Pages

Story of karonamedicine hydrokloro quine

ట్రంప్, అమెరికా పుణ్యాన Hydroxychloroquine తెలియనివారు ఇప్పుడు దాదాపు ఉండరేమో. ఈ డ్రగ్ వెనుక ఓ మంచి కథ ఉంది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం, మన శ్రీరంగ పట్టణం, తాగే జిన్ను, టానిక్కులను కలుపుతుంది.

అది 1790 సమయం, టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రోజులవి. 1799లో బ్రిటీషు సైన్యం టిప్పు సుల్తాన్ ను ఓడించడంతో సమస్త మైసూరు సామ్రాజ్యం, రాజధాని శ్రీరంగపట్నంతో కలిపి బ్రిటీషువారి ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ 10-12 రోజులవరకు బ్రిటీషు సైనికులు విజయోత్సవాలలో మునిగితేలారు. కానీ కేవలం కొన్ని వారాల వ్యవధిలో, శ్రీరంగపట్నంలోని దోమల కారణంగా వాళ్లలో చాలామందికి మలేరియా సోకింది.

ప్రాంతీయ ప్రజలకు శతాబ్దాల కాలంగా వృద్ధి చెందిన రోగనిరోధక శక్తివల్ల వాళ్లకు మలేరియా నుండి రక్షణ లభించింది పైగా వీరు తినే మిరియాలు, లవంగం, అల్లం, కారం కూడా కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. కానీ కొత్తగా వచ్చిన బ్రిటీష్ సైనికులు, అధికారులు మలేరియా బారిన పడ్డారు.

ఈ పరిస్థితి నుండి గట్టెక్కడానికి బ్రిటీషువారు రాజధానిని శ్రీరంగపట్నం నుండి బెంగళూరుకు తరలించారు. అప్పుడు వెలసిందే ఈ బెంగళూరు కంటోన్మెంట్ ఏరియా. ఇక్కడి చల్లటి వాతావరణంతో సైనికులు సేదతీరారు కానీ మలేరియా నుండి విముక్తి లభించలేదు. బెంగళూరులో కూడా దోమల బెడద ఏమీ తక్కువ లేదు.

ఇంచుమించు అదే సమయంలో యూరోప్ శాస్త్రజ్ఞులు క్వినైన్ అనే కెమికల్ ను కనుగొన్నారు. దీన్ని మలేరియాకు వాడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున పరీక్షలు చేయలేదు.

సైన్యంలోని ఈ మలేరియా సమస్య వీళ్లకు పరీక్షలు చేయడానికి ఓ సువర్ణావకాశంగా వచ్చింది. అలా ఈ క్వినైన్ ను టోకుగా దిగుమతి చేసుకుని సైనికులందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరినీ రోజూ వాడమని చెప్పారు. రోగులే కాక, వ్యాధి లేనివాళ్లు కూడా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి వాడమన్నారు. తర్వాత దీన్ని దేశంలోని అన్ని బ్రిటీషు సైనిక స్థావరాల్లో అమలుచేశారు.

ఇక్కడ ఓ కొత్త సమస్య వచ్చింది. మలేరియా బారినపడ్డ దాదాపు ప్రతి సైనికుడు కోలుకొంటున్నాడు కానీ ఆరోగ్యంగా ఉన్న చాలా మంది వ్యాధి బారిన పడుతున్నారు. బాగా ఆరా తీస్తే తెలిసొచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు క్వినైన్ డోస్ తీసుకోకుండా పారబోశారు. కారణం అంతకంటే చేదైన మందు ప్రపంచంలో ఇంకోటి లేదు, పైగా ఇది ట్యాబ్లెట్ లా కాకుండ లిక్విడ్ గా ఉంది. ఈ చేదుమందు తాగడం కంటే, సైనికులు, ప్రాణాంతక మలేరియా బారిన పడడం మేలనుకున్నారు.

ఇప్పుడు మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి, ఇంకో కొత్త మందు కోసం కాదు, ఈ క్వినైన్ న్నే పేషంట్లు ఇబ్బంది పడకుండా తీసుకునే కిటుకు కోసం. ఈ పరిశోధనల్లో ఓ విన్నూత్నమైన విషయం కనుగొన్నారు. ఈ క్వినైన్ న్ను జునిపర్ తో చేసిన ఆల్కహాల్ తో కలిపునప్పుడు ఓ తీపి వాసన వెలువడింది, నిజానికి క్వినైన్ సైనికాధికారులు తాగే జిన్నుతో కలిపినప్పుడు ఆ చేదు పూర్తిగా పోయి కాస్త తీయ్యటి పదార్థంగా మారింది. ఇలా జిన్నుతో కలిపిన క్వినైన్ "Gin & Tonic" అయ్యింది. ఈ మిశ్రమాన్ని సేవించడానికి సైనికులు ఎగబడ్డారు.

దీని సక్సెస్ చూసిన అదికారులు. సైనికులకిచ్చే నెలవారీ రేషన్లో కొన్ని Gin బాటిళ్లు, ఓ టానిక్ బాటిల్(క్వినైన్) కూడా చేర్చారు.

ఈ డిమాండును తట్టుకోడానికి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగళూరు, ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో లిక్కర్ ఫ్యాక్టరీలను (breweries) ప్రారంభించింది. అలా ఆ రోజుల్లోనే బెంగళూరు పబ్బుల నిలయంగా మారింది. కాలక్రమేణా బ్రిటీషు వాళ్ళు దేశం వదలి పోవలసిన సమయం వచ్చినప్పుడు మన విజయ్ మాల్యా నాన్నగారు విట్టల్ మాల్యా ఆ లిక్కర్ ఫ్యాక్టరీలను కొని, అన్నింటినీ కలిపి United Breweries అనే పేరుతో ఓ కొత్త కంపెనీని బెంగళూరులో ప్రారంభించారు.

సరే మళ్లీ విషయానికి వస్తే, అలా మొదలయ్యింది ఇప్పటికీ పాపులర్ అయిన Gin & Tonic. తర్వాత దాదాపు అన్ని జ్వరాలను బాగు చేయడానికి ఈ టానిక్(క్వినైన్) ద్రావకాన్ని డాక్టర్లు ఇవ్వడం మొదలెట్టారు. దాదాపు 1980 వరకూ కూడా గ్రామాల్లో ఎవరికైనా అస్వస్థత అయితే "డాక్టరు దగ్గరికెళ్లి టానిక్ తెచ్చుకో" అనే మాట నానుడి అయ్యింది. అలా ఇంగ్లీషు మందులకు టానిక్ అనే పేరు స్థిరపడిపోయింది.

క్రమంగా విస్తృత పరిశోధనల తర్వాత ఈ క్వినైన్ కాస్తా Chloroquineగా, ఆ తర్వాత side effects దాదాపుగా లేని Hydroxy chloroquineగా రూపాంతరం చెంది, మలేరియాకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయ్యింది.

ఇలా టిప్పు సుల్తాన్ ఓటమితో మొదలైన ఈ chloroquine ప్రస్థానం ఇప్పుడు అమెరికా కరోనా పోరులో బ్రహ్మాస్త్రమై, బ్రెజిల్ దృష్టిలో సంజీవనిగా స్థిరపడింది. 😊😊

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online