Pages

Bhogi - Godaa kalyanam

మనం ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై పాశురాములు ప్రతి రోజు ఉదయం అన్ని వైష్ణవ ఆలయాలలో, మన ఇండ్లలో కూడా పారాయణ చేస్తాము.  అసలు ఈ పాశురము రచించిన గోదాదేవి ఎవరో, భోగి పండుగ నాడు ఆమెకు, శ్రీరంగనాథునికి కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకుందాము .


 భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన "తిరుప్పావై " ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి శ్రీ గోదారంగనాథుల కృపకు పాత్రులుకావటం మనందరకూ అత్యంత ఆవశ్యకం.

 శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది. తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి "స్వామికి తానెంతయు తగుదును" అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది. ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కై౦కర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి . శ్రీస్వామి విష్ణుచిత్తులకు, స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి __ అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి . ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కై౦కర్యమును చేయసాగిరి.


యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి. తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను. అప్పుడు విష్ణుచిత్తులు "కొమడల్" అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు "అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే "జితాస్మి" అని, ఆమె హృదయమందంతటనుఆ రంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను.

 ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు "అదెట్లు సాధ్యము" అని చింతాక్రాంతులై నిదురింప __ ఆ శ్రీరంగనాధులు స్వప్నమున  సాక్షాత్కరించి నీ పుత్రిక భూ జాత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును. వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతి౦చెదడు అని పలుకగా  విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి. అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.


ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాసు వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది. శ్రీరంగనాధుడు, స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసివాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము. శ్రీ గదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను, ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు. గోదారంగనాథుల వారి కల్యాణి గీతాన్ని నిత్యమూ అలపిద్దాం లోకకల్యాణానికి పాటు పడదాం.


కల్యాణ గీతిక
(కాంభోజ రాగము _ త్రిపుట తాళము )
ప .. _ శ్రీ గోదారంగనాధుల కళ్యాణము గనరే
 అ..ప.. _ శ్రీ కల్యాణముగని _ శ్రీల భిల్లరే!
చ.. _ ఆకాశమే విరిసి _ పందిరి యైనది
 భూదేవియే మురిసి __ అరుగు వేసినది
 అష్టదిక్కులు మెరసి _ దివిటీలు నిలిపినవి
 అష్టైశ్వర్యములు తరలి __ నిలువెల్ల కురిసినవి....
చ ... విష్ణు చిత్తుని కన్య విష్ణువునే వలచినది
 నిష్టతో మార్గళి వ్రతము చేసినది
 ఇష్టసఖులను మేల్కోల్పి _ వెంటగోన్నది
 జిష్ణుని హితకరు కృష్ణుని చేబట్టినది
 చ .... జీవాత్మయే పరమాత్మకు అంశమ్మని చాటినది
 శేషి శేషభూతులు పరమార్ధము తెలిపినది
 దివ్య మంగళ విగ్రహ సాయుజ్యము నరశినది
 దివ్య ద్వయ మంత్రార్ధంబిలను __స్థాపించినది
 చ ... శ్రీ గోదా రంగనాథుల కల్యాణ గుణ విభవము
 శ్రీ ద్వయ మంత్ర రత్నమ్మున కన్వీయ మీజగము
 ఇదిగనిన అనుసంధి౦చిన శుభప్రదము
 మదినిపాడరె _ రంగనాథుని గీతము జయము జయము
 అండాళ్ దివ్య తిరుగడిగళే శరణమ్


 ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవస్వామివారికి స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికిf పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.

గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.  శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద అనే కావ్యం కూడా ఈ ఆండాళ్ చరితమే.  ఈ విధం గా తన భక్తి తో ఆ భగవంతుడినే భర్త గా పొంది శ్రీవైష్ణవ సంప్రదాయం లో అతి ముఖ్యులైన 12. మంది ఆల్వారు  లలో ఆమె కూడా ఒకరు గా పూజించ బడుతోంది.  ఆమె యొక్క దివ్య చరితం వలన మనకు భగవద్భక్తి యొక్క విశిష్టత తెలుస్తోంది.  మనం కూడా భగవంతునికి భక్తి అనే పూదండలను సమర్పించి ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాము.
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online