శ్రీ సీతారామ కల్యాణ సమయంలో ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకునే ఘట్టాన్ని బహు-చమత్కార భరితంగా వర్ణించిన శ్రీ రామకర్ణామృతం లోని ఈ క్రింది సంస్కృత శ్లోకాన్ని మన తెలుగువారు చాలా మంది పెండ్లి శుభలేఖపై తెలుగు లిపిలో ముద్రింప చేసి తద్వారా తమ ఇంటి వధూవరులకు ఆ పురాణ దంపతుల మంగళాశాసనం పొందడం ఒక ఆచారంగా వస్తున్న విషయం మనందరికీ తెలిసినదే.
భక్తిరస ప్రబోధకాలైన మూడు (రామ, శివ, కృష్ణ) కర్ణామృత కావ్యాలలో, శ్రీశివ కర్ణామృతం-భరద్వాజ ముని, శ్రీకృష్ణ కర్ణామృతం-లీలాశుకులు రచించినట్లు నిర్ధారణ గా తెలిసినప్పటికీ, శ్రీరామకర్ణామృతం ఎవరు రచన చేసేరన్న విషయంలో స్పస్టమైన ఆధారం లేదు.. శ్రీరామకర్ణామృతం శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచితమని చేకూరి సిద్ధయ్య కవి చెప్పినారు. కానీ శ్రీ శంకరాచార్య చరిత్రను రచించిన పండితులెవ్వరూ శ్రీరామకర్ణామృతం ఆది శంకర విరచిత మని పేర్కొనలేదు. ఈ శ్రీరామకర్ణామృత కావ్యం ఆది శంకరుల రచన కాకపోయినప్పటికీ, వారి తర్వాతి పీఠాధిపతులు రచించి వుండవచ్చని మరికొందరి అభిప్రాయం.
శ్రీ రామ భక్తి రసాన్ని దాదాపు 400 శ్లోకాలలో అత్యంత మధురంగా వర్ణింపబడ్డ ఈ కావ్య రచయిత ఎవరైనప్పటికీ, ఆయన మహాతపస్వి అనడానికి ఈ క్రింది శ్లోకం ఒక్కటి చాలు.. ఈ శ్లోకం కోటాన కోట్ల పెండ్లిండ్లు చేయించినది, చేయించుచున్నది, చేయించబోతున్నది.. ఇంతటి శక్తిని ఈ శ్లోకంలో ధారపోసినది నిశ్చయముగా మహాతపశ్శక్తి సంపన్నుడైన మహర్షి అనడం లో సందేహం లేదు. ఈ మహిమాన్విత శ్లోకం నిత్యం పారాయణ చేయదగినది..
౹౹శ్లో.౹౹(1.82)
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితా
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయి తాః౹
స్రస్తాః శ్యామల కాయ కాంతికలితాః యా ఇంద్ర నీలాయితా
ముక్తా స్తా శ్శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః౹౹
తా... పెళ్ళి కూతురుగా సీతమ్మ తల్లి, శ్రీరాముడి తల మీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే) ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాముని శిరస్సుపై పోసినపుడు (ఆయన తలపై తెల్లని పట్టు వస్త్రం తో అలంకరింపబడిన పెళ్ళి-తలపాగా మీద పడి) అవి తెల్లని మల్లెపూల వలే ఒప్పాయట (కుంద ప్రసూనాయితాః)! ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా (ఇంద్ర నీలాయతా) భాసించాయట. అలాంటి శ్రీరామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు (శ్రీ రామ వైవాహికాః) అందరికీ శుభం కలుగ జేయుగాక (శుభదాః భవంతు భవతామ్)!
0 comments:
Post a Comment