Pages

పదండి ముందుకు! పదండి తోసుకు! పోదాం, పోదాం, పైపైకి!

మరో ప్రపంచం,

మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదయాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడవునా గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీనదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు,
పదండి తోసుకు,
పోదాం, పోదాం పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
''హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం హరా!'' అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావవేగమున ప్రసరించండి!
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు,
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసల కాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
మరో ప్రపంచపు కంచునగారా
విరామమెరుగక మోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,

-శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి
హోమజ్వాలల భుగభుగలు?

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online