Pages

Ekadasi vrat King Ambarish - Maharshi Durwasa's story - part 2

 వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా యివన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో వుంది అన్నిటిన్ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను.నాకు అది ఒక లక్షణము’ అన్నాడు.
నీవు వానిపట్ల చేసిన టప్పుడు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇపుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అదీ ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రదారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు.



అంతటి మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొనినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్నా దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శన చక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.


దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేక పోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసో మహర్షి వెళ్ళబోయాడు. అపుడు అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. అపుడు దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు.


 కాబట్టి క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో మనం గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో యెంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉంది అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.


ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించాడు.
 .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online