Pages

శ్రీ రామ రక్షా స్తోత్రం..... అర్థం తో

అస్యశ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీసీతారామచంద్రో దేవతా, అనుష్టుప్‌ఛందః, సీతా శక్తిః, శ్రీమాన్‌ హనుమాన్‌ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్థం, రామరక్షాస్తోత్ర పారాయణే వినియోగః ||
తాత్పర్యము: శ్రీ రామరక్షాస్తోత్రమునకు బుధకౌశికుడు ఋషి, సీతాసహిత శ్రీరామచంద్రుడు అధిదేవత. ఛందమనుష్టుప్పు. సీత శక్తి. శ్రీమంతుడైన హనుమంతుడు కీలకం. శ్రీరామచంద్రుని ప్రీతి కొరకై (అనుగ్రహము నాశించుచూ) చేయు పారాయణమునందీ మంత్రమునకు వినియోగము. (ప్రతి మంత్రానికి దానిని దర్శించిన ఋషి, ఆ మంత్రానికి అధిష్టానదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, ఆ మంత్ర జపము చేసినందువల్ల కలిగే ప్రయోజనము చెప్పబడతాయి.)
 ధ్యానమ్‌ : ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బధ్ధ పద్మాసనస్థమ్‌ | పీతం వాసోవసానం, నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్‌ | వామాంకారూఢ సీతాముఖకమల మిలల్లోచనం నీరదాభమ్‌ | నానాలంకార దీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్‌ ||
తాత్పర్యం: ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు ధనుర్బాణములు ధరించి వున్నాడు. పచ్చని వస్త్రములను ధరించి, పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కలువరేకులను మించిన సోయగము గల కన్నులాయనవి. ప్రసన్నముగా వున్న ఆయన ఎడమతొడపై తల్లి జానకమ్మ కూర్చొనియున్నది. నీలమేఘశ్యాముడైన రామయ్యతండ్రి సీతమ్మ ముఖకమలాన్ని పరికించుతున్నాడు. ఆయన జటామండల ధారియై, సర్వాలంకారాలతో శోభిస్తూ వున్నాడు. అటువంటి సీతాసహితుడై వున్న శ్రీరామచంద్రుని నేను ధ్యానించుకుంటున్నాను. (ఈ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ భక్తిగా నమస్కరించుకుందాం.)ప్రక్కన సీతమ్మ తల్లి వుండడం వలన శ్రీరామచంద్రుడి వదనం ప్రసన్నంగా వుంది. వారి అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇదే కదా సరైన సమయం!
 స్తోత్రమ్‌
--------------
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్‌ || 1 ||
తాత్పర్యం:
రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రుని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో వున్నది. ఆ శ్లోకాలలో వున్న ఏ ఒక్క అక్షరమైనా మనయొక్క మహాపాపాలను సైతం పరిహరిస్తుంది.మనకు హిమాలయాలకు పోయి ఘోరమైన తపస్సు చేసుకునే పరిస్థితి లేదు. కనీసం ఇంట్లో రోజూ గంటలు గంటలు కూర్చుని షోడశోపచారాలతో దేముని పూజించే వెసులుబాటు కూడా లేదు. అందుకే దగ్గిరదారిని వెడదాం. మనం కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, బస్సులోనో, కారులోనో, రైలులోనో, విమానంలోనో వెళ్తున్నప్పుడు, నిత్యం రామనామం జపించుకుంటూ వుందాం. దీనికి ఏ నిష్టా, నియమమూ అక్కర్లేదు. ఇదే తరించడానికి సులువైన ఉపాయం.
.
 ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం ||
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్‌ || 2 ||
తాత్పర్యము:
నల్లకలువ వంటి శరీరవర్ణము, పద్మదళముల వంటి వెడద కన్నులు కలిగివుండి, జడల ముడినే కిరీటముగా ధరించిన శ్రీరామచంద్రుడు సీత తోను, లక్ష్మణుడితోను కూడి వున్నాడు. ఆయన చేతులలో ఖడ్గం, శరములతో నిండివున్న అమ్ములపొది, ధనుస్సు వున్నవి. ఆ ఆయుధములతో ఆయన రాక్షసులను అంతమొందిస్తాడు. లోకసంరక్షణార్థం అవతరించడం వారి లీలయే గాని వేరు కాదు. నిజానికి శ్రీరామచంద్రప్రభువు పుట్టుక లేనివాడు.
.
 రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్‌ |
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 3 ||
తాత్పర్యము:
 ప్రాజ్ఞులు సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుని రూపాన్ని మదిలో ఊహించుకుంటూ, పాపములను పోగొట్టేటటువంటి, అన్ని కోరికలను తీర్చునట్టి యీ రామరక్షాస్తోత్రమును పఠించవలెను. ఇక్కడనుంచి శ్రీరామచంద్రుడు మనలను ఏవిధంగా కాపాడాలో, ఏవిధంగా కాపాడతాడో చెప్పబడుతోంది. రాఘవుడు నా శిరస్సును, దశరథాత్మజుడు నా నొసటిని రక్షించు గావుత!
.
 కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 4 ||
తాత్పర్యము:
కౌసల్యాతనయుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి ప్రియమైనవాడు కర్ణేంద్రియములను, యజ్ఞరక్షకుడు నాసికను, లక్ష్మణునియందు వాత్సల్యభావము గలవాడు ముఖమును రక్షించుగాక.
(పఠించేటప్పుడు కౌసల్య ఒడిలో నున్న శ్రీరామచంద్రుడిని, విశ్వామిత్రుడి వెనుక యాగరక్షణకేగుచున్న శ్రీరాముని, యజ్ఞరక్షణకై విల్లమ్ములు చేబూని తిరుగుతున్న రాముని, లక్ష్మణుని వాత్సల్యంతో అక్కున జేర్చుకుంటున్న శ్రీరామచంద్రుడిని మనసులో భావించుకోవాలి. ఇట్లాగే అన్ని నామాలకు వాటి అర్థాన్ని బట్టి రూపాన్ని ఊహించుకుంటూ వుండాలి.)
 జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ||
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || 5 ||
తాత్పర్యము:
విద్యానిధి యైన రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింపబడిన రాముడు నా కంఠమును, దివ్యాయుధములను ధరించియున్న రాముడు నా భుజస్కంధములను, శివధనుర్భంగమొనరించిన రాముడు నా భుజములను, సీతాపతి నా చేతులను, పరశురాముని గర్వమునణచిన రాముడు నా హృదయమును, ఖరుడను రాక్షసుని జంపిన రాముడు నా నడుమును, జాంబవంతుని కాశ్రయమిచ్చిన రాముడు నా నాభిని రక్షించుగాక!శ్రీరాముడిని మన సర్వాంగాలను రక్షించమని వేడుకుంటున్నాము కదా? మరి ఆ యా అంగాలను మనం సదుపయోగం చేసుకోవాలి గాని దురుపయోగం చెయ్యకూడదు కదా? ఉదా: నాలుకను మంచిమాటలు పలుకడానికి, భగవంతుని స్తుతించడానికి ఉపయోగించుకుందాము. అంతేగాని పరులను నిందించడానికి, అబధ్ధాలాడడానికి ఉపయోగించవద్దు.
.
 సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ || 6 ||
తాత్పర్యము:
సుగ్రీవుని పాలించిన ప్రభువు కటి ప్రదేశమును, హనుమంతునకు ప్రభువు తొడల యెముకలను, రాక్షస కులమును నిర్మూలించిన రాఘవశ్రేష్ఠుడు తొడలను రక్షించుగావుత!
.
 జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః || 7 ||
.
తాత్పర్యము:
సేతువును నిర్మించినవాడు నా మోకాళ్ళను, రావణాసురుని చంపినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్యలక్ష్మిని ప్రసాదించినవాడు నా పాదములను, శ్రీరాముడు నా సకలదేహమును కాచుగాక!
.
 ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |
స చిరాయుస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || 8 ||

తాత్పర్యము:
శ్రీరాముని బలమును పొందిన ఈ రామరక్షాస్తోత్రమును పఠించిన వుణ్యశాలి దీర్ఘాయుష్మంతుడై, సంతానవంతుడై, వినయశాలియై, విజయము నొంది సుఖించును.
 పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || 9 ||
.
తాత్పర్యం:
పాతాళమందు గాని, భూలోకమందు గాని, ఆకాశమందుగాని కపటవేషములు ధరించి తిరుగాడు ఏ కుటిలాత్ములైనను శక్తిమంతమైన రామనామముచే రక్షింపబడిన వారిని కన్నెత్తి యైనను చూడజాలరు.
.
 రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్‌ |
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి || 10 ||
తాత్పర్యము:
రామా అని గాని, రామభద్రా అని గాని, రామచంద్రా అని గాని స్మరించు నరునకు ఏ పాపములు అంటవు. అతడు ఇహలోకమందు భోగములనుభవించి, తదనంతరము మోక్షమును పొందగలడు.
.
 జగజ్జైత్త్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్‌ |
యః కంఠే ధారెయేత్తస్య కరస్థాః సర్వసిధ్ధయః || 11 ||
తాత్పర్యము:
జగత్తును జయించగలది ఒక్క రామనామ మంత్రమే. ఆ మంత్రముచే రక్షింపబడియున్న యీ రామరక్షాస్తోత్రమును కంఠస్థము చేసి జపించువానికి అన్ని సిధ్ధులు కరతలామలకములగును.
.
 వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞస్సర్వత్ర లభతే జయమంగళమ్‌ || 12 ||

తాత్పర్యము:
వజ్రపంజరమను పేరుగల ఈ రామకవచమును (ఈ రామరక్షాస్తోత్రమును) జపించిన వాని యాజ్ఞ తిరుగులేనిదగును. అతడికి ఎల్లెడల జయమును, శుభమును లభించగలవు.
.
 ఆదిష్టవాన్‌ యథా స్వప్నే రామరక్షామిమాం హరః |
తథా లిఖితవాన్‌ ప్రాతః ప్రబుధ్ధో బుధకౌశికః || 13 ||
తాత్పర్యము:
బుధకౌశిక మహర్షి నిద్రనుండి మేల్కొని, తనకు పరమశివుడు స్వప్నమందుపదేశించిన ఈ రామరక్షాస్తోత్రమును యథాతథముగా ప్రాతః కాలమున లిఖించెను.
.
 ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్‌ |
అభిరామ స్త్రిలోకానామ్‌ రామః శ్రీమాన్సనః ప్రభుః || 14 ||
తాత్పర్యము:
శ్రీరాముడు కల్పవృక్షముల వనము. (ఒక్క కల్పతరువే అన్ని కోర్కెలను తీరుస్తుంది. అటువంటిది శ్రీరాముడు అనేక కల్పతరువుల తోట.) అన్ని ఆపదలను పారద్రోలే త్రిలోకాభిరాముడు. అటువంటి శ్రీరామచంద్రుడే మన ప్రభువు.
.
 తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ |
ఫలమూలాశినౌ దాంతౌ తపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |
శరణ్యౌ సర్వసత్వానాం శ్రైష్ఠౌ సర్వ ధనుష్మతామ్‌ |
రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || 15 ||
తాత్పర్యము:
రామలక్ష్మణుల గురించిన వర్ణన ఇందులో వుంది. యువకులు, అందమైనవారు, సుకుమారులు, అమితమైన బలము కలవారు, కలువలవంటి విశాలమైన నేత్రద్వయములను కలిగినవారు, నారబట్టలను, లేడిచర్మమును ధరించినవారు, కందమూలములను భుజించుచున్నవారు, ఇంద్రియనిగ్రహము కలిగి తపస్సు నాచరింపుచున్నవారు, బ్రహ్మచారులు, దశరథపుత్రులు, సోదరులు అయిన రామలక్ష్మణులు సకలప్రాణులకు శరణ్యమైనవారు. ధనుర్ధరులలో శ్రేష్టులు, రాక్షసకులమును నిర్మూలించువారు. అటువంటి ఆ శ్రీరామ లక్ష్మణులు మమ్ములను రక్షింపుదురు గావుత.
.
 ఆత్తసజ్య ధనుషావిషు స్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథిసదైవ గఛ్ఛతామ్‌ || 16 ||
తాత్పర్యము:
ధనువులెక్కుపెట్టి, బాణములు పట్టుకొని, మూపుల నక్షయ తూణీరముల దాల్చి నన్ను రక్షించుటకు రామలక్ష్మణు లెల్లప్పుడు నేను నడచు మార్గమున నాకు ముందుగా నడచుచుందురు గాక.
.
 సన్నధ్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గఛ్ఛన్‌ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః || 17 ||
తాత్పర్యము:
సర్వదా సంరక్షణార్థము సంసిధ్ధుడై, కవచ ఖడ్గములు, విల్లమ్ములు ధరించి, యువకుడై, లక్ష్మణసమేతుడై యున్న శ్రీరాముడు మన కోరికల నీడేర్చుచు మనలను రక్షించుగాక!
.
 రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ||
వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ||
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రధ్ధయాన్వితః |
అశ్వమేథాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || 18 ||
తాత్పర్యము:
 పరమశివుడు చెప్పుచున్నాడు, ఈ రామరక్షాస్తోత్రమును నా భక్తులు నిత్యము శ్రధ్ధతో జపించినచో వారికి అశ్వమేథయాగము చేసినందు వల్ల కలిగెడు పుణ్యము కంటె అధికమైన పుణ్యము లభించును. ఇందులో ఎట్టి సందేహమును లేదు.
.
 రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాస సం
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః || 19 ||
తాత్పర్యము:
దూర్వాదళశ్యాముడు, పీతాంబరధారి, పద్మపత్రాక్షుడు ఐన శ్రీరామచంద్రుని దివ్యనామాలతో స్తుతించినవారు (శ్రీరామరక్షాస్తోత్రం పఠించడం ద్వారా) పునర్జన్మ లేక మోక్షమునందెదరు.
.
 రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రావణారిమ్‌ || 20 ||
తాత్పర్యము:
లక్ష్మణునికి అన్నగారు, రఘుకులతిలకుడు, జానకీనాథుడు, సుందరుడు, కాకుత్స్థుడు, దయాసముద్రుడు, సద్గుణసంపన్నుడు, విప్రప్రియుడు, ధర్మమూర్తి, రాజేంద్రుడు, సత్యవాక్పరిపాలకుడు, దశరథతనయుడు, నీలివర్ణుడు, శాంతమూర్తి, లోకాభిరాముడు, రఘువంశశ్రేష్ఠుడు, రావణునికి వైరి అగు శ్రీరామచంద్రునికి నమస్కారము.
.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 21 ||
.
తాత్పర్యము:
రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, లోకనాథుడు అని పిలువబడుచున్న సీతాపతి యైన శ్రీరామచంద్రపరబ్రహ్మకు నమస్కారము.
.
 శ్రీరామ రామ రఘునందన రామ రామ!
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ!
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || 22 ||
తాత్పర్యము:
పదే పదే భక్తితో శ్రీరామచంద్రుని పలువిధముల పిలుచుచు భక్తుడు తనకు రామచంద్రుడే రక్ష యగుగాక అనుచు శరణు జొచ్చుచున్నాడు.
 శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే || 23 ||
తాత్పర్యము:
ఓ శ్రీరామచంద్రా! నీ చరణములను మనసార ధ్యానించి, నోరార నీ చరణములను కీర్తించి, తలవంచి మ్రొక్కుచున్నాను. శ్రీరామచంద్రా! నీ చరణముల శరణు వేడుచున్నాను.
.
 మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళు ర్నాన్యం నైవజానే న జానే || 24 ||
తాత్పర్యం:
నాకు తల్లియు, తండ్రియు, స్వామియు, మిత్రుడును కూడ రామచంద్రుడే. నాకు సర్వస్వము దయాళువైన శ్రీరామచంద్రుడే. వేరొక దైవమును నేనెఱుగనే ఎఱుగను.
.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్‌ || 25 ||
తాత్పర్యము:
కుడిప్రక్క లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవియు, ఎదుట ఆంజనేయుడును వుండగా విరాజిల్లు రఘునందనునికి నమస్కరింతును.
.
 లోకాభిరామం రణరంగధీరం | రాజీవనేత్రం రఘువంశనాథం |
కారుణ్యరూపం కరుణాకరం తం | శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || 26 ||
తాత్పర్యము:
కనులకు విందు చేయు సుందర రూపము గలవాడు రాముడు. యుధ్ధరంగమునందు ధీరుడైన వీరుడు రాముడు. తామరపూవుల వంటి కనులు గలవాడు. రఘువంశనాథుడు. కరుణయే రూపముగా గలవాడు. దయాసముద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని నేను శరణు జొచ్చుచున్నాను.
 మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్‌
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్‌
శ్రీరామదూతం శరణం ప్రపద్యే || 27 ||
తాత్పర్యం:
మనోవేగము కలవాడు, వాయువుతో సమానమైన వేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుధ్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సైన్యాధిపతి, శ్రీరాముని దూత ఐన హనుమంతుని నేను శరణు వేడుకొనుచున్నాను.
 కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్‌ || 28 ||
తాత్పర్యము:
 కవిత్వమను కొమ్మనెక్కి రామ రామ యనెడి మధురాక్షరములను మధురముగా కూయుచున్న వాల్మీకి యనెడు కోకిలకు నేను నమస్కరించుచున్నాను.
.
 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ || 29 ||
.
తాత్పర్యము:
 ఆపదలను పోగొట్టువాడు, సర్వసంపదలను ఇచ్చువాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి మరల మరల నమస్కరింతును.
 భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్‌ |
తర్జనం యమదూతనాం రామరామేతి గర్జనమ్‌ || 30 ||
.
తాత్పర్యం:
 రామా రామా యని ఎలుగెత్తి చేయు గర్జన సంసారపు బీజములను నశింపజేసి (ముక్తిని ప్రసాదించి), సుఖసంపదలను కలిగించుటయే గాక ఆ అరుపు విని యమదూతలు కూడ బెదిరిపోదురు.
.
 రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ||
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం |
రామే చిత్తలయస్సదా భవతు మే భోరామ మా ముధ్ధర || 31 ||
.
తాత్పర్యము:
 రాజరత్నమైన రాముడు సదా విజయవంతుడై యున్నాడు. లక్ష్మీపతియైన (విష్ణుస్వరూపుడైన) రాముని నేను భజింతును. రామునిచే రాక్షససైన్యము సంహరింపబడినది. ఆ రామునికి నమస్కారము. రాముని కంటె మించిన అండ మరియొకటి లేదు. నేను రామునకు దాసుడనై యున్నాను. నా చిత్తమెల్లప్పుడు రాముని యందు లగ్నమై (రామునిలో కలసిపోయి) యుండుగాక. ఓ రామా! నన్నుధ్ధరింపుము.
.
 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 32 ||
తాత్పర్యము:
పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పుచున్నాడు,
" ఓ వరాననా! నేను " శ్రీరామ రామ రామ " యనుచు మనస్సును రమింపజేయు శ్రీరాముని యందు రమించుచుందును.
ఆ రామనామము సహస్రనామ సమానము.
(లేదా సహస్రనామము ఒక్క రామనామముతో సమానము)
ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణమ్‌.
తాత్పర్యము:
ఇతి శ్రీ బుధకౌశికముని విరచితమైన శ్రీరామరక్షాస్తోత్రము సంపూర్ణము.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online