Pages

How to do fasting in kaarthika masam



*కార్తీకమాసంలో ఉపవాసం చేయాలనుకుంటే ఇలా చేయండి

*ముందుగా ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం*

ఉప అంటే  సమీపంలో అని,  వాసం అంటే ఉండటం అని అర్ధం . అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు ఉపవాసం చేస్తున్నామో తెలిసి ఉంటే తెలుస్తుంది. ఉపవాసం భగవదనుగ్రహం కోసం చేస్తారన్నది జగద్విదితమైన విషయం. కనుక ఉండవలసింది భగవంతుని సమీపంలో. ఇంటిపని వంట పని తగ్గితే సమయమంతా భగవద్ధ్యానంలో గడపటానికి వీలుగా ఉంటుంది. అప్పుడు వంటికి కూడా పని తగ్గుతుంది. బరువైన, అరగటానికి కష్టమైన ఆహారం తీసుకోక పోవటంతో జీర్ణ వ్యవస్థకి వెచ్చించాల్సిన శక్తి కూడా భగవద్ధ్యానానికో, పూజకో  వెచ్చించటానికి వీలవుతుంది. కడుపు నిండా తినగానే కునుకు వస్తుంది చాలమందికి.  ఎందుకంటే శక్తి అంతా జీర్ణాశయం దగ్గరకి వెళ్ళి పోయి ఉంటుంది. మెదడుకి శక్తి సరఫరా తగ్గుతుంది. దానివలన భగవంతుని ధ్యాస కుదరదు. Concentration.

అందుకే  ఉపవాసం అనే కాన్సెప్ట్ ద్వారా దేవునికి దగ్గర అవుతాము. ఇందులో శరీర ఆరోగ్య రహస్యం కూడా ఉంది. లంఖణం పరమ ఔషధం అన్నారు మన పెద్దలు. ఇలా వారానికో మాసానికో ఉపవాసం చేయడం ద్వారా    జీర్ణ వ్యవస్థ రిపేర్ అయ్యి బాగా పనిచేస్తుంది. మన ఋషులు ఆధ్యాత్మికము ద్వారానే   మన శ్రేయస్సు ఏర్పాటు చేసారు. ఇది గగ్రహించక కొంతమంది ఉపవాసం   పేరిట ఏదీ తినకుండా   మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు.

*ఉపవాసంలో రకాలు* :


👉 వండని పదార్ధాలతో ఉపవాసం : ఈ ఉపవాసం ఆహారపదార్ధాలకు బదులుగా పండ్లు, పచ్చికూరగాయలు తింటారు.

👉 పానీయాలతో ఉపవాసం : ఇందులో ఆహారానికి బదులుగా మంచి నీళ్ళు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, హెర్బల్‌ టీ, గోరువెచ్చటి నీరు, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం చేయడం .

👉 వండిన పదార్ధాలతో ఉపవాసం : ఈ తరహా ఉపవాసంలో ఉడికించిన కూరగాయలు, వండిన పెసరపప్పును, గింజలను తీసుకుంటారు.

👉 సంపూర్ణ ఉపవాసం : ఈ తరహా ఉపవాసం చేసేవారు మంచి నీళ్ళు కూడా తాగరు. జేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ఇలాంటిదే .

ఉపవాసం అలవాటు లేకుండా అప్పుడే కొత్తగా మెదలు పెట్టేవారు తక్కువ సమయం ఉపవాసం చేసి ఆ తరువాత ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నించాలి. ఏమి తినకుండా , ఒక్కసారి భోజనం చేసి లేదా ఆహార పదార్ధాలను కొన్నింటిని మినహాయించుకుని తినవచ్చు. ఉపవాసం పూర్తయ్యాక ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని మరువరాదు.

👉 ఉపవాస సాఫల్యత అది పూర్తయ్యాక తీసుకునే ఆహారం పైనే ఆధారపడి వుంటుంది. ఉపవాస సమయంలో పొట్టలో ఖాళీయైన స్థానంలో తిరిగి అధికంగా చేర్చినట్లయితే ఉపవాసం వల్ల ప్రయోజనం వుండదు. మితిమీరిన సమయంలో ఉపవాసం చేస్తే జీవక్రియను దెబ్బతీస్తుంది. జీర్ణ శక్తి తగ్గుతుంది. శరీరం బలహీన పడుతుంది. అందువల్ల ఉపవాసం ఎలా, ఎంతకాలం చేయాలనే విషయం తెలుసుకుని ఆచరించాలి.  ఉపవాసంలో తాజాగా తీసిన పండ్లు, కూరగాయల రసాలు మంచివి. శారీరకంగా, మానసికంగా బాధపడే సమయంలో ఉపవాసం ఉండకూడదు. అలాగే మహిళలు రుతుస్రావం, గర్భినీ సమయంలో, శరీరం బలహీనంగా, అలసటచెంది ఉన్న సమయంలో ఉపవాసం చేయడమనేది ఎంత మాత్రము మంచిది కాదు.

*ఈ విధమైన ఉపవాసాలు చేయవచ్చు*

👉 *ఏక భుక్తం* : అంటే ఒక పూట భోజనం చేయడం. ఉదయం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడంను ఏక భుక్తం అంటారు.

👉 *నిరాహారం* : రెండు పూటలా పాలు పళ్ళు మాత్రమే తీసుకొని వండినవి తినకపోవడం.

👉 *నక్తం* : ఇది చాలా విశేషం అయినది. ఉదయం నుండి పాలు పళ్ళు ఫలహారాలు మాత్రమే స్వీకరించి సాయంత్రం నక్షత్రాలు రాగానే భోజనం చేయడం. ఈ కార్తీకమాసంలో ఇది చాలా మంచిది.

*చివరగా ఒక మాట  భగవంతుని మైన మనసు లగ్నము చేయకుండా, భగవంతుని సమీపంలో ఏమాత్రమూ గడపకుండా  ఎంత   చేసినా వ్యర్ధమే.


 


 






















 

Kaarthika Puraanam - 6th chapter

 *కార్తిక పురాణం -


ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేథయాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.


సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||



అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ బోభోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.


లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

 పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.


ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.


అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన.


 తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.
ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.



ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.







 

The flowers which r used to worship Lord Shiva

కార్తీక మాసంలో  శివుణ్ణి ఏ పూలతో పూజించాలంటే?!!
 
 
*1) సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖ పుష్పములతో శివుడిని పూజించాలి.
* మోక్షం కోరేవారు దర్భలతో, శమీ పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో పూజించాలి.
* 2) దీర్ఘాయువు కోరేవారు దూర్వారముతో పూజ చేస్తే మంచిది.
* 3) సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్త పూలతో(ఎర్ర కాడలు ఉన్నది శ్రేష్ఠం) పూజించాలి.
* 4) భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో.. ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలి.
* 5) ధర్మానికి ద్రోహులైన శత్రు నాశనం కొకు జపాకుసుమాలతో(ఎర్రగులాబీలు) లతో పూజించాలి.
* 6) రోగనివారణకు కరవీర(గన్నేరు) తో పూజించాలి.
* వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజిపూలతో పూజించాలి.
* 7) శుభలక్షణసంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో పూజించాలి.
* 8) సుఖసంపదలు పారిజాతపుష్పాలతో పూజించాలి.
* 9) సర్వకామ్యాలకోసం శంఖుపుష్పాలతో పూజించాలి.
* 10) అవిసె పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునట.
* 11) చంపక(సంపెంగ), మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పములన్నీ శివుడికి సమర్పించవచ్చు

A beautiful gesture from these people we all should follow



This is such a beautiful n heart warming gesture from the people of these villages which we all should follow so that we can make the surrounds of us more beautiful n conducive for all the creatures of the nature to live.  Pls. live n let others live.  Make this world more beautiful.

kaarteeka puraanam chapter - 5

*కార్తిక పురాణం - 5వ అధ్యాయము*

ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్
 ద్రెళ్లక 'మీరు మే' మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ
 ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణున౦
 దుల్లము జేర్చి తారడవిను౦డుట మేలు నిశాచరాగ్రణి ||


ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానదాన పూజాన౦తరమున శివాలయమునన౦దుగాని, విష్ణ్వాలయమున౦దుగాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసినవారి సర్వ పాపములును నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీరపుష్పములు శివకేశవులకు సమర్పించినవారు వైకు౦ఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠి౦చినవారికీ విష్ణులోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకములో నొక్క పాదమైననూ కంఠస్థ మొనరించిన యెడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తీకమాసములో పెద్ద ఉసిరికాయలతో ని౦డి వున్న ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామమును యధోచిత౦గా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనంపెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించవలయును.
వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను - యని వశిష్టులవారు చెప్పిరి. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల కారణమేమి" యని ప్రశ్ని౦చగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.
కిరాత మూషికములు మోక్షము నొందుట
రాజా! కావేరీతీరమ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగా పెరుగుట వలన నీచసహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి "బిడ్డా! నీ దురాచారములకు అంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలువిధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయేకాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు"మని భోదించెను. అంతట కుమారుడు "తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమేకానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కాదా?" అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదానమిచ్చెను. కుమారుని సమాధానము విని, తండ్రి "ఓరీ నీచుడా! కార్తికమాస ఫలము నంత చులకనగా చుస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు యెలుకరూపములో బ్రతికెదవుగాక" అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి "తండ్రీ! క్షమి౦పుము. అజ్ఞానా౦ధకారములో బడి దైవమునూ, దైవకార్యములనూ యెంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాపవిమోచన మోప్పుడే విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపు"మని ప్రాధేయపడెను. అంతట తండ్రి "బిడ్డా! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పడియుండగా నీ వెప్పుడు కార్తికమహత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొ౦దుదువు" అని కుమారుని వూరడించెను. వెంటనే శివశర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్లువారు అక్కడనున్న యా పెద్దవటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్లుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తికమాసములో నొకరోజున మహర్షియను విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరినదిలో స్నానార్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలికచేత మూషికము వున్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టుతొఱ్ఱలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, "వీరు బాటసారులై వుందురు. వీరి వద్దనున్న ధనమపహరించవచ్చు"ననెడు దుర్భుద్దితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి "మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది? గాన, వివరింపుడు" అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్దామై యీ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరి౦చి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము. నీవును యిచట కూర్చుండి సావధానుడవై యాలకి౦పుము" అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీకమహత్మ్యమును శ్రద్దగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణాన౦తరము వారికి ప్రణమిల్లి తన పల్లెకుపోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణమంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది "మునివర్యా! ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడనైతి"నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీకపురాణమును చదివి, యితరులకు వినిపించావలెను.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఐదవ అధ్యయము - ఐదవ రోజు పారాయణము సమాప్తం.


 


 






















 

some imp mantras for Nagula chavithi puja

*రేపే నాగుల చవితి*
ఈ 9 మహా నాగుల పేర్లను చెబుతూ పుట్టలో పాలు పోయాలి.
ఓమ్ వాసుకి నాగాయ నమః🙏
ఓమ్ అనంత నాగాయ నమః🙏
ఓమ్ తక్షక నాగాయ నమః🙏
ఓమ్ కర్కోటక  నాగాయ నమః🙏
ఓమ్ శేష  నాగాయ నమః
ఓమ్ శంఖ పాల నాగాయ నమః🙏
ఓమ్ పద్మనాగాయ నమః🙏
ఓమ్ మహపద్మ నాగాయ నమః🙏
ఓమ్ కులుకి నాగాయ నమః

Naagula chavithi - pooja info


*నాగుల చవితి విశిష్టత*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

*పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ*
*సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!*
*అనంతాది మహానాగ రూపాయ వరదాయచ*
*తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !*

అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.

దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

*"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |*
*ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||*

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
 
తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్‌
 తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ!
అని చెప్పినట్లు...అలా మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది.


*యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |*
 *స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||*

*గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |*
 *తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||*

*శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |*
 *సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||*

*సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్ |*
 *సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||*

*అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |*
 *ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్ ||*

*మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |*
 *మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా  ||*


వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.

వ్రతం ఆచరించే పద్ధతి / ఫూజ చేయు విధానము : దైవారాధన ఒక నమ్మకము ... ఏనాడూ నమ్మకము మూడనమ్మకము కాకూడదు !. మూడనమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీయును . నమ్మకము ... మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ... , ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
 స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో
*"ఓం నాగేంద్రస్వామినే నమః"*
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.


దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి.బాలబాలికలు దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి వస్తుంది.

సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది.
శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.

"చలిప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.
భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.


 ''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-
''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.


హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.

నాగుల చవితికి మిగతా పండుగాల్లాగా ఇళ్ళకు సున్నాలు అవీ పూయకూడదు. ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చాకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు లేకపోతే చాక్ పీస్ లతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకీ, తలుపులకీ ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే .... అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించటానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగులచవితి రోజు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని వ్రాసి సర్పజాతిని కాపాడినవాడిని తలచుకోవడం జరుగుతుంది.

పాముల ఉపయోగాలు : ప్రతి జీవి ఇంకొక జీవికి ఏదోవిధం గా ఉపయోగపడుతూ ఉంటుంది . దీనినే సమన్వయ సహకారము (Symbiosis ) అంటాము . అన్ని జీవుల మాదిరిగానే పాములూ ' జీవపరిణామ క్రమము '(Theory of Evaluation of species(life))లో భాగం గానే ఉద్భవించాయి అని అనడంలో సందేహము లేదు నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.


ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్టదగ్గరవాడకండి.
పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.









 



 
 









 


 






















 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online