Pages

Definition of a DAY according to Hindu Calendar

హైందవ కాలమానం ప్రకారం - "రోజు"

 
 నిరంతరం ఆగకుండా సాగిపోయే "కాలచక్రం"లో 'రోజు' అనేది ఎప్పుడు మొదలు అయినట్లు లెక్కించాలి? ఒక వృత్తం (చక్రం) లో లేదా Circle మీద మొదలు ఎక్కడ ఉంది  అంటే ఎలా చెప్పగలం? అలాగే మన 24 గంటల రోజులో నిజంగా ఒక కొత్త రోజు ఎప్పుడు మొదలు అయినట్లు లెక్కించాలి?
 హిందువుల/భారతీయుల కాలమానంలో "రోజు" అనేది సూర్యోదయంతో మొదలై మళ్ళీ మరుసటి రోజు సూర్యుడు ఉదయించే వరకు ఉంటుంది అని నిర్ణయించారు. అనగా ఒక పూర్తి పగలు ఒక పూర్తి రాత్రి అన్నమాట.


 కానీ నేడు మనం పాటిస్తున్న ఆంగ్ల కాలమానం ప్రకారం ఒక రోజు అనేది అర్ధరాత్రి 12 గంటలకు మొదలై మళ్ళీ మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఉంటుంది. అనగా కొంచెం రాత్రి ఒక పూర్తి పగలు మళ్ళీ కొంచెం రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. ఇందులో ఒక తిరకాసు ఉంది. జనవరి 10 తేది రాత్రి అని అన్నప్పుడు, అది ఏ రాత్రి?? 9వ తేది తరువాతి రాత్రి గురించా? లేక 11వ తేది కంటే ముందున్న రాత్రి గురించా? కాబట్టి అక్కడ మళ్ళీ మనం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.


 కానీ మన హైందవ పద్ధతిలో ఈ సమస్య రాదు. ఎందుకంటే మనకు ఒక రోజులో ఒకే పగలు ఒకే రాత్రి ఉంటాయి.
 
 ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే సూర్యోదయంతో రోజు మారడం అనేది కేవలం మనకు మాత్రమే కాదు యావత్ సృష్టిలోని జీవరాశికీ అది మార్పు అని గమనించగలం. పశువులు, పక్షులు, చెట్లు-పూలు ఒకటేమిటి సకల జీవరాశులు తమ తమ పనులను సూర్యోదయంతోనే మొదలు పెడతాయి.
మన గడియారంలో రాత్రి పన్నెండు దాటింది కదా, రోజు మారింది అని అర్ధరాత్రి పూట ఏ ఆవూ పాలివ్వదు; ఏ పక్షీ తన గూడు వదిలి ఆహారం కొరకు బయలు దేరదు; ఏ పూలచెట్టూ  తనకున్న పుష్పాలను వికసింప చేయదు.

 నిజానికి నేటికి కూడా మనం మన  రోజును  అర్ధరాత్రి పూట మార్చుకొన్నా , ఎక్కువ మంది యొక్క  దినచర్య మాత్రం సూర్యుడు ఉదయించే ముందు మొదలు అవుతుంది.

 కారు చీకటులను పటాపంచలు చేసి, జీవులలోని మత్తును మరియు బద్ధకాన్ని పారద్రోలే సూర్యభగవానుడి మొదటి కిరణాలు భూమిపై పడడంతో మన రోజు ప్రారంభం అవుతుంది.
 
 మన పండుగలు కూడా ఇలాగే ప్రారంభం అవుతాయి. అప్పుడు అనగా తెల్లవారుజామున ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి రంగులతో అలంకరిస్తే ఎంత గొప్పగా ఉంటుంది!

 ఇది అత్యంత శాస్త్రీయం కూడా సుమా. ఎందుకంటే అర్ధరాత్రి మనకు ఎటువంటి ఆలోచనలు వస్తుంటాయి తెల్లవారుజామున ఎటువంటి మానసిక స్థితి మనలో ఉంటుందో ఒక్కసారి అలోచించండి. అద్భుతంగా లేదు మన హిందువుల రోజును లెక్కించే పద్ధతి

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online