Pages

Hayagreeva jayanthi



శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి 

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫిటికాకృతిం  |
ఆధార0 సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

 శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకెల్లా ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతారము''. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని (శ్రీమన్నారాయణుని) ఉచ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైరభులు అనే రాక్షసులు అవతరిం చి, తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతియైన  ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి ద్వారా వరం పొందారు.

వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైరభులు బ్రహ్మ వద్దనుండి వేదములను అపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాక్కున్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి కవ్విస్తూ బాధించేవారు. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థన విని, తన దివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, “ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించు, అంతవరకూ నన్ను ఆరాధించు'' అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపించాడు.

వ్యాఖ్యా ముద్రం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే 
బిభద్బిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మం 
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగదీశః ||

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్చ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన ఆశ్వముఖదారి అయినటువంటి "హయగ్రీవ స్వామి'' 
అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదాలను, వేదవిద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించాడు. వేదాధిపత్యమును హ్రహ్మకు, సకలవిద్యాధిపత్యమును సరస్వతీదేవికి అప్పగించాడు. అప్పటినుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యాడు. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.



0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online