Pages

Naraka chaturdashi

ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.


ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా


యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||


సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం.


తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌


అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||


దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం మొదలైన అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు తన్నివారణకై దీనిని చేయాలి.


ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది.


'ప్రాతః స్నానం తు యః కుర్యాత్‌


యమలోకం నపశ్యతి'


సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము అరుణోదయము ఆలోగా చేయాలి.


స్నాన మధ్యంలో ఉత్తరేణు, అనప, ప్రపున్నాటము (ఒక చెట్టు) శిరస్సుమీద త్రిప్పి స్నానం చేస్తే నరకంరాదు. అంటే తంటెస, (తుంటము, తుంటియము, తగిరిస, తగిరశ) అని దీనికి తెనుగులో పేర్లు. ఇది అంతటా దొరుకుతుంది. దీని పూవు. తంగేడు పువ్వులా ఉంటుంది కాని దానికంటే చిన్న పూవు. పిల్లలు ఈకాయలను కోస్తే చిటపటా పేలుతవి. ఉరణాక్షము అనికూడా దీనికి పేరు. ఉరణ మనగా పొట్టేలు. దీని ఆకులు పొట్టేలు కండ్లలాగా వుంటాయి.


పద్మంలో :-


అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం


భ్రామయేత్‌ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై||


అని ఉన్నది.


ఈ త్రిప్పటం క్రింది మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.


శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత


హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః|| దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.


స్నానం చేసినవెంటనే యమతర్పణం చేయాలి. ఇపుడు యముని నామావళిగల ఈ క్రింది శ్లోకాలు చెప్పాలి.


యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!


వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ||


ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|


మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||


యమాయతర్పయామి, తర్పయామి, తర్పయామి. అని మూడుసార్లు నువ్వులతో (తిలాంజలులు) వదలవలెను.


యమునికి పితృత్వం దేవత్వం రెండూకద్దు. కావున ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ దక్షిణాభిముఖులై ఉభయథా తర్పణం చేయవచ్చును. తలిదండ్రులున్న వారు మాత్రం నివీతి గానే చేయవలెను. ఈనాడు మాషపత్రభోజనం చేయాలి. అంటే మినపాకు కూర తినాలి. ఈమాసంలో ఇవి లభిస్తాయి.


మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః| ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే||


దీపదానం:-


సాయంకాలం ప్రదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ, మఠము లందునూ ఇవి పెట్టవలెను.


అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|


యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||


ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే.


ఉల్కాదానం (దివిటీలు):-


దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి.


లక్ష్మీపూజ:-


దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.


అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.


విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి.


అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపం కూడా అప్పుడే.


'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత-' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసిచేయడం జ్ఞానంతో చేయడం దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ, సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నవని మనం తెలుసుకోవాలి.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online