Pages

Story of Mata Manasa Devi - saviour of Serpants

 
 మాతా మానస దేవి

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లనిచూపులతో సంరక్షిస్తున్నారు. 

ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పొగొడుతుంది. అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు వుండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. 

మాతా మానసదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరోపేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమజేయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. రుత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. 

నాగులలో శ్రేష్టుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. 

దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి.సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతానఫలం కలుగుతుంది. 

హరిద్వార్లోని బిల్వపర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం లేదా రోప్వే వుంది. రోప్వేలో వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందరదృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్నిధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్టంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగిఆలయాన్ని దర్శించుకోవాలి. 

 
హరిద్వార్ రైల్వేస్టేషన్ నుంచి ఆలయం 2.5 కి.మీ.దూరంలో వుంది.రోప్వే ద్వారా వెళితే హిమాలయపర్వతశ్రేణిలోని శివాలిక్ అందాలు, గంగానది ప్రవాహాన్ని వీక్షించవచ్చు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online