Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 నీ మహిమ ఒక అమృత సముద్రము. అందు ఒక బొట్టు ఎప్పుడో ఒకప్పుడు నాలుక మీద పడినంత మాత్రముననే సాధకులు సంతోషపడుచుందురు. నిరంతరమైన ఆ సుఖమును అనుభవించుచుందురు. అట్లు అనుభవించుటలో తాము చూచున్నవి, వినుచున్నవి, అనుభవింపబడుచున్నవి అగు ఇంద్రియార్థములు విస్మరింపబడి అఖండానుభూతి కలుగుచుండును. అట్టివారే పరమభాగవతులు.
వారు నీ పాద పద్మములను సేవించుటయే ధర్మమని నమ్మి మరువకుందురు. నీవు మూడు లోకములుగా ఉద్భవించుచున్నావు. మూడు లోకములను ఆక్రమించుచున్నావు. మూడింటిని చూచు దృష్టి కలిగి త్రిలోచనుడవై ఉన్నావు. మూడు లోకముల యొక్క మనోహరమైన అనుభవముగా ఉన్నావు.
మానవులు దానవులు మొదలగు భేదములన్నియు నీ యందున్న క్రమములే. ఈ క్రమములను వారెవరును దాటలేరు. నీవు నీ మాయ వలన సురలు నరులు మృగములు జలచరములు మొదలైన రూపములు ధరించి ఉన్నావు. ఆయా అవతారములలో దిగి వచ్చి మమ్ము తగిన విధముగా శిక్షణమిచ్చి రక్షించుచున్నావు.........✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-343.
Murali: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 దేవతలు ఇంకనూ ఇట్లనిరి..... నీవు భక్తవత్సలుడవు. నీ ముఖపద్మము నుండి వెలువడిన మధుర వచనామృతమందలి ప్రత్యేక కళలచే మా హృదయతాపమును తొలగింపుము. నీవు జగత్తులను పుట్టించుచు మనుచుచు లయము చేయుచు నీ దివ్యమాయచే వినోదించుచుందువు. జీవులందరకును లోపల వెలుపల గల పరబ్రహ్మముగా ఉన్నావు. సూటిగా తానుగా కూడా ఉన్నావు. దేశము కాలము దేహము దాని స్థితులు దానికి ఆధారములు దాని అనుభవములు కలిగి ఉన్నావు.
ఇన్నిటికి సాక్షివై, అతీతుడవై ఉన్న నీకు మేము ఏమని విన్నవింతుము. నీ దివ్య చరణారవిందముల నీడ-జాడలు లోకములకు ఆశ్రయములు. సంసార బాధలను పాపములను ఉపశమింప జేయుటకు అవి మాత్రమే అక్కరకు వచ్చును. వానిని ఆశ్రయించెదము. అని పలు విధముల స్తోత్రము చేసి ఇంకను ఇట్లనిరి.
ఇట్లు భక్తిపరవశులై దేవతలు అతి మనోహరముగా స్తోత్రము చేయుచుండిరి అప్పుడు ఆ పరమేశ్వరుడు అమృతమయములైన గంభీర సంభాషణములతో ఇట్లనెను:.......✍ *మాస్టర్ ఇ.కె.*
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 6(2)-344,345.
0 comments:
Post a Comment