ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం"
రాచనగరులో తెల్లవారు ఝాము ఆయినందుకు
గుర్తుగా మేలుకొలుపు నగారా మ్రోగుతున్నది. అమ్మవారు తృళ్ళిపడినది. ఈ యువక యోగి మధురవాక్కులలో కాలము ఆగిపోయినది. కాలము వదిగిపోయినది.
తల్లీ! ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు.
విశ్వానికి సాక్షిణి ని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా! అన్నది జగన్మాత అతని నోటివెంట ఆ నామాల అర్ధాలు వినాలనే కుతూహలంతో.
తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే గదా అమ్మా! సర్వ విశ్వానికి సాక్షిణి వైన నీవు ప్రాణులకు కాలము తీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ! అన్నాడు.
ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒకమాతృ మమత ఈయువకుని చూచినప్పటినుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలము వినోదమా! కాదు, కాదు. ఇంకేదో కారణము ఉన్నది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖుని లాగా ఏ జన్మలోనో తన బిడ్డా?
ఆట పూర్తి కాలేదు ఈ రోజు. సంహార కార్యక్రమము ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలము వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరికాసేపటిలో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్యభగవాను డొస్తాడు. "భానుమండలమధ్యస్థా" తన స్థానము. ఎంత మార్పు ఒక్క రాత్రిలో. ఈ యువకుడు ఏ మంత్రము వేశాడో! అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేసాడా! తీరా తను ఆట ఒడిపోదుకదా! పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపెయ్యాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీక రించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాలనయనాలు చూస్తూ ఆది శంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించాడు.
అమ్మవారి కుండలినీ యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రము లోనివి( "పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానము చేస్తూ పావులు చక చకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరత్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తున్నది.
దూరముగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభము అయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పధానికి మొదటి మెట్టు. "నాయనా! చివరి పందెము నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. " అవును తల్లీ, భూపురత్రయము, నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. తొమ్మదవ ఆవరణ చేరాము తల్లీ, నీవు బిందువులో యధాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యము ఏమున్నదమ్మా! అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? అన్నాడు.
నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహారకార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోర్కె తీర్చుకొని, పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా! అంది అమ్మవారు.
అవును తల్లీ! ఆట పరముగా విజయము నీది. కానీ తల్లీ, ఆట వైపు ఒక్క సారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరముగా, అక్షరసంఖ్యా శాస్త్ర పరముగా, మంత్ర శాస్త్రపరముగా గెలుపునాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి? సంఖ్యాశాస్త్రపరముగానా! అన్నది. ఏదీ స్ఫురించని అయోమయస్థితిలో.
"నవావరణములతో కూడిన శ్రీచక్రరూపము. శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీ చక్రము నీదేహమైతే, సహస్రనామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీ ఉనికిని, నీవే అర్ధరహితమని నిరూపిస్తావా! అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వము లోకి, తమస్సు లోకి జారిపోదా! అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపము లోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణరూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా తనని శ్రీచక్రములో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు.
గెలుపు తనదా! కాదు కాదు ఆ యువక యోగిదే.
ఆదిశంకరుడు అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహము వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీ భూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని గూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరునివైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది.
ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపములో చిత్రించిన ఈ ఆట చిత్రము వరకు నీ విశాలనయనాల చల్లని దృష్టి సారించు తల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పు పోకుండా ఏకరువు పెడతాను తల్లీ, ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం
పొల్లు పోదు. తప్పు, తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరిఅయిన బీజాక్షరాలను చూడు తల్లీ!
నలబై నాలుగు కోణాలు, తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆట చిత్రములో చూడు అమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్విక బీజాక్షరాలను సంఖ్యా శాస్త్రపరముగా మలచి, ఏ పొరబాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయము వరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. "అకారాది క్షకారాంత" దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యా పరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్క సారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చన గదా తల్లీ!
నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్రప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమములో భాగముగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రము చేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణ ప్రతిష్ట చేసాను. అదే నీ ముందున్న. "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:
"ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్త వైపు కించిత్ లజ్జ, కించిత్ వేదన తో బేలగా చూచినది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్రయంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకముగా ప్రసాదించాడు. "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీ ఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయములో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగానూ, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగా ఝురిలా ఉరకలు వేసిందా క్షణములో.
అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అపుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వ దేవీ, దేవ గణాలు ఆ స్వామి తీర్పు కోసము ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేసాడు. మధురాపట్టణమంతా మారు మ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్క సారి కైలాసమే కదిలి వచ్చినది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్త్యావేశముతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రముతో ఆది శంకరులు స్తోత్రము చేయసాగాడు. ఆయన నోటివెంట సురగంగ మహోధృత జలపాతములా స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపములో సాక్షాత్కరించాడు.
"దేవీ!" అన్నాడు పరమశివుడు.
మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించినది. ఇప్పుడామె "మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా". తామసము మచ్చుకైనా లేని మమతా పూర్ణ. భర్త ఆజ్ఞ, తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమ శివుడు ఇలా అన్నాడు. దేవీ! నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నము చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతులుగ ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని, మంత్ర పూతముగా సిద్ధము చేయాలి.
అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి, ఏ మలినము అంటని బాల్యములో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారం పొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమ తోనే జయించగల్గాలి.
అందుకే ఆ సమయము కోసము వేచిఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వ శాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితా శక్తి, అతడిని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసినది. అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు.
కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకొనేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే కావడముతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయినది. వారు పతనమైపోయారు. బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయినది.
లోక కళ్యాణము తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప, భక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తి పీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలని ప్రతిష్టించాడు.
నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్తులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు.
అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది. ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాల శంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డలాంటి బాల శంకరునివైపు మార్చి, మార్చి చూచినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనము అయినది. అమ్మవారిముఖములో ప్రశాంతత చోటుచేసుకొన్నది.
*శ్రీగురుభ్యోనమః అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది.ఆ సమయములోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరుని రంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్య బలిఅయి ఉంటాడని భయబ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయము వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే, తాను జీవించి ఉండడము అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి, కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై, ఆలయ ప్రవేశము చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రము చేస్తూ తన్మయత్వములో మునిగి ఉన్న ఆదిశంకరులు ధృగ్గోచరమయ్యారు.
పాండ్యరాజు "స్వామీ! నీవు జీవించే ఉన్నావా! నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా! అంటూ ఆదిశంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. తల్లీ! మరల నీసాత్విక రూపాన్ని కళ్లారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతో ఉంటే ఫలితము కలుగుతుంది సుమా!"పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది.
ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోనికి వెళ్లి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్రప్రభావము కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యముగా నిక్షిప్తమైనది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతములో మోకారిల్లి, నమస్కరించినపుడు వారి హృదయములో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుందాయంత్రము.
పాండ్యరాజు తన జన్మ సార్ధకమైనదని ఆనందించాడు.
నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైనది, నీవు కారణజన్ముడవు. మరేదయిన వరము కోరుకో! అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లీ! నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రము లోనూ, మీ స్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగానూ, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయేట్టు గాను,నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి, నా శరీరపతనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు.
అలాగే నాయనా! తథాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారినది. ఆలయములో అమ్మవారు, స్వామి వారు యధాస్థానాలలో అర్చా మూర్తులుగా వెలిశారు.
శంకరులు చేసిన శ్రీచక్రనమూనాలు విశ్వకర్మలకు అందాయి. శ్రీవిద్యోపాసకులకు, శ్రీవిద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసము ఉన్న వారికి శ్రీచక్రార్చన నియమముగా చేసే వారికి, లలితా సహస్రనామము తప్పులు లేకుండా పారాయణ చేయగా చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేసాయి.
అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్తులనూ పావనము చేస్తున్నాయి.