Pages

some predictions of Sri Bhagavatham coming true now

భాగవతంలో చెప్పిన ఈ 15 ఇప్పుడు జరుగుతున్నాయి!

ఇప్పుడు ఏం జరిగినా ‘‘సనాతన ధర్మం ముందే చెప్పింది’’ అనవచ్చునేమో! అష్టాదశ (18) పురాణాల్లో ఒకటైన శ్రీమద్భాగవతం చెప్పిన 15 అంశాలు ఇప్పుడు నిజమవుతున్నాయనిపిస్తోంది. కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణం ఎలా వివరించిందో చూడండి!

శ్లోకం : 12.2.1
మతం, నిజాయితీ, పరిశుభ్రత, సహనం, దయ, జీవించే కాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకూ క్షీణిస్తాయి. శక్తిమంతమైన కలి ప్రభావమే దీనికి కారణం.

శ్లోకం : 12.2.2
వ్యక్తి గుణగణాలను, ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతనికిగల సంపదే. అధికారంలో ఉన్నవారికే న్యాయం దక్కుతుంది.

శ్లోకం : 12.2.3
స్త్రీ, పురుషులు పైపై ఆకర్షణల కారణంగానే కలిసి ఉంటారు. వ్యాపార విజయానికి మోసమే ఆధారం అవుతుంది. శృంగార సామర్థ్యం ఆధారంగానే స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని నిర్ణయిస్తారు. కేవలం జంధ్యం మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది.

శ్లోకం : 12.2.4
వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని కేవలం అతని వద్ద పైకి కనిపించే గుర్తుల ఆధారంగానే గుర్తిస్తారు. వాటి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుంచి మరోదానికి మారుతూ ఉంటారు. సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్ర ప్రశ్నలు ఎదురవుతాయి. పదాల పడికట్టులో నైపుణ్యం ఉన్నవాళ్ళను పండితుడంటారు.

శ్లోకం : 12.2.5
డబ్బు లేని వ్యక్తిని అపవిత్రుడంటారు. కపటం, మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాశి అంటారు. నోటి మాటలతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కేవలం స్నానం చేసినంత మాత్రానికే బహిరంగంగా కనిపించడానికి అర్హులమైపోయామని జనం భావిస్తూ ఉంటారు.

శ్లోకం : 12.2.6
కొద్ది దూరంలో జలాశయం ఉన్న చోటునే పవిత్ర స్థలంగా భావిస్తారు. సౌందర్యం హెయిర్ స్టయిల్‌పై ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. కడుపు నింపుకోవటమే జీవిత పరమార్థం అవుతుంది. మొండిగా వ్యవహరించేవారే నిజాయితీపరులుగా ఆమోదం పొందుతారు. కుటుంబాన్ని పోషించగలిగేవాడు గొప్ప నిపుణుడిగా పేరు పొందుతాడు. కీర్తి కోసమే మత సిద్ధాంతాలను పాటిస్తారు.

శ్లోకం : 12.2.7
భూగోళం అవినీతి జనంతో క్రిక్కిరిసిపోవడంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.

శ్లోకం : 12.2.9
ప్రజలు కరవుకాటకాలతో, మితిమీరిన పన్నులతో ఇబ్బందులు పడుతూ ఆకులు, చెట్ల వేళ్ళు, మాంసం, ముడి తేనె, పండ్లు, పువ్వులు, విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు. అనావృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనమవుతారు.

శ్లోకం : 12.2.10
చలి, గాలి, వేడి, వర్షం, మంచు వల్ల ప్రజలు తీవ్రమైన బాధలు అనుభవిస్తారు. ఇది చాలదన్నట్లు జగడాలు, ఆకలి, దాహం, వ్యాధులు, తీవ్రమైన ఆందోళనతో జనం చితికిపోతారు.

శ్లోకం : 12.2.11
కలియుగంలో మనిషి జీవిత కాలం 50 ఏళ్ళు అవుతుంది.

శ్లోకం : 12.3.42
వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు.

శ్లోకం : 12.3.41
కలియుగంలో జనం స్వల్ప విషయాలకే ఒకరిపై మరొకరు విద్వేషం పెంచుకుంటారు. చిల్లర నాణేల కోసమే అయినా విద్వేషం పెంచుకుంటారు. స్నేహ సంబంధాలను విడిచిపెట్టేస్తారు. తమ ప్రాణాలను కోల్పోవడానికైనా సిద్ధపడతారు. తమ సొంత బంధువులను హత్య చేయడానికైనా వెనుకాడరు.

శ్లోకం : 12.3.38
మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తారు. సన్యాసి దుస్తులు ధరించి, నియమ, నిష్ఠలతో వ్యవహరిస్తున్నట్లు డంభాలు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటారు. మతం గురించి తెలియనివారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు. మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

శ్లోకం : 12.3.36
సంపదను కోల్పోయిన యజమానిని సేవకులు వదిలేస్తారు. ఆ యజమాని సద్గుణాల రాశి అయినప్పటికీ సేవకులు విడిచిపెడతారు. సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమానులు వదిలించుకుంటారు. ఆ సేవకులు వారి కుటుంబాల్లో తరతరాలుగా పని చేస్తున్నప్పటికీ దయ చూపరు. పాలు ఇవ్వని ఆవులను వదిలించుకుంటారు లేదా చంపేస్తారు.

శ్లోకం : 12.3.32
నగరాల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తారు. నాస్తికులు ఊహాత్మక అర్థాలు చెప్తూ వేదాలను కలుషితం చేస్తారు. రాజకీయ నేతలు ప్రజలను పీడిస్తారు. పూజారులని, మేధావులని  పిలిపించుకునేవాళ్ళంతా తమ పొట్టలకు, మర్మాంగాలకు భక్తులుగా మారుతారు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online