[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 ఆ వృత్రుని చూచి దేవతలందరును రోషపడి గుంపులుగా గూడి చుట్టుముట్టిరి. ( సృష్టిలో అందరును ఒకని యందు ఒకడు తప్పులు గమనించి, అసూయపడి దెబ్బతినిరి అని అర్థము.) వారు తమ విద్యలన్నియు ప్రదర్శించి అస్ర్తములు, మహాశస్ర్తములు వానిపై ప్రయోగించిరి. అతడు వాటినన్నిటిని పట్టుకొని భక్షించెను. అస్ర్తములను మ్రింగి మీదకు వచ్చుచున్న వృత్రాసురుని చూచి ఆ దేవతలందరును తమకు రక్షకుడెవడో తెలియక చెల్లా చెదరై పరుగెత్తిరి. వాని తేజస్సు యొక్క వైభవమునకు భయపడి చేయునది లేక కన్నులు మూసుకొని అంతర్యామిని స్మరించి ఇట్లని మొరపెట్టుకొనిరి.
వీనిని జయించుట సాధ్యము కాదు. ప్రయోగించిన మహాస్ర్తములన్నిటిని మ్రింగి మీదకు వచ్చుచున్నాడు. (ఎదుటివారిలోని తప్పులను గమనించి ఒకరినొకరు సరిదిద్దకోవలెనని యత్నించుటలోను, సంఘసంస్కరణలు మొదలగునవి తలపెట్టుటలోను తమలోనే రాక్షస గుణములు పెచ్చు పెరుగుటయు, సంస్కరణ ప్రయత్నములు వ్యర్థమై దురహంకార స్వరూపుడగు వృత్రునిచే మ్రింగబడుటయు వేదార్థముగా ఇతిహాసము చేయబడెను. దానితో పెద్ద పెద్ద వారు కూడా కర్తవ్యము తోచక అంతర్యామి స్మరణ వైపునకు మొగ్గుచున్నారు.)
వీడు సాటిలేనివాడు. వీనితో యుద్ధము చేయగలవాడుండడు. ఇప్పుడు నారాయణుడు తప్ప మనకు తోడ్పడగలవాడు లేడు. (ఎదుటివారిలో తప్పులను గమనించు లక్షణము పోవలెనన్నచో అంతర్యామి సాధనయే ముఖ్యమని అర్థము.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-321,322,324,324.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻వృత్రాసురుడు ఒక్కమారు నోరు తెరువగా ఆకాశమును మ్రింగుచున్నట్లుండెను. నాలుక జాపగా గ్రహములను, తారకలను నాకి వేయునా అన్నట్లుండెను. ఉత్సాహమునకు విరగబడి నవ్వుచుండగా లోకములను మ్రింగుచున్నాడా అను భ్రాంతి కలిగెను. నలు దిక్కులకు వ్యాపించిన కోరలు వెలువడుచుండగా దిగ్గజములు, దంతములు ముక్కలై రాలుచున్నవా అనిపించెను. త్వష్ట అను ప్రజాపతి తపస్సుతో పుష్టి పొంది లోకములను ఆక్రమించు వృత్రాసురుని పద్ధతి అడ్డగింపరానిదై విజృంభించెను.
(విశ్వరూపుని చూచి తొందరపడి ఇంద్రుడు శిరస్సులు ఖండించుటతో వృత్రాసురుడు పుట్టెను. దేవదానవ గుణములలో దానవ గుణములు చెడ్డవి, వానిని గమనించుట, తొలగించుట అను ప్రయత్నములలో ఆ గమనించువారి లోపలనే సమస్త రాక్షస గుణములు పుట్టి ఆక్రమించును. ఈ లక్షణమే వృత్రాసురుడు. మిగిలిన రాక్షసులందరిని చంపవచ్చును గాని రాక్షస గుణములను ఇతరులలో గమనించి, వేటాడుట అను వృత్రాసుర లక్షణమును ఎవ్వరును జయింపలేరు. జయింప సాధ్యము కానంతగా లోపల వ్యాపించును. ఏ ఆయుధములకు గాని, ఉపదేశములకు గాని ఈ లక్షణము లొంగదు. దీని ఇతిహాసమే వృత్రాసుర కథ. ఇది వేద సంహితల కాలము నాటికే సుప్రసిద్ధమైన ఇతిహాసము.
వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, రామాయణ, మహాభారతములు మున్నగునన్నిటి యందును ఈ కథ వ్యాపించియే ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)- 320.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 వృత్రాసురుని చూచి భయపడిన దేవతలు వీనితో యుద్ధము చేయగల వాడుండడు అని భావించి తమలో తాము కంగారుపడి, తికమక పడి బయలుదేరిరి. వారికి కన్నులు కనుపింపలేదు. వృత్రాసురుని తేజోమయమైన వికృత రూపము చూచిన కన్నులతో ఎటు చూచినను ఆ రూపమే కనిపించెను. అట్లే తడువుకొనుచు వారందరును స్మరణమే ఆధారముగా పాలసముద్ర తీరము చేరిరి.
అందెటు చూచినను నారాయణుని కీర్తి లతలుగా ప్రాకి పూలగుత్తులు కదలాడుచున్నట్లు క్షీరసాగరమందలి అలలు, వానిపై ఎగురుచున్న నురుగు ముద్దలు దర్శన మిచ్చినవి. నిరంతరము నారాయణుని పాదారవిందములను సేవించుచున్న పుణ్యముద్రతో కూడిన దక్షిణావర్త శంఖములే ఎటు చూచినను కనిపించెను. నలుదెసల యందును కఠినములైన తిమింగలముల ముట్టెలపై కొమ్ములును, సొర చేపల ముట్టెలపై పెరిగిన గరికతో కూడిన పెద్ద పెద్ద కాడలవంటి మీసములను, మహా దేహములతో కూడిన తాబేళ్ళును తీవ్రవేగములతో పరువెత్తుచున్నవి. అవి వేటాడుచు ఈదుచుండుటలో గుండ్రముగా తిరుగుచున్నవి. ఈ గమనములకు భయంకరములైన సుడిగుండములు ఏర్పడుచున్నవి. ఆ సుడులకు ఆ జంతువులు కొట్టుకొనుట వలన పైకి లేచిన అలలు ఆకాశమున చెదరి బిందువులై తారకలవలె కనిపించుచున్నవి.
ఆ పాల సముద్రమున అందందు మహా పర్వతములు ఉన్నవి. వాని శిఖరాగ్రముల దాకా ఎగసి ఘర్షణ చెంది దిగువకు ప్రవహించుచున్న క్షీరములు సెలయేళ్ళ వలె ఉన్నవి. అట్లు క్షీరములు దిగువకు ప్రవహించినపుడెల్ల పలు విధములైన ఆకారములతో పర్వతములు గుహలు, లోయలు వెలువడుచున్నవి. అవి పురాణ పురుషుని నిర్మలాంతఃపురముల వలె కనుపించుచున్నవి. వాని వెంబడి జారుచున్న అలల ఆకారములలో అనేక శిల్ప వైభవములు గోచరించుచు ఊహింపరాని నారాయణుని మహా భవన నిర్మాణ కుశలతను తెలుపుచు ఆ క్షీరములు తళుకుమనుచున్నవి............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 అతి పవిత్ర గుణములతో విచిత్ర రూపములు ధరించిన నారాయణుని భార్యల ప్రేమయు, ఆనందస్థితి అందు గోచరించుచున్నవి. (శ్రీదేవి, భూదేవి యొక్క వైభవములు గోచరించుచున్నవి.) వారి ప్రేమానందములను గమనించి తన హృదయమందలి కరుణారసముతో కలిపి అతడు మరల తన ప్రేమను ప్రసరింపజేయుచున్నాడనుటకు నిదర్శనముగా పగడముల తీగలు అల్లుకొని వ్యాపించి ఉన్నవి.
అందు ప్రవహించుచున్న సముద్ర జలములు సిద్ధరసములైన క్షీరములు వానితో సంగమము చెందుటకు అనేక మహా తీర్థముల జలములు వచ్చి ఘర్షణ చెంది, చాలా ఎత్తుగా ఎగిరి పడుచున్నవి. దానితో ఆకాశ ప్రదేశము అంతయు శబ్దముతో నిండిపోయినది. సముద్ర తీరము భూదేవికి మొలనూలు వలె అలంకరింపబడి ఉన్నది. దాని వైపునకు ప్రసరించుచున్న పలుచని అలలు భూదేవి ధరించిన పట్టు వస్ర్తముల వలె ఉన్నవి.
విష్ణువు గాని, శివుడు గాని, ఏ దేవతలు గాని అమృత దానము చేయవలసిన సందర్భము కలిగినపుడు వెదకికొనక్కరలేదు. ఇచ్చట మహానిధి ఉన్నది అని తెలియుచున్నది. ఆ క్షీర సాగరమున తెల్లని దీవిపై వైకుంఠపురమున్నది. అచ్చటి పుర ప్రముఖులు కోరికలను ఫలింపజేయు కల్పవృక్షముల జాతులతో కూడిన మహా వృక్షముల వనములున్నవి.............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
[11/23, 7:56 PM] Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 కుబేరుని ధనాగారమునందు పద్మము, మహా పద్మము, శంఖము, మకరము, కుచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము అను మహానిధులు ఉండును. అట్లే ఈ పాలసముద్రమున మహాపద్మరాగములు, శంఖములు, మకరములు, కుచ్ఛపములు (తాబేళ్ళు), ముకుందములు, కుందములు (కొన్ని జాతుల రత్నములు) నీలములు మొదలగు శ్రేష్ఠములైన సామాగ్రి ఉన్నది. విష్ణుమూర్తి హస్తమునందు సుదర్శన చక్రము తిరుగుచున్న ఠీవి ఉండును. ఈ పాల సముద్రమునందు సుదర్శనములైన (చక్కని దర్శనము ఇచ్చునట్టి) సుడులు ఠీవిగా తిరుగుచుండును. కైలాస పర్వతమున అమృత కళలకు స్థానమైన చంద్రుని శిరస్సు ధరించిన పరమేశ్వరుని దర్శనము అగును. ...
🌷🌷🌷🙏 జై శ్రీమన్నారాయణ ....జై జై శివనారాయణ ...జై జై సాయి నారాయణ 🙏🌷🌷🌷
అట్లే ఈ క్షీర సాగరమున చంద్రుడు పుట్టి తన కిరణములను ప్రసరింపజేయుచున్నాడు. ఇంద్రుని వైభవము కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనువానితో పుట్టుచుండును. ఈ పాల సముద్రమున ఆ కల్పవృక్షాదులు తామే పుట్టినవి. పూర్వము సుగ్రీవుని సైన్యమున అంతులేని హరి రూపముల (కోతుల) సంచారముండెను. ఈ పాలసముద్రమున హరియైన విష్ణుమూర్తి బహురూపములతో సంచరించుచుండును.
ఈ క్షీర సాగరము నారాయణుని గర్భము వలె సమస్త సృష్టి భారమును భరింపగలిగియున్నది. శంకరుని జడల చుట్టవలె ఆకాశ గంగానదిచే ఆక్రమింపబడి ఉన్నది. బ్రహ్మలోకమువలె హంసల చేతను (శ్వాసల చేత), పరమహంసల చేతను సేవింపబడుచున్నది. పాతాళలోకమున అనంతుడు అను భోగిరాజు నిలుచుటకు తావున్నది. అట్లే క్షీర సాగరమున కూడా ఆదిశేషుడు చుట్టుకొని విష్ణుమూర్తికి శయ్యగా ఉండును. నందనవనమున ఐరావతము, మాధవీలత, రంభ (అరటి చెట్టు) జన్మించి పెరుగుచుండును. ఈ క్షీరసాగరమున ఐరావతములు (మెరపులు), మాధవీ (లక్ష్మీదేవి), రంభ అను అప్సరస పుట్టిరి.............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-325,326.
0 comments:
Post a Comment