Pages

Things to do on Naraka chaturdasi n Deepavali

దీపావళి అనగానే మనకి అందరికి టపాసులు, పిండివంటలు, స్వీట్లు గుర్తుకు వస్తాయి .  ఇక్కడ ఈ క్రింద చెప్పిన విధం గా మన ఆచార సంప్రదాయాలు కూడా మనం తెలుసుకుంటే ఎంతో ఉపయోగం గా ఉంటుంది అని ఇక్కడ ఆ విషయాలు పొందు పరచటం జరిగింది.  మీరు అందరూ ఇవి అన్నీ పూర్తిగా పాటించ లేక పోయినా పరవాలేదు.  కనీసం ఆ నామాలు పద్యాలు చదివినా సరిపోతుంది .  భక్తి తో భగవంతుని ముందు దీపం వెలిగించడం ముఖ్యం .


మీ అందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు.


🔥 *నరక చతుర్దశి నాడు ఏమి చేయాలి
దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను  ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.
నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.

1. యమాయ నమః 2. మృత్యువేనమః 3. వైవస్వతాయనమః 4. సర్వభూతక్షయా నమః 5. బధ్ధ్నాయనమః                 6. పరమేష్టినే నమః 7. చిత్రాయ నమః 8. ధర్మరాజాయ నమః 9. అంతకాయ నమః 10. కాలాయ నమః  11. ఔదుంబరాయ నమః 12. నీలాయ నమః 13. వృకోదరాయ నమః 14. చిత్రగుప్తాయతే నమః -  అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

యమ నామములనుచ్చరించుచూ మూడు మూడు దోసీళ్ళ నీళ్ళు తర్పణమివ్వవలెను.

 *దీపావళి రోజు ఆయుర్వృద్ధి కోసం యమ తర్పణం*
“చతుర్దశ్యాం తు యే దీపాన్‌, నరకాయ దదాతి చ |
తేషాం పితృగణా స్సర్వే నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||

శ్లో|| యమాయ ధర్మరాజాయ మృత్యవే చాన్తకాయచ౹
 వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ౹౹

ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే౹
 వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః౹౹.


అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు చెబుతారు
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online