🌷 *శ్రీమద్భాగవతము*🌷
🌻 శిరస్సులో ప్రాణమయ కోశమునకు గల ప్రారంభ స్థానమును ధ్యానించుచు వెన్నెముక వెంట ఉన్న నాడీ మండలమును ఈ ప్రాణమయ కోశమను అశ్వము యొక్క దేహముగా ధ్యానము చేయుటయే అశ్వశిరస్సు అనబడు విద్య. దీని వలన సర్వజ్ఞత్వము, సకల బంధ విమోచనము కలుగును. దీనినే హయగ్రీవ విద్యగా మంత్ర శాస్ర్తము ఉపదేశించుచున్నది.
అశ్వినీ దేవతలకు దధీచి ఇది వరకే ఉపదేశించినట్లు నారాయణుడు చెప్పుచున్నాడు. దధీచి అను పదమునకు ధీ అను శక్తి అని అర్థము. ధారణ చేయు శక్తి, బుద్ధిబలము, వివేకము కలసి వెన్నెముక యందు ఎల్లెడెల వ్యాపించి పని చేయుచుండును. ఆ వెలుగునకు జీవులు చేయు కర్మతో సంబంధము లేదు. కనుకనే దధీచి అశ్వినులను జీవన్ముక్తులను చేసెనని చెప్పెను
బుద్ధిని ఆశ్రయించినచో అంతర్యామిత్వము దర్శనమిచ్చుననియు, దానిని వెన్నెముకలోను, శిరస్సులోను ధ్యానము చేసినచో అంతర్యామి యందు అన్య వస్తువులు చూడబడవనియు ఏకాంత స్థితి లభించి జీవన్ముక్తుడు అగుననియు భావన. ఇదియే వృత్రాసురుని వధ............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-346,347.
🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 నారాయణుడు దేవతలచే ఇంకనూ ఇట్లనెను...... ఆ దధీచియే విశ్వరూపునకు కూడా నా పేరున ఒక కవచమును ప్రసాదించెను. దానిని ఛేదించుటకు ఎవనికి శక్యము కాదు. (విశ్వమునందలి జీవుల రూపములు అన్నింటిలో వేరు వేరుగా నేనను ప్రజ్ఞ స్థాపించుకొని ఉన్నది. అది అందరిలో ఉన్నది కనుక ఏ ఒక్కరికిని లొంగదు. దాని వెనుక గల అంతర్యామిత్వమే నారాయణుడు. దానిని ధ్యానించుటయే నారాయణ కవచము.)
ఆ దధీచి మహానుభావుడు. అతడు దేహమును దాచుకొనక మీకు ఇచ్చును. (మనస్సునకు, ఇంద్రియములకు దేహముపై వ్యామోహము ఉండును. దేహమును తమ ప్రయోజనమునకై దాచుకొనవలెనని ఉండును. దీనినే దేహాభిమానము అందురు. బుద్ధిశక్తికి అట్టిది లేదు కనుక తనకు కావలసినది ఏదియు లేదు. దేహమును తనకు కావలెననుకొనక మనస్సునకు, ఇంద్రియములకు దానము చెయుననియును, ఈ పనికోసమే వెన్నెముకను ఉపయోగించుననియును అర్థము.)
ఆ దధీచి మహర్షి ఎముకలు విశ్వకర్మచే నిర్మింపబడినవి. (బుద్ధికి వాహనముగా ఉండుటకు దేహము ఏర్పడినది. అందు పిండమున గట్టి ఎముకలు నిర్మాణమగుట ఆశ్చర్యకరమైన సామర్థ్యము. అట్టి ఎముకలతోడి దేహపంజరమును అల్లుట తల నుండి వెన్నెముకకు ప్రజ్ఞలు దిగివచ్చి పనిచేయు నిర్మాణము చేయగలుగుట సామాన్యునకు చేతనైన పనులు కావు. ఆకాశమున ప్రతి భాగమందును ఇమిడి ఉన్న ఒక మహాప్రజ్ఞ ఏ గర్భమునందైనను అస్థిపంజరమును అల్లుచున్నది. ఆ మహాప్రపజ్ఞనే విశ్వకర్మ అందురు. త్వష్ట కుమారుడైన విశ్వరూపుడు విశ్వమునకు రూపములను ఈయగా విశ్వకర్మ నిర్మాణములను చేయచున్నాడు.)............✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-346,347.
ఓం నమో వేంకటేశాయ.......
0 comments:
Post a Comment