Pages

శ్రీమద్ భాగవతం చదువుకుందాం ....భగవంతుని కృప కు పాత్రులు అవుదాం

 [10/9, 8:33 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 చంద్రుని కిరణములవలె కోనేరు స్వచ్ఛమై ఉండెను. (జీవుడు గర్భస్థుడగు మార్గము చంద్రగతి అని వేదములు చెప్పుచున్నవి. చంద్రుడు గర్భధారణమునకు అధిపతి అని పితృమేధ మంత్రములు చెప్పుచున్నవి. చంద్రుడు మాతృకారకుడని జ్యోతిశ్శాస్ర్తము చెప్పుచున్నది.) 


విష్ణుని కథవలె ఆ కోనేటి జలములు సకల కల్మష హరములు. (విష్ణుభక్తి ప్రపూర్ణములైన జీవిత సన్నివేశములే జీవులకు పాపహరములు.) అగ్నిహోత్రముల వలె అందలి జలములు లోకములను పవిత్రము చేయును‌. (దక్షిణాగ్ని లేక దాంపత్యము అనబడు ధర్మబద్ధమైన కామము నరజన్మమును పవిత్రము చేయును.) 


అట్టి జలములచే నిండిన కోనేరు వారికి కనుపించెను. అట్టి సరోవరమున ఒక దివ్య పురుషుడు వారికి దర్శనమిచ్చెను‌ (అతడే జీవుని రూపము ధరించుటకు దిగి వచ్చుచున్న పరమేశ్వరుడైన రుద్రమూర్తి.) నలుదిక్కుల నుండి మనోహరమైన నాదము‌ వినిపించుచుండెను. అందు మృదంగ ధ్వనులు, వేణుగానములు దివ్యములై మనస్సును రంజింపజేయుచున్నవి. (దివ్యతత్త్వమే నాదమార్గమున మనస్సుగా దిగివచ్చుచున్నది.) ఎవ్వరో గంధర్వలు గానము చేయుచున్నారు. దానిని వినుచు ఆనంద పులకితుడై, ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుచు ఆ దివ్యపురుషుడు కుతూహలముతో కోనేటి నుండి యీవలకు వచ్చెను. 


ఆ దేవలోక శ్రేష్ఠుడు కరగించి పోసిన బంగారు రంగు గలవాడు. అతని చుట్టును సనకాది యోగి జనులు స్తోత్రగానములు చేయుచున్నారు. భక్తులకు అనుకూలముగా ప్రవర్తించు స్వభావము గల ప్రసన్న ముఖముతో ఐశ్వర్యములు వెదజల్లుచున్న ఆ త్రిలోచన మూర్తి యొక్క దర్శనమే సకల పాపహరము అనిపించెను. ప్రచేతసులకు రుద్రుడు ఈ విధముగా దర్శనమిచ్చెను......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 691,692,692,693,694,695. (For more Information about Master EK Lectures please visit www.masterek.org)

[10/9, 8:34 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఇట్లు పలుకుచున్న జనార్దనుడు జనుల పురుషార్థములకు నిజమైన ఆధారమని దర్శించి, ఆ దర్శనము వలన ప్రచేతసులు రజస్తమోగుణములు రహితము చేసిరి. 


(ధర్మము ఆచరించినను నారాయణుని స్వరూపముగా తెలిసి ఆచరింపవలెను. ధనమును ఆర్జించి వినియోగించుట కూడా అట్లే చేయవలెను. దేహాది పోషణమునకై ఇంద్రియ సుఖములను గూడ అంతర్యామిగనే గుర్తించి అనుభవింపవలెను. ఈ పురుషార్థములకు వానిలో ఉన్న అంతర్యామి గాక మరియొక ఆధారమెట్లు కలుగును? ఈ సత్యమును తెలిసికొను సాధన చేయుటకు కూడా ఇంద్రియములే కావలెను. జీవితమును జనార్దనునిగా దర్శించు సాధనకు ఇంద్రియములే ఆధారము. ఇంద్రియములను మూసి ధ్యానము చేసి‌ లోపల జనార్దనుని దర్శింప యత్నించువాడు మరల బాహ్యప్రపంచమున‌ కన్నులు తెరచినంతనే లోకమంతయు దైవేతరమైన మాయగా గుణములతో విజృంభించి బంధించును. కనుక రజస్తమో గుణములు మరల, మరల జీవియందు  విజృంభించుచుండును. ఈ ఆపద నుండి తప్పించుటకు ఇంద్రియముల మార్గముననే బాహ్యప్రపంచమును నారాయణుడుగా ఉపాసింపవలెను. అప్పుడే ప్రచేతసులు రజస్తమో‌ గుణములను ధ్వంసము చేయుదురు. ఈ పవిత్ర యజ్ఞము కొరకే వారి ఇంద్రియములుగా పనిచేయవలసి వచ్చినది. భాగవతునకు ఇంద్రియములును, మనస్సు జీవులను ఉద్ధరించుటకేగాని బంధించుటకు గాదు.) 


ప్రచేతసులు చేతులు జోడించి గద్గద కంఠముతో భక్తిపరవశులై ఇట్లనిరి: స్వామీ నీవు అందరికిని శరణ్యము. నిన్ను గూర్చి ఇట్టి వాడవని గణించుట వెర్రి. ఈ సమస్తము నీది అనబడు లక్ష్మీదేవియే గదా? నీవు లక్ష్మీపతివి. కనుకనే ఈ సమస్తమునందు దేనిచేతను జయింపబడవు. నీవు గుణములచే కట్టుపడక గుణములకు అధిపతిగా ప్రకాశించుచున్నావు. కనుకనే సద్గుణములు నీ సంపద.‌ నీ ప్రవర్తనము నందు ఎవ్వరును లోపములు ఎన్నలేరు. (లోపములు ఎన్నువాని యందు పుట్టును. నిన్ను స్మరించినచో లోపములు ఎక్కడ? కనుక నీవు పవిత్రుడవు. నీలో పొరపాటు ఉండదు. నీ నుండి జీవి పొరపడవచ్చును). 


నీవు పరమేశ్వరుడవై సంసారబంధ విమోచనము చేయుచున్నావు. (ఇంద్రియాదులలో దేనిని చూచినను భవబంధము కలుగును. దాని యందు నిన్ను చూచినప్పుడు బంధ విమోచనము అగును)........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 916,917 (For more Information about Master EK Lectures please visit www.masterek.org),

[10/9, 8:34 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఈ మారిషను వృక్షజాతిలో ప్రచేతసులు వివాహమాడుదురు దశేంద్రియములు వృక్షముల యందు జీవరసమున మాత్రమే ఉండును. అన్నియు కలిసి ఒకటిగా ఉండును. వృక్షములకి ఇంద్రియ విభాగము లేదు. శబ్దము, కాంతి, స్పర్శ మున్నగునవి అన్నియు ఒకే అనుభవముగా పొందబడును. సుఖస్పర్శగాని నొప్పిగాని ఒకే అనుభవముగా చెట్టు మొత్తమునకు కలుగును. ప్రాంతీయమైన అనుభవము లేదు. పెంచి పోషింపబడుచున్నపుడు గాని, కోసి తినుచున్నపుడు గాని వృక్షములు ఒకే అనుభవమును పొందును. కనుకనే గడ్డికోసిన తరువాత పెరుగుట, చెట్లు కొమ్మ నరికినచో చిగురించుట ఉండును. జంతువులకు నరులకు ఇంద్రియములు వేరు వేరుగా విడిపోవుట చేతను, ఒక్కొక్క ఇంద్రియమునకే భౌతికమైన ఉపాధి ఏర్పడుట చేతను నరకినచో చిగుర్చుట సాధ్యము కాదు. 


దీనిని అనుసరించియే సంస్కారవంతులైన ఋషులలో వృక్షములను తినవచ్చుననియును, జంతువులను తినరాదనియును ఒక సంప్రదాయము ఏర్పడినది. ఇంద్రియ విభాగములు ఏర్పడని జీవరసము తొలిజాడలైన వృక్షచేతన్యముల వృత్తాంతము ఇందు వర్ణింపబడినది. ప్రచేతసులు అభిన్న ధర్మశీలురు. మారిష గూడ అభిన్న ధర్మశీలగా పతివ్రతగా వర్ణింపబడినది. వృక్షములందు ఈ ధర్మములన్నియును ఏకత్వమున ఉండునని అర్థము. 


అటుపైన ప్రచేతసులు పదివేల దివ్యసంవత్సరములు అడ్డులేని తేజస్సుతో భౌతికములు, దివ్యములు అగు సుఖములను అనుభవించిరట. అనగా వృక్షముల నుండి జంతువులు నరులు పరిణామమందుటలో ప్రచేతసులు ఇంద్రియ ప్రవృత్తులను వేర్వేరుగా సాధించిపెట్టిరి. భౌతిక దేహములందు భౌతిక సుఖములు, తపోమయాది దివ్యదేహములందు దివ్యసుఖములు ప్రచేతసుల వలననే జీవులకు కలుగుచున్నవని అర్థము. అందు భౌతికసుఖములు సంసారబద్ధులకును, దివ్యసుఖములు చిత్తవృత్తి నిరోధము చేసినవారికిని ప్రచేతసులచే అందింపబడినవి. 


నరులలో మొదట భౌతిక సుఖముల అనుభవము, అటుపైన వయస్సునుబట్టి వాని యందు వైరాగ్యము పుట్టుటయు ఇంద్రియముల ద్వారముననే కలుగుచున్నది. కనుకనే కొంతకాలము సుఖములను అనుభవించి అటుపైన అవి నరకములని గ్రహించి, నా స్థితిని పొందగలరని విష్ణువు వారికి వరమిచ్చెను.....✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 911 (For more Information about Master EK Lectures please visit www.masterek.org)

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online