్యాడు. యముడు , అగ్ని , వరుణుడు , వాయువు , కుబేరుడు , నిరుత్తి, ఆదిత్యులు , వసువులు , రుద్రులు , విశ్వదేవులు , మరుత్తులు , అశ్వినులు , భృగులు , సాధ్య , అంగీరసుడు పుత్రులు , మునులు , యోగులు , గంధర్వులు , అప్సరసలు , దేవతల పత్నులు , దేవతల తల్లులు , విద్యాధరులు , యక్షులు బయలుదేరారు. సముద్రాలు , నదులు అన్ని అక్కడికి ప్రయాణమయ్యాయి.
గంగ మొసలిపై , యమున తాబేలుపై , శతద్రు ఎద్దుపై , సరస్వతి గేదెపై ప్రయాణమయ్యారు. వివిశ గుర్రంపై , ఇరావతి ఏనుగుపై , చంద్రభాగ సింధులు పులిపై సవారీ చేస్తూ వెళ్లారు. దేవిక అడవిదున్న పైన , సరయు లేడి పైన వెళ్ళగా , మందాకిని మహిషిని , పాయోగ్ని మేకను వాహనం చేసుకున్నాయి.
నర్మద నెమలిని , గోమతి హరిణాన్ని , గోదావరి గొర్రెను , కంపన హంసను వాహనం చేసుకున్నాయి. గండకి కొంగను , కావేరి ఒంటెను , సుమతి మొసలిని , పవిత్ర సీత హంసను వాహనంగా చేసుకున్నాయి. లౌషిత్య కొమ్ములున్న లేడిని , వంక్షు వేగంగా పరిగెత్తే పందిని , హ్లాదిని గోరింకను , హాదిని కోడిని , పావని గుర్రాన్ని, సోనా పామును , కృష్ణవేణి మేఘాన్ని , భువన హరిణాన్ని వాహనం చేసుకున్నాయి. ఇవి కాక ఇతర నదులు తమ తమ వాహనాలను అధిరోహించి బయలుదేరాయి.
జలోద్భవుడితో దేవతలకు జరిగే యుద్ధాన్ని దర్శించేందుకు అందరూ ఉత్సాహంతో బయలుదేరారు.
దేవతలంతా సౌబంధన చేరారు.
సంరంభంగా దేవతలంతా రావడం జలోద్భవుడు చూశాడు.
జలోద్భవుడికి తెలుసు – దేవతలు ఎంతమంది ఎన్ని రకాల ఆయుధాలతో వచ్చినా నీటిలో ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని. అందుకే సతీ సరోవరం నీటి అడుగుకు చేరాడు. బయటకు రాలేదు.
రుద్రుడు హరి సౌబంధన శిఖరం చేరారు.
దేవతలు అసురులు వారిని అనుసరించారు.
అప్పుడు జలోద్భవుడిని సంహరించే ఉద్దేశంతో జనార్దనుడు అనంతుడితో *“వాడు నీటిలో ఉన్నంతవరకు వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. సతీ సరోవరం నీరు బయటకు వెడలేట్టు చేయాలి. హిమాలయాలను ఛేదించు. దాంతో నీరు బయటకు పారుతుంది. నీటి రక్షణ పోవడంతో జలోద్భవుడు బలహీనుడు అవుతాడు. వాడిని సంహరించవచ్చు”* అని అన్నాడు. అతని మాటలు వింటూనే అనంతుడు – స్వయంగా పర్వతమంతటివాడు , వెన్నెల వన్నె కలవాడు – తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు.
( To be continued........................)
0 comments:
Post a Comment