Pages

kaartheeka puraanam - 7th chapter

 *కార్తిక పురాణం - 7వ అధ్యాయము*

*శివకేశవార్చనా విధులు

వశిష్టులు వారు జనకున కింకనూ యిటుల బోధించిరి "రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును. తులసీదళములతోగాని, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజి౦చిన యెడల వారికీ కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును.

సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమాదులు, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమకింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు.

అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలోచచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
 నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి సప్తమ అధ్యాయము - సప్తమదిన పారాయణము సమాప్తము.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online