Pages

Lord Subrahmanya n Valli, Devasena part - 1

వల్లీ,దేవసేనా,సమేత సుబ్రహ్మణ్యస్వామి స్వరూపం - అంతరార్థం.


1. వల్లీ - సుబ్రహ్మణ్య స్వామి :-

వల్లీ అనే మాటకి తీగ, లత అని అర్థం.  తీగ అల్లుకొని   అలా పైకి వెడుతుంది క్రిందనే అలా ఉండిపోతే లాభంలేదు.  దానికో కొయ్యకావాలి ఆ కొయ్యని అల్లుకొని తీగ పైకి వెడుతూ ఉంటుంది.  పురాణాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణుడు చెట్టుగా మారిన ఘట్టం కూడా ఉంది.  లతా-వృక్షములు సాధారణంగా కలిసియుంటాయని చెప్పబడతాయి.  ఒక తీగ చెట్టుకి అల్లుకున్నట్టుగా వల్లీ సుబ్రహ్మణ్యుడిని అల్లుకుంటుంది.  పురాణాలలో సంకేతవాదాలు, ప్రతీకవాదాలు ఉంటాయి.  క్రిందన తీగ(అనగా మనలో  కుoడలిని) చుట్టలు చుట్టుకొని ఉంటే లాభం లేదు. ఆ తీగ పైకి పాకాలి.  మూలాధారం నుంచి సుషుమ్న అనబడే వెన్ను కొయ్యని అల్లుకొని పైకి పాకుతున్న శక్తిలతే వల్లీ.  కుండలినీ శక్తి అనబడే ప్రాణశక్తి చేత అల్లుకోబడిన ఆత్మస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు.  వల్లీ అనగా కుండలినీ శక్తి.


2. దేవసేన - సుబ్రహ్మణ్య స్వామి :-

యోగభాషలో, శాస్త్రభాషలో దేవతలంటే మన ఇంద్రియశక్తులు. అవి ఇంద్రియాధిదేవతలు.  మన పురాకృత సుకృతం బట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియంలో కూర్చుంటుంది.  దానితో మనం మంచి పని చేస్తే అక్కడి దేవత శభాష్ అంటుంది.చెడ్డపని చేస్తే ఛీఛీ అని తిడుతుంది.  అవి శభాష్ అంటే పుణ్యాలై, ఛీఛీ అంటే దోషాలై మనకి లభిస్తాయి.మనం చేసే పనులు ఏ  ఇంద్రియంతో చేస్తామో ఆ ఇంద్రియశక్తే పరీక్షిస్తూ ఉంటుంది.అవి శక్తిని ఇచ్చి సాక్షిగానే చూస్తూ ఉంటాయి.  నేత్రాలకి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కదానికి ఇంద్రియాధిదేవతలు ఉంటారు.  ఇన్ని దేవతలు శక్తులు మనలో ఉన్నాయి.ఒక సేనాపతి సేనలతో వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాడో మన శరీరంలో "నేను" అనేవాడు కూడా ఇంత సేన లేకపోతే వాడు పనిచేయలేడు.  కనుక మన ఇంద్రియశక్తులే దేవసేనలు.  వీటినన్నిటికి కలిపి ఒక నాయకుడులా నడిపించేవాడే మనలో "అహంరూపచైతన్యం", ఒకటున్నది.  అదే దీన్ని చూడు, దాన్ని విను అని ఇంద్రియాలకి చెప్తోంది.  మనలో ఉన్న ఆత్మచైతన్యమే ఇంద్రియరూప దేవసేనలని నడుపుతోంది.

3. వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు:-

ఇంద్రియరూప దేవసేనలకి పతియై, కుండలినీరూప వల్లీశక్తితో అల్లుకొని,మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే వల్లీదేవసేనాసమేత  సుబ్రహ్మణ్యస్వామి.  ఈ స్వామిని ఆరాధించటం వలన మనకు ఆత్మజ్ఞానం , పరమాత్మ తత్వం బోధపడుతుంది.
ఇంకా ఈ స్వామి గురించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాము.

 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online