సాధారణముగా మనం శ్రీరామ, శ్రీకృష్ణ లేక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఎక్కువగా చూస్తుంటాము. అత్యంత అరుదైన వామన లేదా త్రివిక్రమ ఆలయం ఒకటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, గుంటూరు జిల్లాలో, బాపట్ల దగ్గర లోని చెరుకూరు గ్రామంలో కలదు. బలిని చెర పట్టిన ఊరు కాబట్టి చెరయూరు, అదియే కాలక్రమేణా చెరుకూరు గా మారినది. మనకు తమిళనాడు (కంచి), కేరళ ఇతర ప్రాంతాలలో కూడా వామన అవతార దేవాలయములు కలవు. కానీ మొత్తము వామన అవతారమునకు సన్నివేశమును ఏక శిలపై స్వయంభు మూర్తిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం చెరుకూరులో వెలసిన శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం.
దేవాలయ చరిత్ర:
ద్వారసముద్రం (హళిబేడు)ని రాజదానిగా చేసుకొని పాలించిన హొయసల వంశ రాజులలో ప్రఖ్యాతుడు విష్ణువర్ధన్ మహారాజు. దక్షిణాదిన ఎన్నో ప్రాంతాలను తన అధీనం లోనికి తెచ్చుకొన్నాడు. దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వెళుతూ ఇక్కడ బస చేశారు. అప్పుడు సరస్సు ఒడ్డున చెట్టు నీడన లేత గులాబీ వర్ణంలో ఏకశిలా విగ్రహ రూపంలో శ్రీ త్రివిక్రమ స్వామి దర్శనమిచ్చారు. శ్రీ రామానుజాచార్యులు శిష్యుడైన విష్ణువర్ధనుడు భక్తితో ప్రణమిల్లి పూజాదులు నిర్వహించాడు. అనంతరం తనతో ఉన్న శిల్పులను పిలిచి విగ్రహాన్ని కదిలించకుండా ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. కారణమేమిటంటే విగ్రహం భూమిలో యెంత లోతుగా ఉన్నదో తెలియకపోవడమే. శిల్పులు తొలుత నాలుగు దిశలా మండపాలను నిర్మించారు. తదనంతరం రామాయణ, భాగవత మరియు భారత గాధల శిల్పాలను రమణీయంగా చెక్కిన రాళ్లతో గర్భాలయాన్ని నిర్మించారు. రాజు ఆలయ నిర్వహణకు కొన్ని గ్రామాల ఆదాయాన్ని తన వంతు కైకర్యంగా సమర్పించుకున్నాడు. తదనంతర కాలంలో ఎన్నో రాజవంశాలు వారు శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసినట్లుగా ఆలయం లో లభించిన శాసనాలు తెలియజేస్తున్నాయి. అలా తరతరానికి అభివృద్ధి చెందిన ఆలయం నరసరావుపేట జమీందారు శ్రీ వేంకట నరసింహారావు బహద్దూర్ గారి కాలంలో శిఖరాగ్రానికి చేరుకొన్నది. ప్రస్తుతం ఉన్న అనేక నిర్మాణాలు ఆయన కాలంలో నిర్మించబడినవి. అదే విధముగా ప్రతినిత్యము స్వామి వారి కైంకర్యములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు 365 ఎకరముల భూమిని ఈ దేవాలయమునకు సమర్పించారు.
స్వామి వారి మూలవిరాట్టు వివరములు:
గర్భాలయంలో సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వెడల్పు గల లేత గులాబీ వర్ణ శిల మీద మూడు పాదములతో మనకు దర్శనమిస్తారు. కుడి పాదం వద్ద ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, బలి చక్రవర్తి భార్య వింధ్యావళి, శుక్రాచార్యుడు ఉండగా, ఆకాశాన్ని తాకుతున్న ఎడమ పాదాన్ని బ్రహ్మాది దేవతలు కడుగుతుండగా (బహూశా దీనిని ప్రేరణగా తీసుకొనే అన్నమయ్య గారు బ్రహ్మ కడిగిన పాదము అనే కీర్తన వ్రాసినారేమో), పక్కనే నారద తుంబురాదులు ఆనంద గానం చేస్తుంటారు. స్వామి వారు దండం, కమండలం, ఛత్రం శంఖు చక్రాలను, పాదాలకు పావుకోళ్ళను ధరించి నయనమనోహర రూపములో దర్శనమిస్తారు. వామన అవతారమునకు సన్నివేశమును ఏక శిలపై స్వయంభు మూర్తిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం.
అగస్త్య మహాముని పర్యటన:
చెరుకూరులో శ్రీ అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ పర్యటన సందర్బంగా కొంతకాలం భార్య లోపాముద్ర, శిష్యప్రశిష్య బృందంతో విడిది చేసినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆ సమయంలో ఆయన భార్య కోరిక మేరకు పంచ శివలింగములలో ఒకటి చెరుకూరులో ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. చెరుకూరులో శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్టించిన శివాలయం శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయ సమీపంలోనే ఉంటుంది.
🌹🌹దీ నిని బట్టి శివ కేశ వులకు బేధం లేదు అని తెలుస్తుంది...........ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹
0 comments:
Post a Comment