Pages

The origin of Yogavaasistam

వశిష్ఠ ఉవాచ

నేనెవరిని?

నా కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా శాశ్వతమేనా?

అశాశ్వతమే అయితే ఆ క్షణికమైన తృప్తి కోసం మానవుడు ఎందుకీ మోహానికి బందీ అవుతున్నాడు?

ప్రాణులన్నీ మరణించటం కోసమే పుడుతున్నాయి. పుట్టి మరణిస్తున్నాయి. మరి ఈ చావు పుట్టుకలెందుకు?

ఆయువు పెరిగిన కొద్దీ కష్టాలు పెరగడం తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. అలాంటప్పుడు జీవికి ఆయువెందుకు?

ఎందుకోసం ఈ జీవితం? మనిషి కర్తవ్యం ఏమిటి?

పిడుగుల్లాంటి ఈ ప్రశ్నలకు దశరథ మహారాజు నిండు సభ నివ్వెరపోయింది. అక్కడున్న వేదవేదాంగవేత్తలు నిరుత్తరులవుతున్నారు. తాను అనుభవించిన వైరాగ్యాన్నంతటినీ సందేహాల రూపంలో శరపరంపరగా అడుగుతోంది నిండా 15 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు. అతడే స్వయంగా జ్ఞాని. ఆత్మశోధనతో ప్రపంచాన్ని అలౌకిక కోణంలో చూసిన దివ్యవేత్త. ఇక అతడి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేందుకు బ్రహ్మర్షులు కూడా సాహసం చేయలేకపోయారు. ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తితో మహర్షులు, సిద్ధులు సభలోకి వచ్చారు.

ఇంతకీ ఎవరీ బాలుడు? అంత చిన్న వయసులోనే అంత వైరాగ్యమేంటి? మరి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పిందెవరు?

కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత శ్రీరామచంద్రుడికి దేశయాత్ర చేయాలనే కోరిక కలిగింది. తండ్రి దశరథుడి ఆజ్ఞ తీసుకుని, సోదరులతో కలిసి పుణ్యక్షేత్రాలతో సహా మొత్తం దేశమంతా చుట్టివచ్చాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత అతనిలో ఎంతో మార్పు వచ్చింది. రాజభోగాలు అనుభవిస్తున్నా ఎప్పుడూ నిర్వేదంగా ఉండేవాడు. ముఖంలో విషాదఛాయలు ఉండేవి. లేకలేక పుట్టిన రాముడి ప్రవర్తనతో దశరథుడికి అంతులేని దు:ఖం కలిగింది. ఓరోజు ఈ విషయంపై మాట్లాడుతుండగానే సభలోకి విశ్వామిత్రుడు వచ్చాడు. రాక్షస సంహారం కోసం తనతో పాటు రామచంద్రుణ్ణి పంపమని అడిగాడు. కలవరపడుతున్న దశరథుణ్ణి, వశిష్ఠుడు సముదాయించి రామలక్ష్మణులను సభకు పిలిపించాడు.

అక్కడ రాముడి మనసులో ఆవేదన పసిగట్టిన విశ్వామిత్రుడు ‘రామా! నీ మనసు బాధ పడటానికి కారణం నాకు చెప్ప’మన్నాడు.

‘దేనివల్ల దు:ఖరహితమైన స్థితి వస్తుందో ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి. ఒకవేళ అలాంటిది లేకపోతే ఇక నాకు అశాంతి తప్పదు.మనస్సుకు శాంతి లభించకపోతే ‘నా’ అనుకున్న సర్వస్వాన్నీ వదిలేస్తాను. చివరికి దేహాన్ని కూడా... ఇంతకు మించి మార్గం లేదన్నాడు రాముడు.

విశ్వామిత్రుడి సూచనతో వశిష్ఠుడు రాముడి సందేహాలు తీర్చడానికి సిద్ధపడ్డాడు. నిషధ పర్వతంపైకి తీసుకెళ్లాడు. బ్రహ్మదేవుడు తనకు ఉపదేశించిన పరమాత్మతత్త్వాన్ని రామచంద్రుడికి ఉపదేశించాడు.

రామ, వశిష్ఠ సంవాద రూపంలో జరిగిన ఈ అనంతమైన తత్త్వవివేచనే ‘యోగవాశిష్ఠం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతమైన తత్త్వజ్ఞానానికి, జ్ఞానోపదేశానికి యోగవాశిష్ఠం కీర్తిపతాకగా మారింది. దీనికి ‘వశిష్ఠ రామ సంవాదం’, ‘వశిష్ఠగీత’ అనే పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 32 వేల శ్లోకాతో ఆరు ప్రకరణాలుగా వాల్మీకి మహర్షి దీన్ని తీర్చిదిద్దాడు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online