Pages

బాల్యములో..శ్రీ కృష్ణభగవానునిఒక గొప్పలీల

భాగవతం, దశమస్కంధంలో 'ఉలూఖల బంధనం' అనే ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల ఉంది. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల ఇది.

బాల కృష్ణుడి అల్లరి అధికం కావడం చూసిన యశోద ఇలా అనుకుంది - 'అయితే, గోపికలు చెప్పింది యథార్థమేనన్నమాట. వీడు చాలా అల్లరి చేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలని, తాడుతో కట్టి పడేస్తానని' అనుకుంది. అక్కడున్న గోపకాంతలందరూ యశోద ఏమి చేస్తుందా? అని పరిశీలిస్తున్నారు. అపుడు యశోద, 'కన్నయ్యా! ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తానని' అంది. అలా, అనగానే కోతులకు పెడుతున్న వెన్నను వదిలేసి ఆ రోలు మీదనుంచి దూకేశాడు కృష్ణయ్య. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరకు వెళ్ళింది. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటున నక్కేవాడు. 'అమ్మా నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను, ఎవరింటికీ వెళ్ళను, వెన్న తిననే తినను, నన్ను కొట్టకని' కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అలా, కళ్లు నులుపుకోవడంతో అరచెయ్యి, బుగ్గలు అంతా కాటుక అయిపొయింది. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు, బ్రహ్మదేవుడు ముక్కున వేలేసుకుని చూశారు. ఆ బాలకృష్ణుడు, ఆ రోజున అంత భయాన్ని నటించాడు.

యశోద ఎంత అదృష్టవంతురాలో! ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అపుడు ఆమె కృష్ణుడిని కట్టెయ్యడం కోసమని, అక్కడ కవ్వానికున్న తాళ్ళు తీసి, కన్నయ్య బొజ్జ చుట్టూ తిప్పుతే, రెండంగుళాలు తక్కువ పడింది. ఎన్ని తాళ్లు తెచ్చి ముడివేసి కట్టినా, రెండంగుళాలు తక్కువ వస్తోంది. అప్పుడు పోతనామాత్యుడు అద్భుతమైన పద్యం వ్రాస్తాడు.

                      *చిక్కడు సిరి కౌగిటిలో,*
                      *జిక్కడు సనకాది యోగి చిట్టాబ్జములం*
                      *జిక్కడు శృతిలతికావలి*,
                      *జిక్కెనాతడు లీల దల్లి చేతన్ రోలన్.*

'ఆయన, లక్ష్మీదేవి కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కడు, వేదమంత్రాలకు దొరకడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడ్డాడని' అంటాడు.

అలా, చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అపుడు నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, శరీరం పైన శ్రీవత్స చిహ్నం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది. రెండంగుళాల తాడు తక్కువ అవడం అంటే? భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావాన పెరగాలి. అపుడు మనం చేసిన పూజకు ఫలితముంటుంది. ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అనే రెండు భావనలను మరిచిపోవాలి. అపుడు పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళాలు తక్కువ అవడం. (ఇక్కడ కొంతమంది వ్యాఖ్యాతలు ఆ రెండంగుళాలే అహంకార, మమకారాలు. వీటిని మరచిపోతే పరమాత్మ మన మనస్సులో బంధింపబడుతాడని అంటారు. ఇది కూడా బాగుంది). అట్టి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత మాత్రమే పరమాత్మ వశుడవుతాడని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. ఇక్కడ పరమాత్మ యశోద ప్రేమపాశానికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.⁠⁠⁠⁠ అలాగే, అంతటి నిష్కల్మషమైన భక్తిని చూపించి చరితార్థులైన భక్తాగ్రగణ్యులు మన భారతదేశంలో ఎంతో మంది జన్మించి చరితార్థులయ్యారు. వారిని ఇప్పటికీ స్మరిస్తూనే ఉన్నాము ...................................... సేకరణ......

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online