Pages

The last message of Sri Krishna

లోకాన్ని ఉద్దరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన చివరి మాటలు:

కృష్ణుడు – ఉద్ధవుడు

ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆదుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.

‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందఱో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
 
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు. 
 
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online