*నరక వధకు సత్యభామ ఎందుకు వెళ్ళింది?*
శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు ఎలా వచ్చారు? నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకుడితో యుద్ధం చేయబోతూ సత్యభామను ఎందుకు తీసుకువెళ్ళాడు? ఇటువంటి ప్రశ్నలకు ఆంధ్రవ్యాసులవారు ఆంధ్రీకరించిన విష్ణుపురాణంలో సమాధానాలు ఉన్నాయి. నేటి దీపావళినాడు వాటిని తెలుసుకుందాం.
ఒకరోజు స్వర్గం నుంచీ ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడా సమయంలో. ముందుగా శ్రీకృష్ణుని పూజించిన ఇంద్రుడు తాను వచ్చిన కారణం చెప్పాడు. ప్రాగ్జోతిషపురంలో నరకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు భూమి పుత్రుడు. ఈ రాక్షసుడు సృష్టిలోని అన్ని ప్రాణులకూ నాశనం కలిగిస్తున్నాడు. దేవసామ్రాజ్యాలు, సిద్ధ అసుర నర రాజ్యాలు కొల్లగొడుతున్నాడు. ఆ రాజ్యాలలోని మణులను కన్యామణులను కొల్లగొడుతున్నాడు. తన అంతఃపురంలో వారిని బంధీలుగా చేశాడు. వరుణునికి ఉన్న వర్షం స్రవించే గొడుగు (జలస్రావి) అపహరించాడు. మణి పర్వతం కాజేశాడు. మా అమ్మ అదితి కుండలాల నుంచీ అమృతం జనిస్తుంటుంది. వాటిని కాజేశాడు. ఇప్పుడు ఐరావతం కావాలంటున్నాడు. ఇవ్వకపోతే నా మీద కూడా యుద్ధం చేసి స్వర్గంతో సహా దాన్ని కూడా లాక్కుంటాడు. కనుక వాడు చేస్తున్న పనులన్నీ నీకు చెబుతున్నాను. నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకుని అది చెయ్యి అన్నాడు.
ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఇంద్రుడు చెప్పిన చిట్టచివరి వాక్యం. నరకుడు చేస్తున్న అకృత్యాలు అన్నీ చెప్పాడు. కానీ వాడిని చంపేయి అని మాత్రం కొరలేదు. ఎందుకంటే నరకుడు భూమి పుత్రుడు. భూమి విష్ణుపత్ని, కనుక సొంత కుమారుడిని చంపమని ఎలా కోరతాడు? కనుక ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెయ్యి అన్ని మాత్రమే అన్నాడు.
శ్రీకృష్ణుడు ఇది వినడం ఏమిటి? గరుత్మంతుడిని తలచుకొన్నాడు. బొల్లిగెద్ద వచ్చేసింది. వెళుతూ వెళుతూ సత్యభామ మందిరం మీదుగా వెళుతూ ఆమెను కూడా గరుడవాహనం మీద తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. సత్యభామను ఎందుకు తీసుకువెళ్ళాడు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీనికి సమాధానాలు రెండు. మొదటిదానికి కారణం నారదుడు. నారదుడు రుక్మిణీ మందిరంలో కృష్ణుడు ఉండగా పారిజాతం ఇవ్వడం అది రుక్మిణికి ఆయన ఇవ్వడం అది చూసి సత్యభామ అలగడం చూసి నీకు ఏకంగా స్వర్గంలో ఉన్న పారిజాత చెట్టే ఇస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంద్రుడే స్వయంగా సాయం కోసం వచ్చాడు కనుక ఈమెను కూడా తీసుకువెళ్ళాడని హరివంశం చెబుతోంది. అలాగే భూదేవి అంశే సత్యభామ. భూదేవి పుత్రుడిని ఆమె అనుమతితోనే సంహరిస్తానని విష్ణువు ఆమెకు వరం ఇస్తాడు. కనుక సత్యభామను తీసుకొని వెళతాడు.
చాలామంది శ్రీకృష్ణుడు రథం మీద వెళ్ళాడు అని అంటారు. కానీ ఆయన గరుడవాహనం మీద ఎగురుకుంటూ వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడో విష్ణుపురాణం చెబుతుంది. నరకుడి రాజధాని ప్రాగ్జోతిషపురం చుట్టూ వెయ్యి కిలోమీటర్ల మేర నేడు మందుపాతర్లు పెట్టినట్లు ఆనాడు వాడి కత్తులగొలుసులతో కంచెలు పాతాడు. కనుక కృష్ణుడు ఆకాశమార్గంలో యుద్ధానికి వెళ్ళి ముందుగా ఆ గొలుసు కంచెలు నరికాడు. తరువాత నరకునీ చక్రాయుధంతో చంపేశాడు.
కుమారుడు చనిపోయే సరికి అదితి కుండలాలు భూదేవి తెచ్చి ఇచ్చి శ్రీకృష్ణుని స్తుతించింది.
*పృథివీ కృతకృష్ణస్తుతి:*
యదాహముద్ధృతా నాథ త్వయా సూకరమూర్తినా!
త్వత్స్పర్శసంభవః పుత్రస్తదాయం మయ్యజాయత!!
త్వత్స్పర్శసంభవః పుత్రస్తదాయం మయ్యజాయత!!
సో2యం త్వయైవ దత్తో మే త్వయైవ వినిపాతితః!
గృహాణ కుణ్డలే చేమే పాలయాస్య చ సంతతిమ్!!
గృహాణ కుణ్డలే చేమే పాలయాస్య చ సంతతిమ్!!
భారావతరణార్థాయ మమైవ భగవానిమమ్!
అంశేన లోకమాయాతః ప్రసాదసుముఖః ప్రభో!!
అంశేన లోకమాయాతః ప్రసాదసుముఖః ప్రభో!!
త్వం కర్తా చ వికర్తా చ సంహర్తా ప్రభవో2ప్యయః!
జగతాం త్వం జగద్రూపస్త్సూయతే2చ్చుత కిం తవ!!
జగతాం త్వం జగద్రూపస్త్సూయతే2చ్చుత కిం తవ!!
వ్యాపీ వ్యాప్యం క్రియా కర్తా కార్యం చ భగవాన్ యథా!
సర్వభూతాత్మ భూతస్య స్తూయతే తవ కిం తధా!!
సర్వభూతాత్మ భూతస్య స్తూయతే తవ కిం తధా!!
పరమాత్మా చ భూతాత్మా త్వమాత్మా చాప్యయో భవాన్!
యథా తథా స్తుతిర్నాథ కిమర్థం తే ప్రవర్తతే!!
యథా తథా స్తుతిర్నాథ కిమర్థం తే ప్రవర్తతే!!
ప్రసీద సర్వ భూతాత్మన్నరకేణ తు యత్కృతమ్!
తత్క్షమ్యాతామదోషాయ త్వత్సుతస్త్వన్నిపాతితః!!
తత్క్షమ్యాతామదోషాయ త్వత్సుతస్త్వన్నిపాతితః!!
దీని తరువాత శ్రీకృష్ణుడు నరకుడు పోగేసిన మణులు, 16,100 మంది కన్యామణులు చూశాడు. నాలుగు దంతాలు ఉండే ఏనుగులు ఆరువేలు, కాంభోజాశ్వాలు 21 లక్షలూ చూశాడు. రాజ్యం గెలుచుకున్న తనకే అవన్నీ చెందుతాయి కనుక ద్వారకకు తీసుకువెళ్ళాడు. ఆవిధంగా 16,100 మందీ శ్రీకృష్ణుని భార్యలు అయ్యారు.
ఇంద్రుడి తల్లి అదితి కుండలాలు తన దగ్గర ఉన్నాయి కనుక ఆమెకు ఇవ్వడం కోసం స్వర్గం వెళ్ళాడు, సత్యభామతో సహా. సరే అక్కడ నుంచీ అందరికీ తెలిసిందే పారజాతాపహరణం జరిగింది.
ఇదీ అసలు సంగతి నరకుని వధలో సత్యభామ ఎందుకు వెళ్లింది అనేదానికి సమాధానం. ఇది అష్టాదశ మహాపురాణాల్లో ఒకటైన విష్ణుమహాపురాణంలో ఐదవ అంశంలో 29 వ అధ్యాయం
0 comments:
Post a Comment