Pages

Tamalapaaku (Paan patta) for weight loss

ఒకే ఒక చిట్కా, బరువు తగ్గిపోవచ్చు.

ఈ మధ్య కాలంలో చాలామందిని పట్టి వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఇందుకు చాలామంది, చాల విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక చాలామందికి చెయ్యాలని ఉన్నా కూడా, సమయాభావం వల్లనో, బద్ధకం వల్లనో వారి ప్రయత్నాలను ఏరోజుకు ఆ రోజు వాయిదావేసుకుంటూ వస్తుంటారు. అలంటి బద్దకస్తులకు కూడా ఇంటిదగ్గరే ఉంది బరువు తగ్గే సలహాలు ఇస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారు సూచిస్తున్న పరిష్కారం ఏంటంటే,
 
 “తమలపాకు”.
 
 
అవును ప్రతిరోజు మన డైట్ లో తపలపాకును భాగం చెయ్యడం వలన బరువు తగ్గవచ్చునట. తమలపాకు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మన శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ” లేత మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న తమలపాకులో 5-6 మిరియాల గింజలు వేసి, తమలపాకును మడిచి తినాలని, అలా ఒక నెలరోజులు చేస్తే చాల వరకు బరువు తగ్గిపోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ” ఇలా ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వలన, మిరియాలలో ఉండే ప్యాతో న్యూట్రిఎంట్స్, పెప్పేరిన్ కొవ్వుతో రసాయనిక చర్య జరిగి కొవ్వు విచ్చిన్నం జరుగుతుందని చెబుతున్నారు.
 
అంతే కాకుండా, తమలపాకు కడుపు ఉబ్బరం వ్యాధిని, గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాలను కూడా నిరోదిస్తుందని  సలహా ఇస్తున్నారు.

Barley seeds for weight loss

అధిక బరువు అరికట్టే మంచి ఆహారం - బార్లీ గింజలు

'' అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది, కేలరీలు అతి తక్కువ, ఒక మంచి ఆహారంగా కూడా పనిచేసి మీరు సన్నగా నాజూకుగా వుండేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది.''   ఇన్ని ప్రయోజనాలున్న ఈ గింజలేమిటో తెలుసా? అదే బార్లీ గింజలు. ఆంధ్రులకు బార్లీ గింజలు కొత్తేమీ కాదు. గతంలో ఇండ్లలో ఒక్కరోజు జ్వరం పడితగ్గితే చాలు బార్లీ జావలు కాచి ఇచ్చేవారు. అద్భుతమైన ఈ గింజలో నీటిలో కరగని పీచు వుండి శరీరంలో నీటిని నిలిపివుంచుతుంది. పేగులలో వుండే మలినాలను వేగంగా బయటకు పంపేస్తుంది. కేన్సర్ అరికడుతుంది. మలబద్ధకం రాకుండా కూడా బార్లీ జావ తాగుతారు. బార్లీ నీరు కిడ్నీలకు ఒక వరంగా భావించాలి. కీళ్ళనొప్పులు, వంటి నొప్పుల సమస్యలను మాయం చేస్తుంది.

దీనిని ఎలా తయారు చేయాలి? బార్లీ గింజలను మెత్తగా నీటిలో ఉడికించండి. వడగట్టండి. కొంచెం రుచిగా వుండటానికిగాను వడకట్టిన నీటిలో ఆరెంజ్ జ్యూస్ లేదా నిమ్మరసం కలపండి. అంతే మీ బార్లీ నీరు తయారైనట్లే. దీనిని ఫ్రిజ్ లో లేదా చల్లని ప్రదేశంలో వుంచితే, పోషకాలు పోకుండా వుంటాయి. ఇంత  అధ్భుతమైన బార్లీ గింజలను, ప్రతిరోజూ మనం తినే సూప్ సలాడ్, సిరియల్ వంటి వాటిలో  కూడా వేసుకొని ప్రయోజనం పొందవచ్చు

Surya sthotram for good health

సర్వ రోగ నివారిణి – సూర్యభగవానుడి స్తోత్రం

పూర్వం శ్రీ కృష్ణుని కుమారుడు అయిన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ సూర్యస్తోత్రమును పఠించాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.

1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు

భావం : ఇప్పుడే ఉదయించి ఉత్తరంవైపుగా పయనిస్తున్న ఓ సూర్యదేవా… నాలో వున్న గుండెజబ్బును, కంటిజబ్బును, ఇతర సర్వరోగాలను త్వరగా పోగొట్టాలని కోరుతూ నేను నిన్ను ప్రార్థిస్తున్నాను!

2. నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ

భావం : కేవలం అరనిముషంలోనే ఆకాశముపై రెండువేల రెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా! నీకు నమోవాకం!

3. కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ

భావం : కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను ఐదేదు చొప్పున కల్పించే ఆ ద్వాదశ మూర్తి… మనస్సు, జీవుడు కూడా తానే అయి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
 
4. త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ

భావం : ఓ సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస మొదలైనవన్నీ నీవే!

5. శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి

భావం : శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానాన్ని, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, ఆరోగ్యమును కల్పిస్తావని మేము భక్తితో నిన్ను కోరుతున్నాను. మమ్మల్ని అనుగ్రహించు.!

6. త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు

భావం : మాలో వున్న చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల వంటి మొదలైన దోషాలను… సూర్యభగవానుడివైన నువ్వు ఒకే విధమైన నీ కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నాము!

7. తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్

భావం : రోగాల మూలములకు కాలకర్త అయిన ఓ సూర్యదేవా…! నువ్వు ఏ విధంగా అయితే నాలుగువైపుల అలుముకుని వున్న చీకటిని దూరం చేస్తావో… అదేవిధంగా మా కంటిరోగాలను (రేచీకటి జబ్బు), రోగపటలముల నుంచి విముక్తి కలిగిస్తావని కోరుతున్నాను.

8. యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః
 
భావం : వేయి కిరణాలను కలిగివున్న ఆ సూర్యుని నుంచి వెలువడే కేవలం ఒక కిరణ భాగం చంద్రుని మీద పడి.. రాత్రివేళ వున్న చీకటిని మాటుమాయం చేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి శక్తిని కలిగి వున్న సూర్యదేవా.. మమ్మల్ని ఆపదల నుంచి బాగుచేయమని కోరుతున్నాము.

9. యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే

భావం : ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం అవుతుందో… ఏ సూర్యుని వెలుగుచే ప్రతిఒక్క ప్రాణి తెలివిగలదీ అవుతుందో… ఏ భాస్కరుడు ఆపదలను రూపుమాపుతాడో… అటువంటి ఆపద్మభాందవుణ్ణి మేము ప్రార్ధిస్తాను.

10. వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి

భావం : వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం వంటి మహారోగాలను పోగొట్టే దివ్యవైద్యుడివి నీవే సూర్యదేవా!

11. ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః
 
భావం : ధర్మార్ధ కామమోక్షాలను సాధించే కర్మలను చెయ్యనీయకుండా మిక్కిలి తాపం కలిగించి, ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక! మామీద కరుణ చూపించాలని కోరుతున్నాము.

12. త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ
 
భావం : ఓ సూర్యదేవా! నీవే నా తల్లివి, నీవే నాకు దిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

ఫలశ్రుతి :
ఈ పన్నెండు ఆర్యావృత్తాలు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

Importance of Akshaya Tritiya

మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ.

ఆ రోజునే 

సింహాచల వరాహ నరసింహ స్వామి వారి  చందనోత్సవం.

అదే రోజున

పరశురామ  జయంతి .

మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం   అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. *అసలు ఈరోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు. 

అక్షయ తృతీయ నాడు, మనం  చేపట్టిన  ఏ  కార్య  ఫలమైనా, [ అది  పుణ్యం కావచ్చు; లేదా  పాపం  కావచ్చు.] అక్షయంగా,  నిరంతరం,  జన్మలతో  సంబంధం లేకుండా,  మన  వెంట  వస్తూనే  ఉంటుంది.
 
 పుణ్య  కర్మలన్నీ  విహితమైనవే.  అందునా,  ఆ రోజు  ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి, దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన  జీవుడికి    దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు. అతిధులకు, అభ్యాగతులకు,  పెరుగన్నంతో  కూడిన  భోజనం  సమర్పిస్తే,  ఏ  రోజూ  ఆకలితో  మనం అలమటించవలసిన   రోజు  రాదు. వస్త్రదానం వల్ల  తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు    సమర్పించుకుంటే,  మన  ఉత్తర జన్మలలో,  వాటికి  లోటు  రాదు. గొడుగులు, చెప్పులు,  విసన కర్రల లాటివి  దానం  చేసుకోవచ్చు.

ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. ఓ  సారి  పరిశీలిస్తే, భాగవతం  ప్రధమ స్కంధం ప్రకారం,   పరీక్షిన్మహా రాజు  కలి పురుషుడికి  ఐదు  నివాస స్థానాలను  కేటాయించాడు.  అవి:

*జూదం,  మద్య పానం, స్త్రీలు, ప్రాణి వధ,  బంగారం*.  వీటితో పాటు కలి కి  లభించినవి 

*ఇంకో  ఐదు*

అసత్యం,గర్వం, కామం, హింస, వైరం.  జాగ్రత్తగా  పరిశీలిస్తే,  ఆ పైన  ఉన్న  ఐదిటికీ  ఇవి  అనుషంగికాలు.
ఆ  పై  ఐదిటినీ  ఇవి  నీడలా  వెన్నంటే  ఉంటాయి.

అక్షయ తృతీయ  రోజు  ఎవరైనా,  ఈ  ఐదిటిలో  దేని  జోలికి  వెళ్ళినా,  కలి పురుషుడి  దుష్ప్రభావం
అక్షయంగా  వెంటాడుతూనే  ఉంటుంది.
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online