🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 స్తోత్రములు, స్తోమములు, స్తోభములు మున్నగు వివిధ సామలతో స్తుతింపబడుచున్న ఛందోమయదేహుడైన గరుడుడు సమస్త బాధల నుండి రక్షించుగాక! శ్రీహరి యొక్క నామములు, రూపములు, వాహనములు మొదలగునవి దివ్యాయుధములై మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను రక్షించును గాక.
(ఇచ్చట సాధకుని మనస్సు, బుద్ధి, ఇంద్రియములు మొదలగునవియే ఆయుధములుగా పనిచేయునని అర్థము. అవియే భక్తుల యెడల భూషణములుగా వర్తించునని మూలమున ఉన్నది. ఇది అనువాదమున విడువబడినది.)
సమస్తమును భరించుచున్న ఆదిశేషుని మూర్తి ఉపద్రవములన్నిటిని తొలగించును గాక! ఈ విశ్వము యొక్క రూపమే నారాయణుని రూపముగా ధ్యానము నిలిచినవానికి నారాయణుడు వికల్పము లేనివాడు. అతడు తన మాయచేతనే తన శక్తులన్నిటిని భూషణములుగను, ఆయుధములుగను ధరించి వెలుగొందుచుండును. అట్టి లక్ష్మీసహిత నారాయణుడు వికల్ప విగ్రహముల నుండి నన్ను రక్షించునుగాక. (వికల్ప విగ్రహములనగా చూచువానిచే కల్పింపబడునట్టి సృష్టి రూపములు. మట్టితో కుండను కల్పించినపుడు కుండయే జ్ఞప్తి యుండును గాని మట్టి ఉండదు గదా! అట్లే భగవంతుని రూపములను చూచుచు మనము జంతువు, చెట్టు మున్నగు వానినే గుర్తుంచుకొందుము గాని భగవంతుని రూపములను గుర్తుంచుకొనము గదా! ఇంకను చుట్టరికములు మున్నగు వానిని కల్పించుకొని ఏవో చిక్కులలో పడుచుందుము. ఇవియే వికల్ప విగ్రహములు అట్టివాని నుండి మనస్సును భగవంతుడే రక్షింపవలెను.)
భయంకరమైన తన నవ్వుతో వెలుగులు వెలువడజేయుచున్న పెద్ద నోరు గల నృసింహమూర్తి దిక్కులందును, దిక్కుల సందులందును, క్రింద మీద సమస్త ప్రదేశములందును కాపాడుచుండును గాక!......✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-306.
🌹🌹🌹ఓం నమో నారాయణాయ ...ఓం నమో వేంకటేశా య ...శివ కేశవం మహా నారాయణ0🌹🌹🌹
0 comments:
Post a Comment