Pages

శ్రీమద్ భాగవతం చదువుకుందాం ..భగవంతుణ్ణి తెలుసుకుందాం

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 నీవు జీవుల క్లేశములను తొలగించువాడవు. (ఇంద్రియములు మనస్సు అనువానిని ఉపయోగించి జీవుడు క్లేశము తెచ్చుకొనును. వానిలో నిన్ను చూచినపుడు నీవు క్లేశము తొలగింతువు). పరమగురువులైన మహానుభావులకు కూడా మనస్సు చేతను, వాక్కు చేతను నీవు గోచరింపవు. (వారి మనస్సు, వాక్కు నీవే అని ఉపాసించినపుడు గోచరింతువు). కోరికలకు కారణమైన సద్గుణముల పేర్లు గలవాడవు. (మంచివాడు కీర్తిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అను పేర్లు వినుట వలన ఆ గుణములు గోచరించి వానిపై కోరికలు పుట్టును. ఆ గుణములు నీ రూపములని తెలిసిన వారికి కోరికలు తీరును. అనగా కోరికలు ఉండని స్థితి కలుగును. గుణముల కొరకై ఆశపడిన వారికి కోరికలే మిగులును. తీరబోవుచున్నట్లుండును. తీరుట ఉండదు). 


నీవు సత్త్వగుణ మూర్తివి. (రజస్తమస్సులలో మనము ఉన్నపుడు భగవంతుని రూపములును, గుణములును సృష్టిలోని విలువైన వస్తువులుగా కనిపించి కామక్రోధములను పుట్టించును. సత్త్వగుణమున ఉన్నపుడు అవి అంతర్యామి శోభలుగా తెలియును కనుక సాన్నిధ్యమును కలిగించును). ఇట్లు అనుక్షణము ఈ సకల సృష్టియు పుట్టుట, ఉండుట, లయమందుట అను కథలను ధరించి మాయను ప్రసరింపజేయుచుందువు. నీవు మాయాగుణములచే చేయబడిన విగ్రహము కలవాడవు. (ఏ రూపము కాని, ఏ గుణము కాని వేరుగా గ్రహింపబడినపుడు మాయ క్రమ్మును. అంతర్యామియందు చూడబడినపుడు మాయ తొలగును). 


ఇంద్రియముల మార్గమున నీ సమస్తముగా గోచరించుచు ఇంద్రియములచే గమనింపబడుటకు వీలులేనివాడై ఉన్నావు. ప్రశాంతమైన మనస్సు గలవాడవు. (మాకు మనస్సు ప్రశాంతముగా ఉన్నపుడు అది నీదిగా ఉండును. అంతేకాని భగవంతునకు వేరుగా ప్రశాంత మనస్సు ఉండదు. మనస్సు మనది, ప్రశాంత మనస్సు భగవంతునిది). ఈ సంసారమును సృష్టించిపెట్టు మనోహరమైన బుద్ధిబలము గలవాడవు. (బుద్ధిబలము మనోహరమని వేడుక పడినపుడు దానితోనే వారికి సంసారము సృష్టించి బంధము తెచ్చిపెట్టును). 


దేవతలకు దేవుడవై వాసుదేవుడవుగా సర్వభూత నివాసుడవుగా ఉన్నావు. (ఇంద్రియాది ప్రజ్ఞలే దేవతలు. వానికి అధిపతి అంతర్యామి. వాని యందు దేవతా ప్రజ్ఞలుగా ఉండి, వానితో నిర్మింపబడిన జీవుల యందు జీవుడుగా నివసించుచున్నాడు కనుక వాసుదేవుడు). ఇట్టి నీవు ఇన్నిటి యందు ఉండియు ఇన్నిటికి సాక్షిగా ఉన్నావు. (కుండలోని మట్టి కుండ ఆకారమునకు సాక్షిగా ఉన్నదే గాని అందు చిక్కుకొని లేదు)........✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 918 (For more Information about Master EK Lectures please visit www.masterek.org),

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online