Pages

Who is Vathapi Ganapathi

*వాతాపి గణపతి అంటే!

కర్ణాటక సంగీతంలో ‘వాతాపి   గణపతిం భజే’ అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితులవారి కృతి వినని తెలుగువారు అరుదు. ఒకానొక సందర్భంలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం మొదలవుతున్నా... ఈ కీర్తనతోనే శుభారంభం చేసేవారు. ఇంతకీ ఈ వాతాపి గణపతి ఎవరు!


కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఒకప్పుడు చాళుక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది. బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి, వీరికి బాదామి చాళుక్యులు అన్న పేరూ ఉంది. ఈ చాళుక్యులకీ, పల్లవులకీ నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వారిది పైచేయి అయితే ఒకోసారి వీరిది పైచేయిగా ఉండేది. అలాంటి ఒక పోరులో పల్లవులది పైచేయి అయ్యింది.

ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్లి తిరువారూర్‌ జిల్లాలోని ‘తిరుచెన్‌కట్టంకుడి’ అనే ప్రాంతంలో ప్రతిష్టించారు.

బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు.

నిజానికి వాతాపి అంటే మరణం అనీ, ప్రాణులను హరించేవాడు అని అర్థం ఉంది. విఘ్ననాయకుడు అయిన ఆ గణపతికి ఇలాంటి బిరుదమేమిటా అని ఆశ్చర్యం కలుగక మానదు. పైగా ఈ కృతిలో సమస్త ఆత్మలూ సేవించుకునే దైవంగా ఆ గణపతిని కీర్తిస్తున్నారు దీక్షితులవారు. తనను నమ్మి సేవించేవారి మృత్యువును ఆయన కోరుకుంటాడా! అందుకు సమాధానంగా తొలి చరణంలోనే ఒక భావం కనిపిస్తుంది.

‘మూలాధార చక్రంలో వసించు గణపతీ’ అంటూ ఆయనను స్తుతిస్తారు దీక్షితులవారు.

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఈ మూలాధారం కుండలినిలోని తొలి చక్రం. మూలాధారంలో కనుక ఎరుక మొదలైతే, మనిషిలో ఇహలోక వాంఛలు సన్నగిల్లిపోతాయి. భవబంధాల పట్ల మోహం నశిస్తుంది. కర్మలు దహించుకు పోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి బతికి ఉండగా మరణిస్తాడు. అతనిలోని శాశ్వతమైన ఆత్మ ప్రకాశించడం మొదలుపెడుతుంది. అలాంటి స్థితిని సాధ్యం చేసేవాడు కాబట్టే గణపతికి వాతాపి అన్న పేరు వచ్చి ఉంటుంది.

ఇక వాతాపి అన్న పేరు వెనుక మరో కథ కూడా స్ఫురిస్తుంది. పూర్వకాలంలో ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారివురూ ఘోర అరణ్యంలో సంచరిస్తూ, అటువైపుగా ఎవరన్నా మానవులు రాకపోతారా అని కాపుగాసేవారు. ఎవరన్నా మనుషులు అటువైపు రాగానే ఇల్వలుడు వారి వద్దకు బ్రాహ్మణవేషంలో వెళ్లేవాడు. ‘మా ఇంటికి వచ్చి అతిథి సత్కారాలను స్వీకరించ’మని ప్రార్థించేవాడు.

సహజంగానే అంతటి నిర్జనారణ్యంలో, తమకు ఆతిథ్యాన్ని ఇచ్చేవారిని చూడగానే మానవులకు పరమ సంతోషం కలిగేది. ఈలోగా వాతాపి తన కామరూప విద్య ద్వారా ఒక మేక రూపాన్ని పొందేవాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆ మేకను వండివార్చేవాడు ఇల్వలుడు. వచ్చిన అతిథులు ఆ మాంసాన్ని అలా భుజించారో లేదో... తనకు వచ్చిన సంజీవిని మంత్రాన్ని తల్చుకుని ‘వాతాపీ బయటకు రా!’ అంటూ తన సోదరుడైన వాతాపిని పిలిచేవాడు ఇల్వలుడు. వెంటనే అతిథి శరీరాన్ని చీల్చుకుంటూ వాతాపి బయటకు వచ్చేసేవాడు.

ఒకనాడు ఆ కీకారణ్యంలోకి అగస్త్య మహాముని ప్రవేశించాడు. యథాప్రకారం ఆయన వద్దకు బ్రాహ్హణవేషంలో వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు ఇల్వలుడు. కానీ అగస్త్యుడు సామాన్యుడు కాడు కదా! ఇల్వలుడిని చూసీ చూడగానే ఆయనకు విషయం బోధపడిపోయింది. ‘సరే పద’మంటూ ఆయన ఇల్వలుడిని అనుసరించాడు. అక్కడ ఎప్పటిలాగానే తన సోదరుడైన వాతాపిని భోజనంగా అందించాడు ఇల్వలుడు. కానీ ఈసారి అతని పథకం పూర్తిగా బెడిసికొట్టింది.

భోజనం ముగించుకున్న అగస్త్యుడు ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని తల్చుకోగానే వాతాపి కాస్తా జీర్ణమైపోయాడు. ఆపై ఏ సంజీవనీ మంత్రమూ పారలేదు. అలా వాతాపిని జీర్ణం చేసుకున్న ప్రదేశమే వాతాపి అనీ... అక్కడ వెలసినవాడు కాబట్టి, ఆయన వాతాపి గణపతి అయ్యాడనీ ఒక వాదన. అందుకు బలాన్ని చేకూరుస్తున్నట్లుగా ఈ కీర్తనలో అగస్త్యుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది.

కారణం ఏదైనా వాతాపి అన్న ప్రదేశంలో వెలసిన గణపతి కాబట్టి, ఆయనను
 ముత్తుస్వాములవారు ‘వాతాపి గణపతిం భజే’ అంటూ కొలుచుకున్నారనడంలో మాత్రం సందేహం లేదు.


 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online