Pages

Shani Thrayodasi - Things we should do

అమావాస్య ముందు
 శనిత్రయోదశి మరియు అనురాధ నక్షత్ర యుక్త శని త్రయోదశి కావడంతో విశేష మైనది గా చెప్పవచ్చు.


వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు వరుసగా "అష్టమ" , "అర్ధాష్టమ" , " ఏలినాటి శని " లతో బాధ పడుతున్న వారు.  ఉదయం "శన్యూష కాలంలో" అనగా తెల్లవారుజామున 5 to 6:30  మధ్యకాలంలో  లేదు " శని హోరలో"  అనగా ఉదయం 6:30 to 7:30  మద్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు.  సాయంత్రం "ప్రదోష వేళలో " అనగా 5:30 to 6:30 మధ్య కాలంలో  శివాలయం లో " నువ్వల నూనె " తో దీపారాధన చేసిన ఉన్నతమైన ఫలితాలు పొందుతారు.


శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు.
శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు.

ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి. అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు.  స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది.
 
ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు, శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్లు మండిపోయింది.
‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అంటూ కోపగించిన శనిభగవానుడు, శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు.


 శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే, తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శనిభగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు చిరునవ్వుతో.
 
శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ‘ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా, నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు’ అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశినాడు వచ్చే శనివారం రోజున, భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.


శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి

 నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం
 ఛాయా మార్తాండ సంభూతం నమామి శ్రీశనైశ్చరం.


ఈ శ్లోకం పఠించడం వలన అంతా మంచే జరుగుతుంది.  ఇతని వాహనం కాకి, నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం. వీటితో ఈ రోజు పూజించడం వలన శనిదేవుడికి ప్రీతిపాత్రుమవచ్చు. శని భార్య జ్యేష్ఠాదేవి. సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి. శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు.

 అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం. కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి. శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనదంటారు.

అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు. దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. కోణస్థ, పింగల తదితర శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం. శనిత్రయోదశి అయిన నాడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online