Pages

శ్రీ మద్ భాగవతం చదువుకుందాం .....భగవంతుడు ని తెలుసుకు0దాం

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 ప్రచేతసులు జనార్దనునితో ఇంకనూ ఇట్లనిరి..... నీ గర్భమునందు జలముల నుండి పద్మము పుట్టుచున్నది. (అవ్యక్తము నుండి వ్యక్తము పద్మముగా విచ్చుకొనుచున్నది). నిన్ను స్మరించుచున్నపుడు సంసార దుఃఖములను హరింతువు. ఎవడైన గమనింప గల ఉత్తమస్థాయి ఉన్నచో దానికి అధిపతివిగా అతనికి భాసించుచున్నావు‌. (శాస్ర్తమును అభ్యసించువానికి శాస్ర్తముగా ప్రత్యక్షమగును. యోగము సాధించువానికి యోగవిద్యగా దర్శనమిచ్చును. ఇట్లే ఎల్లరకును. చివరకు జూదమాడువానికి గూడ జూదము రూపమున ఉన్నానని గీతలో విభూతి యోగములో కృష్ణుడు చెప్పెను). 


పద్మకేసరముల వంటి దివ్యవస్ర్తములను ధరించినవాడవు. (పద్మము సూర్యుని చూచి విచ్చుకొనును కనుక సూర్యరశ్మియే వస్ర్తముగా సృష్టి అను దేహమున వెలుగుచున్నావని అర్థము). పద్మముల వంటి పాదములు గలవాడవు. (సూర్యుని వెలుగునకు మేల్కొను అడుగుజాడలతో జీవులను నడిపించువాడవు). పద్మమాలికను ధరించినవాడవు. (అహస్సులను వరుసలుగా ధరించిన కాలస్వరూపుడవు). 


కృష్ణుడు అను పేరు కలిగి ఆకాశము రూపమున నీలవర్ణుడవై ఉన్నావు. లోకములలోను, వానికి అవ్వలను ఉన్నావు. సద్గుణముల రూపమున భాసించుచున్నావు. దేవతల శత్రువులను హరించుచున్నావు. (దుర్గుణములు ఉన్నచోట నాశమును కలిగింతువు). 


దుఃఖములు లీనమగుటకు కారణమైన నీ రూపము ఎప్పటికప్పుడు ఆశ్చర్యకరమైనది. ఎవడును వారింపరాని ప్రత్యక్షత నీ రూపము‌న కలదు. (సృష్టి రూపమున అంతర్యామి గోచరింపబూనుట వలన దానిని చూడకుండుట సృష్టిలోన ఉన్నవానికి సాధ్యము కాదు. అనుగ్రహ సమయము కలిగినపుడు, ఈ సమస్తము వాడే అని తెలియుట కూడ ఎవడును అడ్డుపెట్టలేడు). 


మేము భరింపరాని విపత్తులను పొందినపుడు నీ కృప మా యందు ప్రసరింపజేయుటకన్నా అనుగ్రహమనగా మరొకటి ఏమున్నది? (ఇంద్రియములు అజ్ఞాని దేహమున ఇంద్రియ స్వరూపులై భయముతో గిలగిల కొట్టుకొను పరిస్థితి కలుగును. అట్టి స్థితిలో కనువిప్పు కలిగించుట కన్నా అనుగ్రహమేమున్నది?) 


భక్తులకు సద్భక్తి ఫలితమును అనుగ్రహ రూపమున ప్రసాదింతువు.......✍ *మాస్టర్ ఇ.కె.* (లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 4(2) 919,920,921,922 (For more Information about Master E.K. Lectures please visit www.masterek.org)

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online