Pages

🙏🌹🌹శ్రీమద్ భాగవతం లో కొన్ని విషయాలు..ఓం నమో భగవతే వాసుదేవాయ జయ జయ శ్రీ కృష్ణ జైజైశ్రీరామ🌹🙏

 [5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 బలి భూదానము చేయునపుడు వామనుని కేవల బ్రహ్మచారి అని తలవక సకల భూతాంతర్యామిగా తలచి ధారదత్తము చేసెను. కనుక వెంటనే శ్రీహరి త్రివిక్రముడై దర్శనమిచ్చెను. తనది అగు సమస్తమును అపహరించి తాను మిగులునట్లు చేసెను. దానికి మోక్షమే ఫలమయ్యెను. ఇతడు ఎచ్చట ఉన్నను అచ్చట మోక్షలోకము సాక్షాత్కరించి ఉండును. పై లోకముల వారికి కూడా మోక్షము అనునది కంటికి కనపడదు కదా! ఇట్టి వ్యామోహములు తీరిన బలి చక్రవర్తిని అధోలోకమున ఉంచెను. 

అంతర్యామిని చూచువానికి అంతర్యామి లోకమే గాని ఇతర లోకములు ఉండవు. లోకముల భేదములు, లేత ముదుళ్లు, మంచి చెడ్డలు వివేకించుకొనువానికి ఆ లోకములే ఉండును కాని అంత్యర్యామి ఉండడు. తుమ్ము, దగ్గు, ఆవులింత కలిగినపుడుగాని, కాలుజారుట, పడుట కలిగినపుడు గాని భగవంతుని నామస్మరణ చేయగల అంతర్యామి బుద్ధి కావలెను. అది కలవాడు మాత్రమే కర్మబంధముల నుండి  విడివడి జ్ఞానస్వరూపుడు అగును. అట్టి వాసుదేవుడు ఆత్మజ్ఞానమును ఇచ్చి భక్తులను పోషించునే గాని ఐహిక భోగ భాగ్యములను ఎట్లు ఒసగునని భావింపరాదు.

అతడు పూర్వము బలిచక్రవర్తిని ఎందులకు యాచించెను? ఇంద్రునికి ఇచ్చుటకు కాదు. బలిని సమస్త సంపదల నుండి వేరు చేసి తనను తానుగా నిలబెట్టుటకు. అట్లు నిలబెట్టబడినపుడు మనస్సు ఎట్లు పని చేయవలెనో అదే నిజమైన పరీక్ష. తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము:..............✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-113

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము: దేనియందును కోరిక లేకుండుట భగవంతుని లక్షణమని ఇప్పటికి తెలిసికొంటిని. ఇంద్రాది దేవతలు ఏ కారణము చేత దేవుడు కాలేకపోయిరి? ఇంద్రుని తమ్మునిగా పుట్టినను వామనుడే దేవుడు ఎందులకు అయ్యెను? ఇంద్రాదులు స్వర్గమును కోరి ప్రార్థించిరి. కనుక దేవతలయ్యి దేవుడు కాలేకపోయిరి. వామనునకు కోరికయే లేదు. ఇంద్రుడు కోరెనని యాచించెను. తనకు ఏమియు లేనివాడే సమస్తము తాను అగును. చూడుడు! కాలమునందు సమస్తము పుట్టుచున్నది. అందేదియు కాలమునకు అక్కరలేదు‌. మనువులు మన్వంతరములు కాలములోని భాగములోని భాగములే కదా! అట్లని కాలము మన్వంతరాధిపత్యము కోరుచున్నదా! 


పూర్వము మా తాత ప్రహ్లాదుని చూచి ఈ వామనుడే నృసింహ రూపము పొందినపుడు నీకేమి కావలెనని ప్రశ్నించెను. లోకత్రయాధిపత్యము ఇమ్మందువా అని ప్రశ్నించెను. అప్పుడు ఈ దేవుని ఆజ్ఞ శిరసావహించి కూడా మా తాత యేమని కోరెను? తండ్రి రాజ్యము తనకు ఇమ్మని కోరలేదు. భగవంతుని సేవ నిరంతరము చేయుటకు అవకాశము ఇప్పింపని కోరెను‌. దానితో అతని జన్మ చరితార్థమైనది‌. భగవంతుడు ప్రహ్లాదునే కాక హిరణ్యకశిపుని కూడా అనుగ్రహించి తన తేజస్సుగా స్వీకరించెను. ఇట్లు పలికిన బలిచక్రవర్తి ఇంటి ద్వారమున నారాయణుడు శంఖ చక్రగదా పాణియై కాపుగా ఉన్నాడు. అతడు తన వారుగా శరణుజొచ్చు వారి యందు జాలిపడి ఏదియైనను చేయవచ్చును. ఒకమారు రావణుడు బలిచక్రవర్తి శాసనము ఉల్లంఘించి పాతాళముపై దండెత్తుటకు వచ్చెను. బలి ఇంటి ద్వారము కడ కాపున్న నారాయణుడు పాదాంగుష్ఠముతో నెట్టెను. రావణుడు పదివేల యోజనముల దూరమున పడెను‌. ఓ పరీక్షిన్నరేంద్రా! ఈ ప్రహ్లాదుని, వారి వంశమును గూర్చిన వృత్తాంతమును ముందు సవిస్తరముగా వివరించెదను. 


(బలి అనగా బలవంతుడు‌. ఇతడు స్వాతిశయమునకు సంకేతము‌. స్వాతిశయముతో అన్ని లోకములు గెలువవలెననిపించును. సద్గుణములు అభ్యసించినను తన అంతటి సద్గుణవంతుడు లేడనిపించును. భక్తిని అభ్యసించినను తన వంటి భక్తుడు లేడనిపించును. దానమిచ్చినను తనను మించిన దాత లేడనిపించును‌. ఈ విధముగా బలి అన్ని లోకములను జయించెను. అట్టి వానికి తనది అను సమస్తము తొలగించినచో స్వాతిశయమునకు తాను తప్ప మరి ఏదియు మిగలదు. అదియే భగవంతుడు. దానితో స్వాతిశయము త్రొక్కబడును. అటుపైన సమస్తమునకు అధిపతి అగును. వాని మనస్సే ఇంటిద్వారము. అచ్చట భగవంతుడే ఉండును గాని స్వాతిశయము ఉండదు. అట్టివాని మనస్సు దగ్గరకు పరదారాసక్తి మున్నగు రావణ లక్షణములు చేరలేవు)............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-114,115.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻దానికి దిగువ మహాతలమునందు ఈ సర్పములన్నియును కట్టలు కట్టుకొని తిరుగుచుండునట. అవి కామ క్రోధ పూరితములై ఉండును. అనగా దేహముల యందు గుహ్యస్థానమున కామక్రోధాదులకు కారణములైన శక్తులున్నవి. వాని సృష్టి ఈ భూగర్భమున మహాతలము నందు జరుగుతున్నది. 


అందు కుహకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలగు సర్పరాజులు సూక్ష్మదేహములు కలిగి తిరుగుచుందురు. విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు అన్నచో వారికి భయము. వారు దారా పుత్రులతో, మిత్రులతో, బంధువులతో సుఖపడుచున్నప్పుడు కూడా గరుడుని వలన భయము పోదు. (ఉదయించుచున్న సూర్యునకును, ఈ నాగలోక వాసులకును బద్ధవిరోధము. సూర్యుడు అస్తమించిన వెనుక వీరందరును రాత్రి జరుగుచున్న భూగర్భము నందు మేలుకొని ఉందురు. కనుకనే పశ్చిమ దిక్కు కద్రువగా, తూర్పుదిక్కు వినతగా పనిచేయుచుండును. సూర్యుడు వినతాసుతుడై ఊర్ధ్వగమనము చేయును. సూర్యాస్తమయ సమయమున చీకటులే సర్పలోక ప్రజ్ఞలై తలత్తును. అందు చీకటుల నుండి పుట్టిన సర్పములు కన్నములలో వసించును. వానికి మూలములైన నాగలోక వాసులు భూగర్భమున చీకటి వైపున సంచరించుచుందురు. 


అహోరాత్ర గమనమున జ్యోతిర్మయమైన అండము నుండి సూర్యుడు గరుత్మంతుడై ఉదయించును. తమోమయమైన రాత్రి భాగపు అండమున చీకటులు సర్పములై సంచరించుచుండును. ఈ రెండింటి నుండియే జీవుల దేహమున ఊర్ధ్వగతి, అధోగతి కలుగుచున్నవి. గరుడుడు శ్వాసరూపమున ఓంకారము అను పరమాత్మను మూపున గొనివచ్చును. సర్పములు జీవిని దేహ నిర్మాణమునకై గర్భమున బంధించును. ఊర్ధ్వగతికి ప్రణవ స్వరూపమైన ఆత్మజ్ఞానమును, అధోగతికి కామస్వరూపమైన గర్భధారణమును కారణములైనివి. ఇట్లు సృష్టికి రెండు యానములు కల్పించుటలో సర్పములు‌ ఒక ప్రక్కను, గరుడుడు ఒక ప్రక్కను అధి దేవతలుగా పనిచేయుచున్నారు)..............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻మహాతలము క్రింద రసాతలము ఉన్నది. అచ్చట నివాతకవచులు, కాలకేయులు అనబడు దైత్యులును, దానవులును కలరు. వారి రాజ్యము పేరు హిరణ్యపురము. వారు దేవతలకు శత్రువులు. మహా సాహసము గలవారు; చాలా ప్రతాపము గలవారు. అంతర్యామి తేజస్సునకు భయపడి వారందరును యీ లోకమున దాగి పుట్టలలోని పాముల వలె ఉన్నారు. ఇంద్రుని దూతి అగు సరమాదేవి అచ్చట నుండి ఏవో మంత్రములు ఉచ్చరించుచుండును. ఆ వాక్యములకు వారందరును భయపడుచుందురు. 


(నివాత కవచులు అనగా గాలి దూరని కవచము గలవారు. కాలకేయులనగా కాలగతికి లెక్కలు కట్టువారు. ఈ రెండు విధముల జీవులును తమోమయులై భూగర్భమున వసించుచున్నారు. అచ్చట సరమ అనబడు ఆమె దేవతల కుక్క, ఆమె భూగర్భ ద్వారమునందు నిలబడి అధోలోక తమోమయ జీవులు ఊర్ధ్వ లోకములకు ప్రసరింపకుండ కాపాడుచుండును. కనుక ఆమె ఇంద్రుని దూతిగా వర్ణింపబడినది. ఊర్ధ్వలోకములకు, అధోలోకములకు చరించుచుండు ప్రజ్ఞ అని అర్థము. 


మన దేహముల యందు ఈమె మూలాధారము ప్రదేశము నుండి వాక్కును ఉచ్చరించుచు ప్రథమ ప్రయత్నమైన మంద్రముగా పనిచేయుచుండును. ఉచ్చరింపబడిన సంకల్ప రూపమైన ప్రయత్నము మనలను అజ్ఞాత ప్రజ్ఞ‌ నుండి జ్ఞాత ప్రజ్ఞకు కొనితెచ్చెను. దానితో నాదము ఏర్పడి చైతన్యము వెలుగుగా ప్రస్తారము చేయబడును. తత్ఫలితముగా వైఖరీవాక్కు, అక్షర పంక్తీ, పదములు, అర్థములు మున్నగు వెలుగుల లోకములలోనికి జీవుడు మేల్కొనును. దీనికి మూలమైన భూగర్భలోకమే రసాతలము)............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-119.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఆ బలి రాజ్యమైన సుతలమునకు క్రిందుగా తలాతలమున్నది. దానికి అధిపతి మయుడు‌. అతడు అసుర పట్టణములను నిర్మించిన వాడుగా ప్రసిద్ధి చెందియున్నాడు. పూర్వము పరమేశ్వరుడు త్రిపురములను దగ్ధము చేయుటకై విష్ణుమూర్తి తన బాణముగా ప్రయోగించెను. విష్ణువు మూడు పురములను దగ్ధము చేసెను. తనను శరణుజొచ్చిన మయుని కాపాడి తలాతలమునకు నిర్మాతగా ప్రతిష్ఠించెను. అప్పటి నుండి ఈ మయుడు నిర్భయుడై ఉన్నాడు. 


తలాతలామునకు దిగువగా మహాతలమున్నది‌. అచ్చట కద్రువ సంతతియైన సర్పములు పెక్కు శిరస్సులతో తిరుగుచుండును. (సర్పములనగా అధోలోక వాసులైన సూక్ష్మదేహ జీవులే గాని పాములు కావు‌. ఈ జీవులు రెక్కలతో కూడిన సర్పములై ఎగిరి భూలోకమును ఆరోహించునని చెప్పబడినది. వారే ఈ భూమిపై దేహములు ధరించిన జీవులకు అమృతత్వమును చేకూర్చుచున్నారు. అంకుర శక్తిగా విత్తనముల లోనికిని, శుక్రలోక జీవులుగా భూలోక వాసుల దేహముల లోనికి దిగివచ్చుచున్నారు. అందుండి శుక్రధాతువునందలి కణములుగా ఏర్పడి దేహములు అనబడు పురములను నిర్మించు మాయను ఉపదేశమందుచున్నారు‌. 


పరమేశ్వరుడు ప్రళయమునకు అధిపతి. విష్ణువు స్థితికి అధిపతి. ప్రళయము కలుగవలెనన్నచో సృష్టికి స్థితి ఉండవలెను. కనుక విష్ణువునే బాణముగా ప్రయోగించెను. అటుపైన మూడు లోకముల నిర్మాణము గల త్రిపురములను దేహములను శివుడు నిత్యము దగ్ధము చేయుచున్నాడు. దేహధారుల‌కు మృత్యుభీతి ఏర్పడినది. దాని నుండి నిర్భీతి కలుగుటకు శుక్రకణములు దిగివచ్చి జీవునకు పుత్రరూపమున క్రొత్త దేహము కల్పించుచున్నవి. అప్పటి నుండి ఇది తెలిసినవారికి నిర్భీతి ఏర్పడుచున్నది. దేహమందు కూడా తలాతలము అనబడు అధోలోకమున ఈ సర్పములు శుక్రరూపులుగా ఏర్పడుచున్నవి).............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻రసాతలమునకు దిగువ పాతాళమున్నది. అందు నాగకులము వారందరును సంచరించుచుందురు. అచ్చట వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ర్టుడు, శంకచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు మహానాగములుండును. వారిలో ఐదు తలలు గలవారున్నారు. వారు తమ మణుల కాంతులతో పాతాళమును వెలిగించుచున్నారు. 


(ఇది భూగర్భమునందలి నట్ట నడిమి భాగము. భూ పరిభ్రమణము కొరకు గిరగిర తిరుగుచున్న స్వయం వాహక శక్తులుగా ఇందలి సర్పములు పనిచేయుచుండును. వారు ఆ లోకమందలి జీవులుగానే గాక అధిదేవతలుగ కూడా ఉన్నారు. మిగిలిన లోకముల వారు వేర్వేరుగా ప్రజ్ఞల యందు మేల్కొనుచుండగా పాతాళవాసులు అంతర్యామి ప్రజ్ఞ యందు మేల్కొని ఉన్నారు. కనుకనే అచ్చటి శేషుడు అంతర్యామికి శయ్య. అచటి వాసుకి పరమేశ్వరుని కంఠహారము. 


భూ పరిభ్రమణము కల్పించి భూమిని వహించుచున్నవాడు శేషుడు. ఈ పరిభ్రమణమున కాలప్రజ్ఞను ఉత్పాదించి ఆయుర్దాయములు ఏర్పరచి మృత్యువును కల్పించుచున్నవాడు వాసుకి. భూలోక వాసుల దేహములందు శేషుడు మూలాధారమునకు దిగువ కందమనబడు మూలమునకు పైన ఉండును. ఈ దేహమందలి పృథివీ తత్త్వము చెదరిపోకుండ అతడు పట్టి ఉంచుచున్నాడు. ఇతనినే తాంత్రికులును, యోగులును కుండలినీ శక్తిగా వర్ణించుచున్నారు. జీవుని రూపమున దిగివచ్చు అంతర్యామికి దేహముగా ఇతడున్నాడు కనుక పాన్పుగా పనిచేయుచున్నాడని చెప్పబడినది)...........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-120,121.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻పాతాళలోకపు అడుగున శేషుడు ఉన్నాడు. ముప్పది వేల యోజనముల వెడల్పైన తోకచుట్ట కలిగి ఉన్నాడు. అతడు విష్ణుమూర్తి యొక్క శరీరము‌. అతడే అనంతుడు అనబడుచున్నాడు. అతడే సంకర్షణుడు అనబడు వ్యూహముగా పనిచేయుచున్నాడు. 

అతని శిరస్సున భూగోళము తెల్లని ఆవగింజ వలె నిలబడి ఉన్నది. వాని చుట్టును భయంకరములైన సర్పములు పదునొకండున్నవి. అవి రౌద్రముర్తులు లేక రుద్రమూర్తులు అనబడును. సంహారమునకై వేచి ఉండి మూడేసి కన్నులు, శిరస్సులు కలిగి శూలహస్తులై నిలబడి వారు ఆదిశేషుని కొలుచుచున్నారు. (ఆదిశేషుడును, రౌద్రమూర్తులును భూ పరిభ్రమణమునకు అధిపతులు. అందు శేషుడు స్థితికర్తగా పనిచేయగా మిగిలిన వారు ప్రళయకాలమున భూగోళమునకు సంహారకర్తలుగా పనిచేయుదురు. గమనము కారణముగనే భూమి నిలబడి ఉన్నది. గమనము కారణముగనే చివరకు విడిపోవును.) 

వారందురును వినయముతో శిరస్సులు వంచి, ఆ శిరస్సులపై ఉన్న మణులతో శేషునకు నీరాజనములు సమర్పించుచుందురు..........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-122,123,124.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻సంకర్షణమూర్తియైన శేషుని చుట్టును చేరి నాగకన్యలు అనేక వాంచితార్థములు గలవారై అతని దివ్య శరీరమునకు చందనము కస్తూరి మున్నగు దివ్య సుగంధములను పూయుచుందురు. అతని దివ్య దర్శనమున వారి మనస్సులలో మన్మథావేశము కలుగుచుండును. 

అభిలాషతో వారు చిరునవ్వులు వెలయించి, సిగ్గుతో శిరస్సులు వంచి చూచుచుందురు. అనంత గుణములు గల శేషుడు తన క్రోధమును ఉపసంహరించుకొని లోకములకు క్షేమము కోరుచు నడుమ నిలబడి ఉండును. సురలు, అసురులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరము అతనిని ధ్యానము చేయుచుందురు. అతడు సంతోషాతిశయమున అర్థనిమీలిత లోచనుడై ఉండును. వినుటకు ఇంపైన గీతములు, వాద్యములు విని ఆనందించుచు పరిజనులను మిక్కిలి స్నేహముతో చూచుచుండును. అప్పుడే త్రుంపి తెచ్చిన తులసీ దళముల వాసనలతోను, పుష్పపరిమళమిలతోను కూడిన వైజయంతీ అను వనమాలను ధరించి ఉండును. దాని పరిమళములకు తేనేటీగలు మూగుచుండును. 

ఆదిశేషుడు నీలవర్ణములైన అంబరములను ధరించి, హలములను దాల్చి ఉండును. ఇతడు మహేంద్రుడో, శివుడో అని జనులు పలుకుచుందురు. మోక్షము కోరినవారు వానిని పీతాంబరునిగా ధ్యానము చేయుచుందురు. ఆధ్యాత్మ విద్యను ఉపదేశించి ఆనందమునకు అడ్డుగా హృదయమునందు ఉన్న ముడిని అతడు త్రెంపును. కనుక తుంబురుడు మున్నగు మునిశ్రేష్ఠులతో కలసి నారదుడు బ్రహ్మ సభ యందు నిలబడి ఇట్లు స్తుతించుచుండును:..........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-125.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 (1.పాతాళమునకు అధిదైవముగా ఆది శేషుడు వర్ణింపబడెను. ఇతనిని ధ్యానించువారు తమ తమ కోరికలను బట్టి భోగమునో మోక్షమునో పొందుదురని చెప్పబడెను. ఇచ్చట ఆదిశేషుడు నారాయణుని మూర్తి అని ప్రతిపాదింపబడెను. ఇద్దరికిని భేదము లేదు. నారాయణుడు 

అంతర్యామి. అతని దేహమే శేషుడు‌. (మాస్టర్ ఎక్కిరాల వారి భాగ వతం  నుండి సేకరణ)


2.లోకముల హితము కోరి అతడు భూమిని భరించుచుండెనని చెప్పబడినది. అనగా భౌతిక లోకము లేనిచో మిగిలిన లోకములలోని సృష్టికి స్థితి లేదు‌ భౌతిక లోకమే సృష్టి యొక్క స్థితికి కారణము.


3.భూగర్భమున దిగువగా పాతాళమున ఉన్న శేషునకు పడగల పైన సూక్ష్మమూర్తిగా భూగోళము ఉన్నట్లు వర్ణింపబడినది. భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము భూ పరిభ్రమణమునకు కారణము. ఈ భూపరిభ్రమణములే చుట్టలై అంతకంతకు వ్యాపించుచు భూగోళమును దాటి ఆకాశగోళము అందంతటను నిండియున్నది‌. కనుక అతని పడగలపై భూమి ఉన్నది‌. తోక చివరి భాగము పాతాళమున ఉండగా పడగల యందు మిగిలిన లోకములన్నియు అమరి ఉన్నవి. ఇతడు అంతర్యామి మొదటి అవతారము. కనుకనే ఆదిశేషుడు అనబడును. తోకయనగా సూక్ష్మము లేక అణుత్వము. పడగలనగా బ్రహ్మాండవ్యాప్తి. అణుత్వమునందు అతని తోక ఉండి బ్రహ్మండము అతని తలల యందు ఇమిడి ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-128,129.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online