వశిష్ఠుని కోసం శ్రీమహావిష్ణువు వెలసిన... విశిష్ఠ క్షేత్రం!
తెలుగు నేలపై వెలసిన అతి పురాతన నారసింహ క్షేత్రాల్లో మహా విశిష్టమైనది అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ధామం. తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ఠ గోదావరి తీరాన కొలువయ్యారు స్వామి వారు.
సముద్రంలో గోదావరి అంతర్వేదికగా ఉండటం మూలాన ఈ క్షేత్రం 'అంతర్వేది' అయింది. ఇక ఈ నారసింహ క్షేత్రం 'సఖినేటిపల్లి' మండలం పరిధిలోకి వస్తుంది. సఖినేటిపల్లి అనే పేరు వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది.
త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మతో కలసి లక్ష్మణ సమేతుడై ఇక్కడి స్వామివారి దర్శనానికి వచ్చాడు. ప్రస్తుత సఖినేటి పల్లి లో విరామం తీసుకున్నాడు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో, ''సఖీ! నేటికి ఈ పల్లెనే మన విడిది'' అని పలికాడు. ఆ కారణం చేతనే ఈ ప్రాంతానికి సఖినేటిపల్లి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.
అంతర్వేది క్షేత్ర స్థలపురాణం ప్రకారం కృతయుగంలో తనని బ్రహ్మర్షిగా గుర్తించని వశిష్ట మహర్షి పై విశ్వామిత్రుడు కోపాన్ని పెంచుకున్నాడట. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త లోచనుడితో వశిష్ట మహర్షి 100 మంది కొడుకులను కౌశికుడు చంపించాడు. పుత్ర శోకాన్ని భరించలేక పోయిన కుంభ సంభవుడు నారసింహ స్వామిని వేడుకున్నాడు. దుష్ట శిక్షణ చేయడానికి నృసింహ మూర్తి ప్రత్యక్షమయ్యాడు.
రక్త లోచనుడికి తన రక్తం నుంచి మరి కొందరు రాక్షసులు పుట్టుకొచ్చే వరం ఉండేది. దానికి విరుగుడుగా నరసింహ స్వామి తన సోదరి అయిన 'అశ్వ రూఢాంబ'ను రంగంలోకి దింపాడు. ఆమె రక్త లోచనుడి రక్తం ఒక్క బొట్టు కూడా కింద పడకుండా యుద్ధరంగమంతా తన నాలుకను విస్తరించింది. అప్పుడా రక్త లోచనుని ఉగ్ర నారసింహుడు సంహరించాడు. వశిష్ట మహర్షి కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై అక్కడే వెలిశాడు కూడా. అయితే, పురాణంలో పేర్కొన్న అశ్వ రూఢాంబయే ప్రస్తుతం 'గుర్రాలక్కమ్మ' పేరుతో ఇప్పటికీ పూజలందుకుంటోంది.
అంతర్వేదీశ్వరునికి కేశవదాసు అనే పశువుల కాపరి మొట్ట మొదటగా చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాడని స్థానికులు చెబుతారు. కాలక్రమంలో అదే ప్రసిద్ధి చెందుతూ వచ్చి మొగల్తూరు రాజైన శ్రీ రాజా బహద్దూర్ వారి ఆధ్వర్యంలో, దాతల సాయంతో మహాభివృద్ధి పొందింది.
అంతర్వేదిలో ఏటా మాఘ మాసాన పది రోజులు స్వామివారికి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. 'భీష్మ ఏకాదశి' నాడు లక్షలాదిగా నృసింహ భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామిని సేవించి తరిస్తుంటారు. మాఘంలోనే కొన్ని రోజులపాటు సూర్యాస్తమయ వేళ భానుని అరుణ కిరణాలు నరసింహ స్వామి పాదాలను స్పృశిస్తాయి.
అంతర్వేది క్షేత్రంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి, భూదేవి, రాజ్యలక్ష్మీ తాయారు, సంతాన వేణుగోపాల స్వామి వార్లను కూడా దర్శించుకోవచ్చు.
0 comments:
Post a Comment