Pages

A beautiful story depicting the qualities of Brahma Vishnu Maheswara

మాఘపురాణము 28వ అధ్యాయం
 
 
విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు.
 
 ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు.
 
 మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online