*కనుమ పండుగ* శుభాకాంక్షలు
కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
ఈ రోజున ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా.
ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.
సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి"ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.
సంపదలకు ... సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించడమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో బసవన్నలు రైతులకు ఎంతగానో తమ సహకారాన్ని అందిస్తుంటాయి. అలాగే పాడి ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్ధికంగా ఆదుకుంటూ వుంటాయి.
తమ యజమానిపట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవడం మాత్రమే వాటికి తెలుసు. ఆ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నయినా సంతోషంగా భరించడమే వాటికి తెలుసు. ధర్మస్వరూపమైన బసవన్నలు ... భూదేవి స్వరూపంగా చెప్పబడుతోన్న గోమాతలు ఇలా రైతన్నల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తుంటాయి. అందువలన ఈ రోజున పశువులశాలను శుభ్రపరచి ... గోమాతలను ... బసవన్నలను ప్రేమతో ముస్తాబు చేస్తారు.
ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారుచేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసినవారు భగవంతుడి ప్రీతికి పాత్రులవుతారు. దాంతో ఆయన వాళ్లని కనిపెట్టుకుని వుంటాడు. అందువలన కనుమ రోజున పశువులను పూజించడం వలన పాడిపంటలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది.
0 comments:
Post a Comment