Pages

Drumstick tree benefits part - 2

వహ్వా... మునక్కాడ! 
సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే. 
‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది. 
శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట. 
‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి. 
‘ఏమోయ్‌... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది. 
నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ 
జీర్ణమయ్యేలా చేస్తాయి. 
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.
పూలు... తేనెలూరు..! 
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి..! 
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు. 
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...! 
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ 
ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు. 
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు, 
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ  ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online